ఓటీటీ అప్డేట్... ఆ ఒక్కటి ఆలస్యం!
ప్రేక్షకులు ఈ మధ్య థియేటర్ రిలీజ్ కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అదే స్థాయిలో ఓటీటీ సినిమాలు, సిరీస్‌ల కోసం వెయిట్ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.
ప్రేక్షకులు ఈ మధ్య థియేటర్ రిలీజ్ కోసం ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో అదే స్థాయిలో ఓటీటీ సినిమాలు, సిరీస్‌ల కోసం వెయిట్ చేస్తున్నారు అనడంలో సందేహం లేదు. ఓటీటీ ద్వారా ప్రతి వారం పెద్ద సినిమాలు, సిరీస్‌లు, షోలు వస్తూనే ఉన్నాయి. థియేటర్‌లో విడుదల అయిన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు సినిమాలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది అంత ఖర్చు పెట్టి థియేటర్‌కి వెళ్లడం ఎందుకు అనే ఉద్దేశ్యంతో ఓటీటీలోనే చూద్దాం అనుకుంటున్నారు. దాంతో ఓటీటీలో విడుదల కోసం ఎదురు చూపులు ఎక్కువ అవుతున్నాయి.
గత నెల 31న దీపావళి సందర్భంగా టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్, శివ కార్తికేయన్ హీరోగా నటించిన తమిళ్ మూవీ డబ్బింగ్ వర్షన్ అమరన్, కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. సాధారణంగా ఒకే వారం వచ్చిన రెండు మూడు సినిమాలు అన్నీ విజయాన్ని సొంతం చేసుకోవడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. కానీ దీపావళి కానుకగా వచ్చిన మూడు సినిమాలకు మూడు సినిమాలు బ్రేక్ ఈవెన్ వసూళ్లు సాధించడం మాత్రమే కాకుండా హిట్ సినిమాలుగా నిలిచిన విషయం తెల్సిందే.
హిట్ సినిమాలకు ఓటీటీలో మంచి స్పందన ఉంటుంది. దాంతో ఈ మూడు సినిమాలు ఓటీటీ లో ఎప్పుడు వస్తాయా అంటూ చాలా ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు నాలుగు వారాల తర్వాత లక్కీ భాస్కర్, క సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అయ్యాయి. దుల్కర్ సల్మాన్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చి బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లక్కీ భాస్కర్ సినిమాను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అయింది. ఈనెల 28న సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చింది.
కిరణ్ అబ్బవరం హీరోగా న టించిన విభిన్న చిత్రం 'క' సైతం ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నయన్ సారిక, తన్వి రామ్‌లు హీరోయిన్స్ గా నటించిన 'క' సినిమాలోని కథకు విమర్శకులు ఫిదా అయ్యారు. చిరంజీవితో పాటు పలువురు క సినిమాపై ప్రశంసలు కురిపించారు. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను ఈటీవీ విన్ దక్కించుకుంది. ఈనెల 28న ఈటీవీ విన్ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. కానీ శివ కార్తికేయన్ సినిమా అమరన్ మాత్రం ఈ వారం రావడం లేదు. బాక్సాఫీస్ వద్ద అమరన్ ఇప్పటికే రూ.250 కోట్ల వసూళ్లు క్రాస్ చేసింది. మరో వారం లేదా రెండు వారాల పాటు అమరన్ బాక్సాఫీస్ సందడి కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కనుక అమరన్ ఓటీటీ స్ట్రీమింగ్ కి కనీసం రెండు వారాల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.