ఆ పోలిక సుజీత్ పై ఒత్తిడి పెంచేస్తోందా?

Update: 2019-08-13 14:11 GMT
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాల‌న్న‌ది సిద్ధాంతం. సినీప‌రిశ్ర‌మ‌లో గొప్ప గొప్ప వాళ్లు అనుస‌రిస్తున్న ప‌ద్ధ‌తి ఇది. న‌వ‌త‌రం హీరోలు ద‌ర్శ‌కుల‌తో పాటు స్టార్ ఇమేజ్ ఉన్న ప్ర‌ముఖులు సైతం ఇందుకు అతీతం కాదు. ఈ విష‌యంలో యంగ్ డైరెక్ట‌ర్ సుజీత్ ని మెచ్చుకుని తీరాలి. త‌న‌ని ఏకంగా రాజ‌మౌళి స్థాయి ద‌ర్శ‌కుడితో పోల్చేస్తుంటే అత‌డు ఖంగు తింటున్నాడు. కాస్తంత కంగారు ప‌డుతూ అలా పోల్చొద్ద‌ని అభ్య‌ర్థిస్తున్నాడు.

సాహో ద‌ర్శ‌కుడిగా ప్ర‌స్తుతం అత‌డి పేరు కేవ‌లం తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనే కాదు అటు బాలీవుడ్ లో ఇత‌ర‌త్రా ప‌రిశ్ర‌మ‌ల్లోనూ మార్మోగిపోతోంది. ఎస్.ఎస్.రాజ‌మౌళి త‌ర్వాత ఆ స్థాయి ద‌ర్శ‌కుడు అంటూ ప‌త్రిక‌ల్లో ప‌తాక స్థాయిలో ఆర్టిక‌ల్స్ రావ‌డం ఒక ర‌కంగా కంగారు పెట్టేస్తోంది. బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ తో సినిమా తెర‌కెక్కిస్తుండ‌డం అత‌డికి ఈ స్థాయిని ఇచ్చింద‌న‌డంలో సందేహం లేదు. పైగా రెండో సినిమాకే అంత పెద్ద స్టార్ తో దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్ సినిమాని తీస్తున్నాడంటే లోక‌ల్ మీడియాల‌తో పాటు జాతీయ మీడియాలోనూ దీనిపై ఆస‌క్తిక‌ర డిబేట్ సాగుతోంది. అందుకే సుజీత్ ని ఏకంగా ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళితోనూ .. అత‌డు తీస్తున్న `సాహో` చిత్రాన్ని `బాహుబ‌లి`తోనూ పోల్చేస్తున్నారు.

అయితే త‌న‌ను ఇలా పోల్చేస్తుంటే సుజీత్ ఒక‌ర‌కంగా కంగారు ప‌డిపోతున్నాడు. పైగా బాహుబ‌లితో అస‌లు త‌న సినిమాకి పోలికే వ‌ద్ద‌ని అభ్య‌ర్థిస్తున్నాడు. అయినా రాజ‌మౌళి స‌ర్ తో పోలికేంటి?  అలా పోల్చేస్తే మా అమ్మ అస్స‌లు ఒప్పుకోదు! అంటూ త‌న‌దైన శైలిలో మీడియా ఇంట‌ర్వ్యూలో చెబుతున్నాడు సుజీత్. ఖాన్ ల‌తో పోల్చేస్తుంటే డార్లింగ్ ప్ర‌భాస్ సైతం అంతే డౌన్ టు ఎర్త్ గా స్పందిస్తున్నారు. ప‌రిశ్ర‌మ‌కు దారి చూపిన ఖాన్ ల‌తో న‌న్ను పోల్చొద్ద‌ని అన్నారు ప్ర‌భాస్. ఇప్పుడు సుజీత్ కూడా డార్లింగ్ బాట‌లోనే త‌న‌ను అంత పెద్ద ద‌ర్శ‌కులతో పోల్చ‌వ‌ద్ద‌ని మీడియాని అభ్య‌ర్థిస్తున్నాడు. ఒక వేళ నన్ను నేను రాజమౌళి సర్ తో పోల్చుకుంటూ అహంకారంగా మాట్లాడితే అమ్మ నన్ను ఎందుకు అలా మాట్లాడుతున్నావని అడుగుతుంది అంటూ సుజీత్ మ‌న‌సు దోచేస్తున్నాడు. ఎంత ఎదిగినా సుజీత్ ఇలా ఒదిగి ఉండ‌డం త‌న‌కు బాగా క‌లిసొస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఇక త‌న‌ని న‌మ్మి అంత బ‌డ్జెట్ పెట్టిన యు.వి.క్రియేష‌న్స్ సాహ‌సాన్ని అత‌డు కొనియాడ‌కుండా ఉండ‌లేక‌పోతున్నాడు. అవ‌కాశం ఇచ్చిన దేవుడు ప్ర‌భాస్ ని అత‌డు ప్ర‌తి సందర్భంలోనూ గుర్తు చేసుకుంటూ శ‌హ‌భాష్ అనిపిస్తున్నాడు. ఇది ఇత‌ర న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌కు స్ఫూర్తి అనే చెప్పాలి. ఇక చెన్న‌య్ ప్ర‌మోష‌న్స్ లో త‌మిళ‌ మీడియాలు అయితే శంక‌ర్ తోనూ పోల్చేసే ప్ర‌మాదం లేక‌పోలేదు. అక్క‌డా సుజీత్ ఇలానే డౌన్ టు ఎర్త్ ఉంటాడ‌న‌డంలో సందేహ‌మేం లేదు.


Tags:    

Similar News