ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, ప్రఖ్యాత నటి సుహాసిని దంపతులు అన్న సంగతి తెలిసిందే. ఈ జంట సొంతంగా మాద్రాస్ టాకీస్ పేరుతో సినిమాలు నిర్మిస్తారన్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ బ్యానర్‌లో ఇటీవలి కాలంలో తెరకెక్కిన సినిమాలన్నీ అట్టర్‌ప్లాప్‌లు అవుతున్నాయి. మణిరత్నంలో విషయం అయిపోయింది అన్న కామెంట్లు కూడా వినిపించాయి. అయితే ఇలా ఫ్లాప్‌లవుతున్న సినిమాల విషయంలో రివ్యూలు రాసేవాళ్ల పక్షపాత బుద్ధి వల్లే ఇలా అవుతోంది అంటూ సుహాసిని విమర్శించారు. రివ్యూలు రాసేవాళ్లకు కాస్తయినా ఇంగిత జ్ఞానం లేదు అన్నట్టే మాట్లాడారు. ఇటీవల ఓ మీడియా ఇంటరాక్షన్‌లో సుహాసిని తన అభిప్రాయాల్ని సూటిగా చెప్పుకొచ్చారు. సామాజిక వెబ్‌సైట్లలో, వెబ్ పోర్టల్స్‌లో రాసే సమీక్షలన్నీ అపరిపక్వంగా ఉంటున్నాయి. వాటిని పట్టించుకోవాల్సిన పనే లేదు. 23ఏళ్లుగా మాద్రాస్ టాకీస్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలు తెరకెక్కించాం.. అంటూ చెప్పుకొచ్చారు. కాకిపిల్ల కాకికి ముద్దు అన్న చందంగా ఎవరి సినిమాలు వారికి ముద్దొస్తాయి. అయితే జనాలకు ముద్దొచ్చాయా? లేదా?అనేదే ముఖ్యం. ముద్దు రాకపోయినప్పుడే తిరస్కారం. రివ్యూలు చదివేవాళ్లు 15 శాతం మాత్రమే. వాళ్లు సినిమా జాతకాల్ని మార్చేసేంత గొప్పవాళ్లేమీ కాదు. కాబట్టి వాస్తవం ఏమిటో? కాస్త పరిశీలించండి మ్యాడమ్!