బర్త్ డే స్పెషల్: సాహసానికి బ్రాండ్ అంబాసిడర్

Update: 2016-05-31 11:30 GMT
అప్పట్లో ఓ ప్రముఖ సినిమా మ్యాగజైన్.. తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ ఎవరు అంటూ ప్రతి సంవత్సరం పోల్ నిర్వహించేది. ఐతే వరుసగా నాలుగైదేళ్ల పాటు ఈ పోల్ నిర్వహించి తర్వాత ఆపేసిందా పత్రిక. అందుక్కారణం.. ప్రతిసారీ ‘కృష్ణ’కే అత్యధిక ఓట్లు వస్తుండటం.. ఫలితాల్లో ఏ మార్పూ లేకపోవడమే అందుక్కారణం. ఎన్టీఆర్.. ఏఎన్నార్ లాంటి గొప్ప నటులతో పోటీ పడి సూపర్ స్టార్ ఇలా ఆధితప్యం చలాయించడం విశేషమే. సూపర్ స్టార్ ఫాలోయింగ్ ఏంటో చెప్పడానికి ఇది ఉదాహరణ. అసలు ఎన్టీఆర్.. ఏఎన్నార్ లతో పోలిస్తే నటనలో ఎంతో అంతరం ఉన్నా సరే.. అలాంటి శిఖరాల్ని ఢీకొట్టి.. హీరోగా నిలబడటం.. భారీగా అభిమాన గణాన్ని సంపాదించుకోవడం.. సూపర్ స్టార్ గా ఎదగడం కృష్ణకే చెల్లింది.

కేవలం తాను చేసిన సాహసాలతోనే సూపర్ స్టార్ గా ఎదిగాడు కృష్ణ. ఎన్టీఆర్ చేద్దామనుకున్న ‘అల్లూరి సీతారామరాజు’ను అనుకోకుండా మొదలుపెట్టేసి.. సెన్సేషనల్ హిట్టు కొట్టడమే కాదు.. మరెన్నో సాహసోపేత చిత్రాలు చేశాడు కృష్ణ. స్వీయ దర్శకత్వంలో ‘సింహాసనం’ లాంటి సెన్సేషనల్ మూవీ తీసి తెలుగు తెరకు తొలి సినిమా స్కోప్ పరిచయం చేయడమే కాదు.. ఆ తర్వాత కూడా మరెన్నో కొత్త టెక్నాలజీల్ని తీసుకొచ్చిన ఘనత ఆయనదే. ‘మోసగాళ్లకు మోసగాడు’తో కౌబాయ్ సినిమాల్ని రుచి చూపించింది కూడా కృష్ణ. తన బలమేంటో బలహీనతలేంటో తెలుసుకుని.. ఎన్టీఆర్.. ఏఎన్నార్ టచ్ చేయని వెరైటీ సబ్జెక్టులతో సినిమాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నాడు కృష్ణ. కృష్ణ చేసిన సాహసాలే ఆయకు తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి.

దాదాపు దశాబ్దాల పాటు అలుపెరకుండా సినిమాలు చేసి ట్రిపుల్ సెంచరీ కూడా పూర్తి చేసిన కృష్ణ.. కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చాన్నాళ్ల విరామం తర్వాత ఆయన కథానాయకుడిగా నటించిన ‘శ్రీ శ్రీ’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కృష్ణను మళ్లీ ఇలా వెండితెరమీద చూసుకోబోతుండటం ఆయన వీరాభిమానులకు మహదానందం కలిగించేదే. ఈ రోజు సూపర్ స్టార్ పుట్టిన రోజు. ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతోంది తుపాకి.కాం.
Tags:    

Similar News