సమాజంపై సినిమా ప్రభావం..ఆ హీరో ఏమన్నాడంటే?
అయితే అదే సమాజం సినిమా చూసి చెడిపోతుందని ఎన్నోసార్లు ఎంతో మంది ఉద్ఘాటించిన సందర్భాలున్నాయి.
సమాజంపై సినిమాల ప్రభావం ఎంత వరకూ ఉంటుంది? అనే అంశంపై చాలాసార్లు చర్చలు జరిగాయి. కొంత మంది సినిమా సమాజాన్ని మార్చలగదని సమర్దిస్తే...మరికొంత మంది సినిమాకి అంత శక్తి లేదని విబేధించారు. సినిమా అనేది కేవలం ఎంటర్ టైన్ మెంట్ మాత్రమేనని...సమాజాన్ని మార్చేంత బలం సినిమాకు లేదని అభిప్రాయపడ్డారు. అయితే అదే సమాజం సినిమా చూసి చెడిపోతుందని ఎన్నోసార్లు ఎంతో మంది ఉద్ఘాటించిన సందర్భాలున్నాయి.
సమాజంలో అసాంఘిక కార్యకలాపాలకు కారణం కొన్ని రకాల సినిమాలంటూ తెరపైకి వచ్చిన సందర్భాలు కోకొల్లలు. సినిమా వల్ల మంచి కంటే చెడే ఎక్కువ ఉందని వాదించే వర్గం కూడా బలంగా ఉంది. ముఖ్యంగా తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సినిమా ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ఇక్కడ హీరోలకు ఉన్న జనాధారణ ఇంకే భాషలోనూ ఉండదు. తమ అభిమాన హీరో కోసం పాలాభిషేకం చేస్తారు. ఎన్నో అభిమాన సంఘాలున్నాయి.
సినిమా రిలీజ్ అవుతుందంటే సొంత డబ్బు ఖర్చు చేసి కటౌట్లు కడతారు. అప్పుడప్పుడు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. ఆరకంగా సినిమా తెలుగు ప్రేక్షకుల్లో అయితే బలంగానే పనిచేస్తుంది. తాజాగా బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ కూడా ఇదే అంశంపై స్పందించాడు. `యానిమల్`, `సంజు` చిత్రాల్లో హింసను ప్రోత్సహించారు? అనే ప్రశ్న రణబీర్ కపూర్ ముందుకు వెళ్లింది. అందుకు రణబీర్ ఇలా అన్నారు.
'ఈ విషయంలో మీతో నేను ఏకీభవిస్తాను. ఒక నటుడిగా నేను అన్ని జానర్లలో నటించాలి. అలాగే మనం నటించే ప్రతీ కథకు మనమే పూర్తి బాధ్యత వహించాలి. మనం చేసే సినిమాల ద్వారా కూడా సమాజంలో మార్పు తీసుకు రాగలగాలి. సినిమాకి అన్ని శక్తి సామర్ధ్యాలున్నాయని నేను నమ్ముతున్నాను. ఇప్పటికే సినిమా సమాజంలో కొన్ని రకాల మార్పులు తీసుకొచ్చిందని భావిస్తున్నా' అన్నారు.