దాసరిలా చేయడం కుదరదనేసిన సురేష్

Update: 2018-07-02 10:37 GMT
దర్శకరత్న దాసరి నారాయణ రావు ఉన్నపుడు ఇండస్ట్రీ సమస్యల్ని తన సమస్యలుగా భావించి.. అన్నింటినీ తన నెత్తి మీద వేసుకుని పరిష్కరించడానికి ప్రయత్నించేవాళ్లు. ఆయన వెళ్లిపోయాక ఆ స్థానాన్ని భర్తీ చేసే ఇండస్ట్రీ పెద్ద ఎవరూ కనిపించడం లేదు. ఆ దిశగా ఎవరూ ప్రయత్నించడం లేదు. అందరూ దాసరి లేని లోటు గురించి మాట్లాడేవాళ్లే కానీ.. ఆయనలా బాధ్యత తీసుకునేవాళ్లు కనిపించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఐతే అగ్ర నిర్మాత సురేష్ బాబు మాత్రం.. దాసరిలా ఇప్పుడు ఇండస్ట్రీ జనాల్ని ఎవరూ ఆదేశించి.. సమస్యల్ని పరిష్కరించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు ఎవరూ ఎవరి మాటా వినరని ఆయన స్పష్టం చేశారు. ఒక పది పదిహేనేళ్ల కిందటి వరకు మాత్రమే దాసరి.. తన తండ్రి రామానాయుడు లాంటి వాళ్ల మాటల్ని ఇండస్ట్రీ వాళ్లు వినేవాళ్లన్నారు. దాసరి ఉన్నపుడు కూడా చివరి దశలో అందరూ ఆయన మాట వినలేదని చెప్పారు.

ఇండస్ట్రీలోకి చాలామంది కొత్తవాళ్లు వచ్చారని.. సంఖ్య బాగా పెరిగిపోయిందని.. ఇప్పుడొచ్చి ఒకరు ఇలా చేయమని చెబితే ఎవరూ చేసే పరిస్థితి లేదని.. ఎవరైనా ఏదైనా చేద్దామనుకున్నా మన మాట వినకపోతే ఎలా అనే సందేహంతో మనకెందుకొచ్చిందని వెనక్కి తగ్గుతున్నారని సురేష్ చెప్పారు. నిర్మాతల మండలి విషయానికే వస్తే అందులో 1000 మంది ఉన్నారని.. అక్కడ ఒక విషయం చెప్పి అందరితోనూ ఓకే అనిపించడం కష్టమవుతోందని... దీంతో యాక్టివ్ గా ఉండే నిర్మాతలతోనే వేరే కౌన్సిల్ పెడదామా అన్న ఆలోచన కూడా వచ్చిందని ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఎందుకు లీడ్ తీసుకుంటారని.. కాబట్టి దాసరి గారిలా ఇప్పుడు చేయడం అసాధ్యమైన విషయమని సురేష్ స్పష్టం చేశారు.
Tags:    

Similar News