`త‌లైవి` షూట్.. ద్రౌప‌దీ వ‌స్త్రాప‌హ‌ర‌ణ ఘ‌ట్ట‌మా?

Update: 2020-09-13 05:00 GMT
జయలలిత విధేయులకు కరుణానిధి డిఎంకె అంటే ప‌ట్ట‌రాని ద్వేషం ఉంద‌ని ఓ ప్ర‌తిపాదిత‌ సిద్ధాంతం చెబుతుంది. 25 మార్చి 1989 న తమిళనాడు అసెంబ్లీలో డిఎంకె ఎంఎల్‌ఎ జ‌య‌ల‌లిత చీర కొంగును ప‌ట్టి లాగిన సంఘటనను ఎవ‌రూ మ‌రువ‌రు. అయిత ఆ ఘ‌ట్టం అమ్మ రాజకీయ మైలేజీని పెంచుకునేందుకు తెలివిగా ఉప‌యోగించుకోగ‌లిగారు. ద్రౌపది వ‌స్త్రాప‌హ‌ర‌ణం అని దానికి పేరు పెడితే అంత సీనేం లేద‌ని చెబుతూనే AIADMK నాయ‌కులు త‌మ ప్రాబ‌ల్యాన్ని పెంచుకునే ప్ర‌య‌త్నం చేశారు. కరుణానిధిని దుర్యోధనుడితో పోలుస్తూ ప్ర‌చారం హోరెత్తించారు. వాస్తవానికి 1991 ఎన్నికల ప్రచారంలో జయలలిత ఈ సంఘటనపై విరుచుకుపడ్డారు. అది త‌న‌కు ఓట్లు కురిపించింది.

అందుకే ఇప్పుడు ఆ ఘ‌ట్టం పై స‌న్నివేశాల్ని తెర‌కెక్కించేందుకు త‌లైవి బృందం రెడీ అవుతోంది అన‌గానే అమ్మ అభిమానుల్లో ఒక‌టే ఉద్వేగం క‌నిపిస్తోంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెర‌కెక్కుతున్న‌ తలైవి లో ఈ స‌న్నివేశాలు ఆద్యంతం ఉద్వేగ‌భ‌రితంగా ఉంటాయిట‌.

నిజానికి నవంబర్ లోనే ఈ సీన్స్ తీయాల్సింది. క‌రుణానిధి పాత్ర‌ధారి ప్రకాష్ రాజ్ .. అమ్మ పాత్ర‌ధారి కంగన పై అసెంబ్లీ సన్నివేశాలను ప్లాన్ చేశారు. కానీ అప్పుడు కుద‌ర‌లేదు. ఆ షూటింగును ఇప్పుడు పూర్తి చేయ‌నున్నార‌ట‌. చెన్నైలోని ఓ స్టూడియోలో నిర్మించిన అసెంబ్లీ సెట్ లో సెప్టెంబ‌ర్ 11 నుండి చిత్రీక‌ర‌ణ సాగ‌నుంద‌ని తెలుస్తోంది. నిజానికి ఎన్టీఆర్ బ‌యోపిక్ లో జ‌రిగిన త‌ప్పుల్ని రిపీట్ కానివ్వ‌కుండా నిర్మాత విష్ణు ఇందూరి త‌లైవి కోసం ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు? అన్న చ‌ర్చా మ‌రోసారి జ‌రుగుతోంది.

ఈ చిత్రానికి బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టును అందించారు. తమిళం- తెలుగు-హిందీ భాషల్లో ఈ మూవీ విడుదలకానుంది. ఎంతో కీల‌క‌మైన‌ ఎం.జి.రామచంద్రన్ పాత్రలో అరవింద్‌ స్వామి నటిస్తున్న సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News