మూవీ రివ్యూ: 'సూపర్ ఓవర్'

Update: 2021-01-22 06:53 GMT
చిత్రం : ‘సూపర్ ఓవర్’

నటీనటులు: నవీన్ చంద్ర-చాందిని చౌదరి-రాకేందు మౌళి-అజయ్-వైవా హర్ష-ప్రవీణ్ తదితరులు
సంగీతం: సన్నీ ఎం.ఆర్
ఛాయాగ్రహణం: దివాకర్ మణి
నిర్మాత: సుధీర్ వర్మ
రచన-దర్శకత్వం: ప్రవీణ్ వర్మ

థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటీటీల్లో కొత్త సినిమాల విడుదలేమీ ఆగిపోలేదు. తాజాగా ‘ఆహా’లోకి వచ్చిన కొత్త తెలుగు సినిమా ‘సూపర్ ఓవర్’. నవీన్ చంద్ర.. చాందిని చౌదరి.. రాకేందు మౌళి ప్రధాన పాత్రల్లో కొత్త దర్శకుడు ప్రవీణ్ వర్మ రూపొందించిన చిత్రమిది. దర్శకుడు సుధీర్ వర్మ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కాశి (నవీన్ చంద్ర).. వాసు (రాకేందు మౌళి).. మధు (చాందిని చౌదరి).. చిన్నప్పట్నుంచి కలిసి పెరిగిన స్నేహితులు. ముగ్గురూ తమ ఇళ్లలో కంటే కలిసి తీసుకున్న ఫ్లాట్‌లోనే ఎక్కువ గడుపుతారు. ఐతే వీరిలో కాశి అమెరికా వీసా కోసం కన్సల్టన్సీకి భారీగా డబ్బులు ఇచ్చి చిక్కుల్లో పడతాడు. నాలుగు రోజుల్లో రూ.40 లక్షలు కట్టకపోతే ఊర్లో తమ ఇంటిని కోల్పోయే పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక స్నేహితులతో కలిసి క్రికెట్ బెట్టింగ్ ఆడటానికి సిద్ధమవుతాడు. అందులో అనూహ్యంగా భారీ మొత్తంలో డబ్బులు కూడా గెలుస్తాడు. ఆ డబ్బుల కోసం వెళ్లిన ఈ ముగ్గురు మిత్రులకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయన్నదే మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘సూపర్ ఓవర్’ చూస్తున్నంత సేపూ.. చూశాక కలిగే ఫీలింగ్.. ఇది ‘పక్కా ఓటీటీ సినిమా’నే అని. ఎందుకంటే దీని నిడివి అటు ఇటుగా గంటన్నర. ఈ గంటన్నరలో ప్రేక్షకులతో ఎలా టైంపాస్ చేయించాలి అని చూశారు తప్ప ఇందులో చెప్పుకోదగ్గ కథ ఉండదు. పాత్రల తాలూకు బ్యాక్ స్టోరీలు చెప్పడం.. వాళ్ల క్యారెక్టర్లను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయడం ఎంతమాత్రం కనిపించదు. అలాగే కోట్ల రూపాయల వ్యవహారాన్ని డీల్ చేస్తున్నపుడు ఉండాల్సినంత సీరియస్నెస్ కూడా ఈ కథలో కనిపించదు. లాజిక్కులను పూర్తిగా పక్కన పెట్టేశారు. డబ్బుల కోసం ఒకరి వెంట ఒకరు పడే కథ కావడంతో సినిమా అంతా చేజింగులే కనిపిస్తాయి. ఆ క్రమాన్ని ఉన్నంతలో ఆసక్తికరంగానే చూపించారు. అప్పుడప్పుడూ ఓ చిన్న ట్విస్ట్ ఇస్తూ.. ఓ మోస్తరుగా థ్రిల్ చేస్తూ.. గంటన్నర సేపు ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా అయితే చూశారు కానీ.. అంతా అయ్యాక ఒక ‘సినిమా’ చూశాం అన్న ఫీలింగ్ అయితే కలగదు. ‘సూపర్ ఓవర్’ తాలూకు ఇంపాక్ట్ మన మెదళ్లపై కనిపించదు.

‘స్వామి రారా’ మొదలుకుని యువ దర్శకుడు సుధీర్ వర్మ సినిమాల్లో చాలా వరకు డబ్బులు.. దాంతో ముడిపడ్డ నేరాల చుట్టూ తిరిగేవే. ఇప్పుడు అతడి శిష్యుడు ప్రవీణ్ వర్మ రూపొందించిన ‘సూపర్ ఓవర్’ సైతం ఆ తరహా సినిమానే. అత్యవసరంగా డబ్బులు కావాల్సిన స్థితిలో ముగ్గురు స్నేహితులు బెట్టింగ్ కు దిగడం.. పెద్ద మొత్తంలో డబ్బులు గెలిచాక హవాలా మార్గంలో ఆ డబ్బులు పొందేందుకు ప్రయత్నించడం.. ఈ క్రమంలో ఒక బ్యాడ్ పోలీస్ చేతికి చిక్కడం.. ఈ డబ్బుల కోసం వేరే వ్యక్తుల పన్నాగాలు.. ఈ నేపథ్యంలో ‘సూపర్ ఓవర్’ నడుస్తుంది. ప్రధాన పాత్రలకు స్పెషల్ ఇంట్రోలు ఏమీ లేకుండా నేరుగా కథలోకి వెళ్లిపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. క్రికెట్ బెట్టింగ్ వ్యవస్థ ఎలా నడుస్తుందో ఇప్పటిదాకా ఏ సినిమాలో లేని విధంగా ఇచ్చిన డీటైలింగ్ ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో దర్శకుడు బాగానే కసరత్తు చేశాడనిపిస్తుంది. ఐతే తొలి అరగంటలో కథనం కొంచెం నెమ్మదిగానే నడుస్తుంది.

