మన స్టార్ హీరోస్ లో ఈ చేంజ్ చూసారా ?

ఇప్పుడా లేట్ ను త‌గ్గించి వేగంగా సినిమాల‌ను చేయాల‌ని చూస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. కొత్త సినిమాల విష‌యంలో ఎంతో ప‌క్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతున్నారు.;

Update: 2025-03-16 16:30 GMT

స్టార్ హీరోల నుంచి ఒక‌ప్పుడు ఏడాదికి ఒక సినిమా అయినా వ‌చ్చేది కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారిపోయాయి. పెరిగిన టెక్నాల‌జీ దృష్ట్యా ప్ర‌తీ సినిమాకూ ఎక్కువ టైమ్ ప‌డుతుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగిన నేప‌థ్యంలో ద‌ర్శకనిర్మాత‌లంతా ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని మ‌రీ సినిమాల‌ను పూర్తి చేస్తున్నారు. ఈ కార‌ణంగానే ప్ర‌తీ సినిమా అనుకున్న దానికంటే లేట‌వుతుంది. దీంతో ఫ్యాన్స్ త‌మ అభిమాన హీరోల సినిమాల కోసం ఎదురుచూడ‌ట‌మే సరిపోతుంది. ఇప్పుడా లేట్ ను త‌గ్గించి వేగంగా సినిమాల‌ను చేయాల‌ని చూస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు. కొత్త సినిమాల విష‌యంలో ఎంతో ప‌క్కాగా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతున్నారు.

అయితే ఈ లిస్ట్ లో ఫ‌స్ట్ ప్లేస్ లో ఉండే హీరో ప్ర‌భాస్. బాహుబ‌లి కోసం ఎంతో టైమ్ కేటాయించిన ప్రభాస్, దాని త‌ర్వాత సినిమాల వేగాన్ని పెంచాడు. ప్ర‌భాస్ స్పీడైతే పెంచాడు కానీ ఎవ‌రికెప్పుడు డేట్స్ ఇస్తాడ‌నేది తెలియ‌కుండా పోతుంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేతిలో రాజా సాబ్, ఫౌజీ సినిమాలుంటే సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో స్పిరిట్ చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. ప్ర‌భాస్ ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయ‌డం వ‌ల్ల సినిమా రిలీజ్ విష‌యంలో వాయిదా స‌మ‌స్య‌లు ఎదురవుతున్నాయి.

అందుకే స్పిరిట్ విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర‌వ‌కుండా ఉండ‌టం కోసం సందీప్ రెడ్డి వంగా ప్ర‌భాస్ డేట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకున్నాడ‌ట‌. స్పిరిట్ పూర్త‌య్యే వ‌ర‌కు మ‌రో సినిమా చేయ‌కూడద‌ని ప్ర‌భాస్ కు సందీప్ కండిషన్ పెట్టాడ‌ని, ప్ర‌భాస్ కూడా అందుకు ఒప్పుకున్నాడ‌ని తెలుస్తోంది. ఎలాగైనా జూన్ త‌ర్వాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లి నెక్ట్స్ స‌మ్మ‌ర్ కి సినిమాను రిలీజ్ చేయాల‌ని చూస్తున్నార‌ట ప్ర‌భాస్, సందీప్. స్పిరిట్ కోస‌మే ప్ర‌భాస్ ప్రస్తుతం చేస్తున్న హ‌ను రాఘ‌వ‌పూడి సినిమాను ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో మంచి క్రేజ్ అందుకున్న రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ కూడా త‌మ త‌ర్వాతి సినిమాల విష‌యంలో వేగం పెంచిన‌ట్టు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎంతో టైమ్ ను కేటాయించి చేసిన గేమ్ ఛేంజ‌ర్ డిజ‌ప్పాయింట్ చేయ‌గా, ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ బుచ్చిబాబుతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు చ‌ర‌ణ్. అన్నీ అనుకున్న‌ట్టు అయితే జులై, ఆగ‌స్ట్ నాటికి షూటింగ్ పూర్తి చేసి ఈ ఇయ‌ర్ లోనే సినిమాను రిలీజ్ చేయాల‌ని చ‌ర‌ణ్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. బుచ్చిబాబు మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్ చేయ‌నున్న సుకుమార్ సినిమా కూడా ఈ ఇయ‌ర్ లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుందంటున్నారు.

