మగధీర కాపీ.. కేసు కొట్టేస్తారన్న హీరో

Update: 2017-05-25 13:59 GMT
టాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘మగధీర’ను కాపీ కొట్టి హిందీ సినిమా ‘రాబ్తా’ తీశారని.. ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పటి నుంచి పెద్ద చర్చే నడుస్తోంది. ఐతే సోషల్ మీడియాలో చర్చల సంగతెలా ఉన్నా.. ‘మగధీర’ మేకర్స్ సైలెంటుగా ఉండటంతో దీనిపై వివాదం ఏమీ లేదనుకున్నారంతా. ఐతే ‘రాబ్తా’ విడుదలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో ఉన్నట్లుండి నిర్మాత అల్లు అరవింద్ ‘రాబ్తా’ మేకర్స్ మీద కేసు వేశాడు. ‘మగధీర’ సినిమాను కాపీ కొట్టి ‘రాబ్తా’ తీశారని.. ఈ సినిమా విడుదలను ఆపాలని ఆయన కోర్టును విన్నవించారు. ‘రాబ్తా’ దర్శక నిర్మాతలకు నోటీసులు వెళ్లాయి. ఈ కేసును త్వరలోనే విచారించనుంది కోర్టు.

ఐతే ఈ లోపు ‘రాబ్తా’ హీరో కాపీ వివాదంపై స్పందించాడు. తన సినిమా దర్శక నిర్మాతలపై వేసిన కేసును కోర్టు కొట్టేస్తుందని అతను తేల్చి చెప్పాడు. ‘మగధీర’కు.. ‘రాబ్తా’కు అసలు సంబంధమే లేదని అతనన్నాడు. కేవలం ట్రైలర్ చూసి సినిమా మీద ఒక అంచనాకు ఎలా వచ్చేస్తారని అతను ప్రశ్నించాడు. ఏవో కొన్ని పోలికలు కనిపించినంత మాత్రాన కాపీ అయిపోతుందా అని అతనన్నాడు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రాని సరికొత్త కాన్సెప్ట్.. బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కిందని.. సినిమా చూస్తే ఆ విషయం అందరికీ అర్థమవుతుందని సుశాంత్ అభిప్రాయపడ్డాడు. ‘రాబ్తా’ సినిమా అనుకున్న ప్రకారమే జూన్ 9న ప్రేక్షకుల ముందుకొస్తుందని అతను ధీమా వ్యక్తం చేశాడు. ఐతే ‘రాబ్తా’ ట్రైలర్ చూస్తే మాత్రం ‘మగధీర’ పోలికలు కొన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ చిత్ర దర్శకుడు ‘మగధీర’ నుంచి స్ఫూర్తి పొందాడా.. లేక కాపీ కొట్టాడా అనే విషయంలో కోర్టు ఏం తేలుస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News