హీరో విశాల్ బరిలోకి దిగడంతో ఆర్కే నగర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. నాటకీయ పరిణామాల మధ్య మంగళవారం రాత్రి విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం విదితమే. తమిళనాడు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (టీఎఫ్ పీసీ) జనరల్ సెక్రటరీగా ఉన్న విశాల్ తన పదవికి రాజీనామా చేసిన తర్వాతే ఆర్కే నగర్ లో పోటీ చేయాలని దర్శకుడు చేరన్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, విశాల్ పై ప్రముఖ నటుడు - నిర్మాత టి. రాజేందర్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముందుగా విశాల్ తన టీఎఫ్ పీసీ జనరల్ సెక్రటరీ పదవికి న్యాయం చేయాలని రాజేందర్ అన్నారు.
విశాల్ కు నామినేషన్ వేయడంలో అనుభవం లేదని, దానివల్లే తిరస్కరణకు గురైందని అన్నారు. టీఎఫ్‌పీసీ జనరల్ సెక్రటరీగా విశాల్ నిర్మాతల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఆ తర్వాత విశాల్ ఆర్కే నగర్ నుంచి....కాకుంటే అన్నా నగర్, కేకే నగర్ల నుంచి పోటీ చేసుకోవచ్చాన్నారు. అయితే, గతంలో కబాలి ఫేం ధన్సికను ఓ ఫంక్షన్ వేదికపై రాజేందర్ అవమానించిన సంగతి తెలిసిందే. ధన్సిక క్షమాపణలు చెప్పినా వినకుండా సీనియర్ నటుడైన రాజేందర్ అలా వ్యవహరించడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో విశాల్ కూడా రాజేందర్ వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆ అక్కసుతోనే విశాల్ పై రాజేందర్ తాజా వ్యాఖ్యలు చేశారని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.