తలైవా జెట్ స్పీడ్.. అప్డేట్ లోడింగ్!

Update: 2023-01-16 16:30 GMT
సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని.. ఈ రోజే చెన్నైకి చేరుకున్నారు. అయితే 73 ఏళ్ల వయసులోనూ ఆయన యమ స్పీడుగా షూటింగ్ పూర్తి చేయడం గమనార్హం. రోజు రోజుకూ వయసు పెరుగుతున్నా ఆయనలో మాత్రం ఏమాత్రం హుషారు తగ్గట్లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంటున్నారు.

యంగ్ అండ్ డైనమిక్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ సారి జైలర్ సినిమాలో ముత్తువేల్ పాండియన్ పాత్రలో నటిస్తున్న ఈయన ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తారో చూడాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.

ఈ సినిమాలో రజినీకాంత్ సరసన రమ్యకృష్ణ నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో వీరిద్ద కలయికలో చాలానే సినిమాలు వచ్చాయి. కానీ నరసింహ సినిమాలో నీలాంబరిగా రమ్యకృష్ణ చేసిన పాత్రను మాత్రం ఎప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అంత మంచి పాత్రలో రజినీ పక్కన హీరోయిన్ గా చేసిన ఆమె.. మరోసారి సూపర్ స్టార్ తో జత కట్టబోతుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగిపోయాయి.

జైలర్ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రజినీ కాంత్ బర్త్ డే రోజు విడుదల చేశారు. జైలు బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న ఈ చిత్రంలో రజినీ కాంత్ జైలర్ గా కనిపించబోతున్నారు. సెంట్రల్ జైలు నేపథ్యంలో 24 గంటల వ్యవధిలో సాగే ఈ కథకు సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రజినీ అదిరిపోయే లుక్ తో పాటు అనిరుద్ రవిచంద్రన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ గా ఉండడంతో... సినిమాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. జైలర్ సినిమా ఫస్ట్ గ్లిమ్స్ కు యూట్యూబ్ లో 3.7 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అలాగే 328కే లైకులు వచ్చాయి.

ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శివరాజ్ కుమార్, వసంత్ రవి, యోగిబాబు, వినాయకన్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, అలాగే హీరోయిన్ తమన్నా బాటియా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇందులో నిజం ఎంత ఉందనేది మాత్రం ఎవరికీ తెలియదు. ఇదంతా పక్కన పెడితే జైలర్ సినిమా నుండి తొలి సాంగ్ వచ్చే నెల అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News