సూర్య ఓ కుర్రాణ్ని కొట్టాడా?

Update: 2016-05-31 06:43 GMT
తమిళ-తెలుగు సూపర్ స్టార్ సూర్య మంచి నటుడే కాదు.. మంచి మనసున్నోడు కూడా. అతడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ కాస్త ఎక్కువే. తన ‘అగరం’ ఫౌండేషన్ ద్వారా మంచి కార్యక్రమాలు చేస్తున్న సూర్య.. చాలాసార్లు తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఆ మధ్య చిత్తూరు జిల్లా మదనపల్లె దగ్గర్లో ‘24’ షూటింగ్‌ లో పాల్గొని వెళ్తూ రోడ్డు మీద ఓ మహిళ యాక్సిడెంట్ అయి పడి ఉంటే.. ఆమెను తీసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. తాజాగా మరోసారి ఇలాంటి వ్యవహారంతో వార్తల్లోకి వచ్చాడు.

తమిళనాడులోని అడయార్ ప్రాంతంలో సూర్య కార్లో వెళ్తుండగా.. ఇద్దరు కుర్రాళ్లు ఓ పెద్దావిడతో గొడవ పడుతుండటం చూసి ఆగాడట సూర్య. ఆ కుర్రాళ్లిద్దరూ తాగి బైక్ నడుపుతూ ఆ పెద్దావిడను ఢీకొట్టారట. అక్కడున్నవాళ్లు వాల్లను ఆపి నిలదీస్తుంటే తిరిగి దౌర్జన్యానికి దిగుతుండటం చూసి సూర్య ఆ గొడవలో జోక్యం చేసుకున్నాడట. ఆ కుర్రాళ్లిద్దరూ చేసింది తెలిసి.. వాళ్లు అతిగా వాగుతుండటం చూసి.. మందలిస్తూ అందులో ఒకరిపై సూర్య చేయి చేసుకున్నట్లుగా తమిళ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఐతే సూర్య మేనేజర్ని దీని గురించి సంప్రదించగా.. అక్కడ గొడవ జరగడం.. సూర్య జోక్యం చేసుకోవడం వాస్తవమే అని చెప్పాడు. ఐతే సూర్య ఎవరినీ కొట్టలేదని.. కేవలం పోలీసులకు ఫోన్ చేసి వాళ్లు వచ్చే వరకు అక్కడ వెయిట్ చేసి.. ఆ కుర్రాళ్లను వారిని అప్పగించాడని తెలిపాడు. మరోవైపు బాధితురాలైన పెద్దావిడ మీడియా ముందుకొచ్చి.. సూర్యకు మద్దతుగా మాట్లాడింది. తనకు సాయం చేయడానికే సూర్య వచ్చాడని.. వయొలెంట్ గా ఏమీ ప్రవర్తించలేదని ఆమె తెలిపింది.
Tags:    

Similar News