సునీల్.. ఓవైపు సంతోషం.. మరోవైపు బాధ

Update: 2016-07-24 04:36 GMT
వరుసగా మూడు డిజాస్టర్లు కొట్టి హీరోగా తన కెరీర్‌ ను ప్రమాదంలో పడేసుకున్నాడు సునీల్. ఇతడికి హీరో వేషాలు అవసరమా.. బుద్ధిగా ఆ కామెడీ వేషాలే వేసుకోవచ్చు కదా అంటూ జనాలు సెటైర్లు వేసే వరకు వచ్చింది పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో సునీల్ ఆశలన్నీ ‘జక్కన్న’ మీదే ఉన్నాయి. ఈ సినిమానే హీరోగా తన భవిష్యత్తును నిర్ణయిస్తుందని భావిస్తున్నాడు సునీల్. ఐతే ఈ సినిమా విడుదలకు ఓ రిస్కీ డేట్ ఎంచుకుని సాహసానికి సిద్ధమైపోయాడు సునీల్. 22న ‘కబాలి’ వస్తున్నా సరే.. ధైర్యంగా 29న ‘జక్కన్న’ను రిలీజ్ చేయడానికి నిర్ణయించారు. ‘కబాలి’కి పాజిటివ్ టాక్ వచ్చి ఉన్నట్లయితే సునీల్ సినిమాకు పంచ్ మామూలుగా ఉండేది కాదు. ఐతే రజినీ సినిమా నెగెటివ్ టాక్‌ తో మొదలవడం సునీల్‌ కు సంతోషాన్నిచ్చే విషయమే. వీకెండ్లో వసూళ్లు అదిరిపోతున్నప్పటికీ.. సోమవారం నుంచి ‘కబాలి’ జోరు పడిపోతుందనడంలో సందేహం లేదు. తర్వాతి వీకెండ్‌ కు ‘కబాలి’ బాగా డల్లయిపోయే అవకాశముంది కాబట్టి.. సునీల్ దాని గురించి పెద్దగా కంగారు పడక్కర్లేదు.

ఐతే సూపర్ స్టార్ సినిమా బాధ తప్పినా.. పోటీగా విడుదలయ్యే ఓ చిన్న సినిమా సునీల్‌ కు తలపోటుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ సినిమానే పెళ్లిచూపులు. తరుణ్ భాస్కర్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విడుదలకు ఇంకా వారం ఉండగానే కొందరు సినీ ప్రముఖులకు - మీడియా వాళ్లకు ‘పెళ్లి చూపులు’ స్పెషల్ షో వేశారు. అందరూ కూడా సినిమా గురించి చాలా పాజిటివ్‌ గా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో సినిమా గురించి చాలా మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఈ ఊపులో విడుదలకు నాలుగు రోజుల ముందే విజయవాడలో ఇంకో ప్రివ్యూ షో కూడా వేస్తున్నారు. కాబట్టి ‘పెళ్లి చూపులు’ స్యూర్ షాట్ హిట్‌ లాగా కనిపిస్తోంది. మరి ‘జక్కన్న’కు పాజిటివ్ టాక్ రాకుంటే ఈ సినిమా గట్టి దెబ్బ తీసే అవకాశముంది. మరి సునీల్ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
Tags:    

Similar News