ముగ్గురు మిత్రులు డబ్బులు తెచ్చుకోవడానికి హవాలా బ్రాకెట్లోకి వెళ్లిన దగ్గర్నుంచి ‘సూపర్ ఓవర్’ ఉత్కంఠభరితంగా మారుతుంది. ఇక్కడి నుంచి ప్రతి పది పదిహేను నిమిషాలకు ఓ ట్విస్ట్ వచ్చేలా స్క్రీన్ ప్లే నడుస్తుంది. డబ్బులు అందుకోవడంలో ఎదురయ్యే అడ్డంకులు.. ముగ్గురు స్నేహితులు- పోలీసుకు మధ్య నడిచే చేజింగ్స్.. మధ్యలో డబ్బు రకరకాలుగా చేతులు మారడం.. ఇవన్నీ ఆసక్తి రేకెత్తిస్తాయి. ప్రేక్షకులను ఓ మోస్తరుగా థ్రిల్ చేస్తాయి. చివరికి కథను సుఖాంతం చేస్తారు కాబట్టి ఏం జరుగుతుందని అంచనా వేయడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ముగింపును మరీ తేల్చేసినట్లు అనిపిస్తుంది. కోట్ల రూపాయల డబ్బుతో సినిమాలో వివిధ రకాల వ్యక్తులు డీల్ చేసే విధానం అంత నమ్మశక్యంగా అనిపించదు. ఇక్కడ ప్రేక్షకులకు కొంచెం ఇంటెన్సిటీ.. సీరియస్ నెస్ ఆశిస్తారు. ఇదేదో పిల్లాటలా ఉందే అనిపించేలా కొన్ని సన్నివేశాలు నడుస్తాయి. అంత పెద్ద మొత్తంలో డబ్బు అనగానే ఒక రకమైన ఉత్కంఠ, భయం పుట్టేలా సన్నివేశాలు పకడ్బందీగా రాసుకోవాల్సింది. అజయ్ పాత్ర అయితే కొంచెం సిల్లీగా కూడా అనిపిస్తుంది. చివరికి అంత ఈజీగా హీరో మిత్ర బృందానికి డబ్బులు దొరికేయడం.. తర్వాత వాళ్లకు ఏ ఇబ్బందీ లేనట్లు చూపించడం కన్విన్సింగ్ గా అనిపించదు. ఐతే ముందే అన్నట్లు ఇది పక్కా ఓటీటీ సినిమా అన్న ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి.. దీన్ని ఆ కోణంలోనే చూడాలి. గంటన్నర టైంపాస్ చేయడానికైతే ‘సూపర్ ఓవర్’తో ఇబ్బంది ఏమీ లేదు.

నటీనటులు:

నవీన్ చంద్ర మంచి నటుడనే విషయంలో ప్రతిసారీ అర్థమవుతూనే ఉంటుంది. ‘సూపర్ ఓవర్’ ఒక పెద్ద షార్ట్ ఫిలిం లాగా అనిపించినా నవీన్ మాత్రం తన స్థాయిని మెయింటైన్ చేశాడు. సినిమాలో లేని ఇంటెన్సిటీ అతడి నటనలో కనిపిస్తుంది. చాందిని చౌదరి మధు పాత్రకు బాగానే సూట్ అయింది. ఆమె నటన సహజంగా సాగింది. రాకేందు మౌళి కూడా బాగానే చేశాడు. అజయ్ తన వరకు బాగానే చేసినా.. అతడి పాత్ర మాత్రం తేలిపోయింది. వైవా హర్ష ఇలా మెరిసి అలా మాయమయ్యాడు. అతడి పాత్రను ఇంకా వాడుకుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ప్రవీణ్ బాగానే చేశాడు. సినిమాలో ఇంకెవరికీ పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రల్లేవు.

సాంకేతిక వర్గం:

‘సూపర్ ఓవర్’ పూర్తిగా ఒక రాత్రిలో నడిచే కథ. సినిమా అంతా రాత్రి పూటే నడుస్తుంది. ఐతే ఎక్కడా మొనాటనీ.. రిపిటీటివ్ అనిపించకుండా చేయడంలో కెమెరామన్ దివాకర్ మణి ప్రతిభ కనిపిస్తుంది. చేజింగ్ సీన్లను అతను చాలా బాగా చిత్రీకరించాడు. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. రిచ్ గానూ అనిపిస్తాయి. సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతం కూడా కథనాన్ని పరుగులు పెట్టించడంలో తోడ్పడింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ ప్రవీణ్ వర్మ.. ‘సూపర్ ఓవర్’ విషయంలో తన గురువు సుధీర్ వర్మ తీసిన ‘స్వామి రారా’ను ఫాలో అయ్యాడనిపిస్తుంది. కథలో అతను రాసుకున్న ఫన్నీ ట్విస్ట్స్ ఆకట్టుకుంటాయి. బెట్టింగ్ వ్యవస్థ ఎలా నడుస్తుందో బాగా చూపించాడు. కానీ లాజిక్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. సినిమాను అనుకున్నంత ఇంటెన్స్ గా తీయలేదు. పెద్ద బడ్జెట్, కాస్టింగ్ ఇస్తే అతను ఇంకా మెరుగైన సినిమా తీసేవాడేమో అనిపిస్తుంది. దర్శకుడిగా అతడికి పాస్ మార్కులు పడతాయి.

చివరగా: సూపర్ ఓవర్.. టైంపాస్ థ్రిల్స్

రేటింగ్-2.5/5

Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News