'పుష్ప' ఫస్టు పార్టు విలన్ ఫహాద్ కాదా?

Update: 2021-09-30 04:34 GMT
అవినీతికి అడవిని మించిన అడ్డా లేదు .. అవినీతి పరులకు అడవిని మించిన ఆదాయ మార్గం లేదు. తమ అక్రమాలను అమాయకులైన గిరిజనులు ప్రశ్నించలేరు. వాళ్ల అన్యాయాలతో అక్కడి జంతువులకు పనిలేదు. అందువల్లనే అడవులు ఎక్కువగా కొల్లగొట్టబడుతూ ఉంటాయి. అడవి నేపథ్యంలో సాగే అక్రమాలకి సంబంధించిన కథలు రావు గోపాలరావు విలనిజం సమయంలో ఎక్కువగానే తెరపైకి వచ్చాయి. అడవి అనేదే అసలు ఇంట్రెస్టింగ్ పాయింట్ కనుక, ఈ నేపథ్యంలో వచ్చిన కథలకు మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది.

ఈ మధ్య కాలంలో కట్టెల కోసమే తప్ప కథల కోసం అడవుల వరకూ ఎవరూ వెళ్లడం లేదు. ఈ పొల్యూషన్ లో నుంచే కావలసినన్ని కథలను క్రియేట్ చేస్తున్నారు. కానీ ఎప్పుడూ కొత్తగా ఆలోచించే సుకుమార్ .. 'నాన్నకు ప్రేమతో' సినిమాను పూర్తిస్థాయిలో విదేశాల్లో చిత్రీకరించాడు. ఆ తరువాత 'రంగస్థలం' సినిమాను గ్రామీణ వాతావరణంలో తెరకెక్కించాడు. ఇక ఈ సారి ఇంకాస్త లోపలికి వెళ్లి, అడవిలో జరిగే అక్రమాలతో పాటు అక్కడి అందాలను కూడా 'పుష్ప'గా తెరపై ఆవిష్కరించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు.

సుకుమార్ తన సినిమాలకు సంబంధించిన కథ .. స్క్రీన్ ప్లే .. మాటలను తనే వండుకుంటాడు. అందువలన సహజంగానే ఆలస్యమవుతూ ఉంటుంది. కరోనా కారణంగా ఈ సారి మరింత ఆలస్యమవుతోంది. ఈ సినిమా కథా పరిధి చాలా పెద్దది. అందువలన ఆయన ఈ సినిమాను రెండు భాగాలుగా అందించనున్నట్టు ముందుగానే చెప్పాడు. కథానాయికగా రష్మిక ఈ సినిమాలో గిరిజన యువతిగా కనిపించనుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఆమె లుక్ ను చూసిన వాళ్లు, ఇలాంటి అమ్మాయి తోడుంటే అడవి కూడా అందంగానే కనిపిస్తుందని అనుకుంటున్నారు.

ఇక ఈ సినిమాలో ప్రతినాయకుడిగా ఫహాద్ ఫాజిల్ కనిపించనున్నాడు. ఆయన విలనిజం ఒక రేంజ్ లో ఉంటుందని చెప్పారు. నిజంగానే ఇటీవల వదిలిన ఆయన ఫస్టులుక్ కూడా అదే మాట చెప్పింది. అడవిలో ఇంతకుమించిన మృగాలు ఉండవంటూ ఇచ్చిన హింట్, ఆ పాత్రపైనా .. సినిమాపైన మరింతగా ఆసక్తిని పెంచుతూ పోతున్నాయి. అయితే ఈ సినిమా మొదటి భాగం షూటింగు చివరిలో ఫహాద్ జాయిన్ అయ్యాడు. ఆయన పాత్రపై ఎక్కువ రోజులు షూటింగు జరిగినట్టుగా కూడా సమాచారం లేదు. దాంతో ఫస్టు పార్టులో ఆయన ఎక్కువగా కనిపించడా? సెకండాఫ్ లో ఎంట్రీ ఇస్తాడా? అనే సందేహాలు కలిగాయి.

ఈ విషయంలో సందేహానికి సమాధానంగా ఇప్పుడు ఒక టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ఫస్టుపార్టు చివరిలో ఫహాద్ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. ఆయన ఎంట్రీపై ఫస్టు పార్టును ముగించి, సెకండ్ పార్టుపై ఉత్కంఠను రేకెత్తిస్తారని అంటున్నారు. అయితే అప్పటివరకూ ఈ సినిమాలో విలన్ ఉండడా? అనే డౌటు రావడం సహజం. ఏ హీరో .. ఏ హీరోయిన్ ఇంతవరకూ తెరపై హాయిగా పాడుకున్నారు? ఎవరూ కూడా విలన్ టెన్షన్ తో 5 నిమిషాలకి మించి పాట పాడుకోలేకపోయారు. అలాగే ఫస్టు పార్టు చివరిలో ఫహాద్ ఎంట్రీ ఇచ్చేవరకూ మరో విలన్ ఉన్నాడు .. ఆ విలన్ ఎవరో కాదు సునీల్.

తెలుగులో ఇంతవరకూ ముందుగా విలన్ .. ఆ తరువాత హీరోగా చేసిన వాళ్లు ఎక్కువ. కానీ సునీల్ తన రూటే వేరన్నట్టుగా వస్తున్నాడు. కమెడియన్ గా మెప్పించిన ఆయన ఆ తరువాత హీరోగా కొంతకాలం పాటు సందడి చేసి, అక్కడి నుంచి విలన్ వేషాల వైపు కూడా ఓ లుక్కేస్తున్నాడు. అలా ఈ సినిమాలో ఆయన విలన్ పాత్రలో కనిపించనున్నాడని అంటున్నారు. ఇక ఆయన పాత్రను సుకుమార్ ఎలా డిజైన్ చేశాడనేది చూడాలి. 'క్రిస్మస్' కి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనే బలమైన నమ్మకంతో అభిమానులు ఉన్నారు.




Tags:    

Similar News