బాలీవుడ్ లో యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చుట్టూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. బాలీవుడ్ లోని ఓ బలమైన ‘పవర్ కంపెనీ’ సుశాంత్ ను ఎదగనీయకుండా చూసిందని వార్తలు వెల్లువెత్తాయి. ఇక ఆయనది సూసైడ్ కాదని.. హత్య అని కొన్ని వర్గాలు ఆరోపించాయి. దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్లు వినిపించాయి.
అయితే ముంబై పోలీసులు ఇప్పటికీ బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, నటులు, సుశాంత్ సన్నిహితులను విచారించినప్పటికీ ఇప్పటికీ పెద్దగా ఫలితం తేలలేదు.
ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి తాజాగా సుశాంత్ ఆత్మహత్యపై ప్రధాని మోడీకి లేఖ రాశారు. దుబాయ్ లో చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్న కొందరు డాన్ లతో ముంబై సెలెబ్రెటీలకు లింక్ ఉందని.. ఈ కేసులో పోలీసుల దర్యాప్తును వారు కప్పిపుచ్చుతూ సుశాంత్ ది ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని.. దీనివెనుక బడాబాబులున్నారని.. సీబీఐ విచారణ జరిపించాలని మోడీకి సుబ్రహ్మణ్యస్వామి లేఖ రాశారు.
సుబ్రహ్మణ్య స్వామి రాసిన లేఖ మీద ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. జులై 15నే ఆయన రాసిన లేఖ తమకు అందిందని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి స్వామికి సమాచారం పంపించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.