సైరా- నరసింహారెడ్డి తొలిరోజు వసూళ్ల గురించి ఇప్పటికే వివరాలు వెల్లడయ్యాయి. మొదటి రోజు 50కోట్లకు తగ్గకుండా ప్రపంచవ్యాప్త వసూళ్లు సాధించిందని ఫిలింవర్గాల్లో చర్చ సాగుతోంది. మరోవైపు అమెరికాలో ఆశించిన స్థాయిలో మొదటి రోజు వసూళ్లు దక్కలేదన్న నివేదన అందింది. అక్కడ పంపిణీ వర్గాలు సరిగా ప్లానింగ్ చేయకపోవడమో లేక ఇంకేదైనా కారణమో కానీ గత పాన్ ఇండియా చిత్రాల తరహాలో మొదటి రోజు వసూళ్లు దక్కలేదని విమర్శలొచ్చాయి.
ఎట్టకేలకు తాజాగా అందిన సమాచారం ప్రకారం.. సైరా అమెరికా వసూళ్లు 1 మిలియన్ డాలర్ క్లబ్ ను అధిగమించాయని తెలుస్తోంది. పాజిటివ్ రివ్యూల నడుమ ఈ సినిమాకి హైప్ పెరిగింది. ఇకపై ఇంకా వసూళ్లు పెరుగుతాయని విశ్లేషిస్తున్నారు. మంగళవారం రాత్రి అమెరికా కెనడాల్లో ప్రీమియర్ల రూపంలో 857కె డాలర్లు వసూలు చేసిన సైరా.. కేవలం అమెరికా నుంచి 810 కె డాలర్లు వసూలు చేసింది. ఉత్తర అమెరికా నుంచి 252కె డాలర్లు వసూలయ్యాయి. ఓవరాల్ గా 1.11 మిలియన్ డాలర్ల వసూళ్లు దక్కాయని తెలుస్తోంది. 1 మిలియన్ డాలర్ అంటే సుమారు 7కోట్లు. ఇది ఓవర్సీస్ లో మెగాస్టార్ కి చెప్పుకోదగ్గ ఓపెనింగ్ అని విశ్లేషిస్తున్నారు. అమెరికాలో టాప్ 5 ఓపెనర్స్ లో స్థానం దక్కించుకోకపోయినా బెటర్ రిజల్ట్ అందుకుందని విశ్లేషిస్తున్నారు. అమెరికాలో ఓపెనింగ్ డే ఎనిమిదో హైయ్యెస్ట్ గ్రాస్ ని అందుకుంది ఈ చిత్రం.
బాహుబలి 2, అజ్ఞాతవాసి, బాహుబలి, ఖైదీ నంబర్ 150,స్పైడర్, సాహో, భరత్ అనే నేను చిత్రాలు టాప్ 7 జాబితాలో ఉన్నాయి. ఆ తర్వాత సైరా చిత్రం నిలిచింది. మెగాస్టార్ కి ఓవర్సీస్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్ట్యా తొలి వీకెండ్ కలెక్షన్స్ కి డోఖా ఉండదని అంచనా వేస్తున్నారు.