ఎన్టీఆర్ కూడా త‌న సినిమాల వేగాన్ని పెంచాల‌ని డిసైడ‌య్యాడు. అందుకే దేవ‌ర త‌ర్వాత గ్యాప్ తీసుకోకుండా వెంట‌నే వార్2 సినిమా షూటింగ్ లో జాయినై ఆ సినిమాను పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. హృతిక్ రోష‌న్ తో క‌లిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆఖ‌రి ద‌శ‌లో ఉంది. వార్2 త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ తో చేయ‌నున్న సినిమా ఇప్ప‌టికే సెట్స్ పైకి వెళ్ల‌గా ఈ నెలాఖ‌రు నుంచి లేదా ఏప్రిల్ మొద‌టి వారం నుంచి ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో పాల్గొననున్నాడు. ద‌సరా టైమ్ కు నీల్ సినిమాను పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయ‌నున్నారు. ఈ లోగా కొర‌టాల దేవ‌ర‌2తో రెడీ అవుతాడు కాబ‌ట్టి ఆ సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని ఎన్టీఆర్ ప్లాన్ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

వీరితో పాటూ టాలీవుడ్ సీనియ‌ర్ హీరోలు చిరంజీవి, బాల‌కృష్ణ కూడా వేగంగా సినిమాలు చేస్తూ త‌మ స‌త్తా చాటాల‌నుకుంటున్నారు. ప్ర‌స్తుతం వశిష్ట‌తో విశ్వంభ‌ర చేస్తున్న చిరంజీవి ఈ సినిమా కోసం గ‌త ఏడాదిన్న‌ర‌గా క‌ష్ట‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ ఇయ‌ర్ సెకండాఫ్ లో విశ్వంభ‌ర ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. విశ్వంభ‌ర త‌ర్వాత చిరూ, అనిల్ రావిపూడితో క‌లిసి సినిమా చేయ‌నున్నాడు.

ఈ సినిమాను మే, జూన్ లో సెట్స్ పైకి తీసుకెళ్లి ఇయ‌ర్ ఎండింగ్ ను సినిమాను పూర్తి చేయ‌నున్నారు. 2026 సంక్రాంతికి అనిల్- చిరూ మూవీ రిలీజ్ అవుతుందని ఇప్ప‌టికే అనౌన్స్ కూడా చేశారు. అనిల్ సినిమా అయిన వెంట‌నే ద‌స‌రా ఫేమ్ శ్రీకాంత్ కూడా ఫుల్ స్క్రిప్ట్ తో చిరూ కోసం రెడీ అవుతాడు. వెంట‌నే ఆ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఇక బాల‌య్య విష‌యానికొస్తే ఆల్రెడీ ఈ ఇయ‌ర్ డాకు మ‌హారాజ్ తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చి హిట్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం బోయ‌పాటితో క‌లిసి అఖండ‌2 చేస్తున్నాడు. ఈ సినిమా సెప్టెంబ‌ర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మాస్ మ‌హారాజా ర‌వితేజ ఎప్పుడూ వేగంగానే సినిమాలు చేస్తుంటాడు. ప్ర‌స్తుతం భాను భోగ‌వ‌ర‌పు ద‌ర్శ‌క‌త్వంలో మాస్ జాత‌ర సినిమా చేస్తున్న ర‌వితేజ ఈ స‌మ్మ‌ర్ లో దాన్ని రిలీజ్ చేయ‌నున్నాడు. అది అయిపోగానే కిషోర్ తిరుమ‌ల‌తో ఓ సినిమాను చేయ‌నున్న ర‌వితేజ దాన్ని ఈ ఏడాది సెకండాఫ్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లి సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ చేయ‌నున్నాడు.

ఇక ప్ర‌పంచం మొత్తం ఎదురుచూస్తున్న రాజ‌మౌళి- మ‌హేష్ సినిమా కూడా ఎక్కువ టైమ్ తీసుకోకుండానే ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్టు టాక్ వినిపిస్తుంది. రాజ‌మౌళి సినిమా అంటే ఏళ్ల‌కు ఏళ్లు షూటింగ్ లోనే గ‌డిచిపోతాయి. కానీ ఈసారి మ‌హేష్ తో తెర‌కెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబీ29 మాత్రం ఏడాదిన్న‌ర లోగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని చూస్తున్నారట‌. నెక్ట్స్ ఇయ‌ర్ సెకండాఫ్ లో సినిమాను రిలీజ్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట జ‌క్క‌న్న‌.

Tags:    

Similar News