ఈ అన్నదమ్ములిద్దరికీ ఏమైంది?

Update: 2019-02-15 09:06 GMT
డబ్బింగ్ సినిమా అంటే ఒకప్పుడు బంగారు బాతే. ఒక దశలో తెలుగు సినిమాను కూడా పక్కకు నెట్టేసి వసూళ్ల వర్షం కురిపించుకున్నాయి అనువాదాలు. చంద్రముఖి.. శివాజీ.. రోబో.. గజిని.. అపరిచితుడు.. ఆయా సమయాల్లో ఎలాంటి వసూళ్లు సాధించాయో గుర్తుండే ఉంటుంది. కానీ ఈ మధ్య డబ్బింగ్ సినిమాల జోరు బాగా తగ్గిపోయింది. ఇక్కడ ఒకప్పుడు మంచి మార్కెట్ సంపాదించుకున్న తమిళ కథానాయకులు.. ఇప్పుడు బాగా స్ట్రగులవుతున్నారు. తెలుగులో కొన్నేళ్ల కిందట సూర్య పెద్ద స్టార్. తెలుగు స్టార్లకు దీటుగా ఫాలోయింగ్ ఉండేది. అతడి సపోర్టుతో తమ్ముడు కార్తి కూడా ఇక్కడ అడుగు పెట్టాడు. ఆవారా.. నా పేరు శివ లాంటి సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇద్దరూ మంచి మార్కెట్ సంపాదించుకున్నారిక్కడ.

కానీ గత కొన్నేళ్లుగా ఈ అన్నదమ్ములు తెలుగులో క్రేజ్.. మార్కెట్ రెండూ కోల్పోతూ వస్తున్నారు. సూర్య మీద పెట్టుకున్న నమ్మకాన్ని అతడి సినిమాలు దెబ్బ తీస్తూ వచ్చాయి. చివరగా అతను ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా మరిచిపోయారు జనాలు. గత ఏడాది ‘గ్యాంగ్’తో షాకిచ్చాడతను. అప్పట్నుంచి మరో సినిమా రాలేదు. సూర్య కొత్త సినిమా ‘ఎన్జీకే’కు తమిళంలో మంచి క్రేజే ఉంది కానీ.. తెలుగులో పరిస్థితి కష్టం లాగే ఉంది. ఇది పూర్తిగా తమిళ నేటివిటీతో - అక్కడ రాజకీయాలతో ముడిపడ్డ సినిమా. దీన్ని మనోళ్లు పట్టించుకోవడం కష్టంగానే ఉంది. ఇక కార్తి విషయానికి వస్తే.. మధ్యలో అతను పూర్తిగా ట్రాక్ తప్పాడు. ‘ఊపిరి’.. ‘ఖాకి’ లాంటి సినిమాలతో కొంచెం పుంజుకున్నట్లే కనిపించాడు కానీ.. మళ్లీ కథ అడ్డం తిరిగింది. ‘చినబాబు’ పోయింది. తాజాగా ‘దేవ్’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు మినిమం బజ్ లేకపోయింది. టాక్ కూడా బ్యాడ్ కావడంతో సినిమా తుస్సుమంది. కార్తి మార్కెట్ బాగా దెబ్బ తినేసిందని ఈ సినిమాతో రుజువైంది. మొత్తానికి అన్నదమ్ములిద్దరూ తమకు వచ్చిన క్రేజ్, మార్కెట్ ను చేజేతులా దెబ్బ తీసుకున్నారనే చెప్పాలి.


Tags:    

Similar News