మహాలక్ష్మి మూవీకి క్రెడిట్‌ వివాదం తప్పదా?

Update: 2019-02-02 09:47 GMT
బాలీవుడ్‌ లో సూపర్‌ హిట్‌ అయిన 'క్వీన్‌' చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళంలో రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. మిగిలిన భాషల్లో రీమేక్‌ విషయం పక్కన పెడితే తెలుగు రీమేక్‌ 'దటీజ్‌ మహాలక్ష్మి' విషయంలో మాత్రం వివాదం తలెత్తే అవకాశం కనిపిస్తుంది. ఈ చిత్రాన్ని సగానికి పైగా దర్శకుడు నీలకంఠ తెరకెక్కించాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం నుండి ఆయన తప్పుకున్నాడు. ఆ కారణాలు ఏంటీ అనే విషయమై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం 'దటీజ్‌ మహాలక్ష్మి' చిత్రాన్ని 'అ!' ఫేం ప్రశాంత్‌ వర్మ పూర్తి చేసే పనిలో ఉన్నాడు.

ప్రస్తుతం బాలీవుడ్‌ మూవీ 'మణికర్ణిక' డైరెక్టర్‌ విషయంలో వివాదం కొనసాగుతోంది. సినిమాను తాను తెరకెక్కిస్తే కంగనా ఆ క్రెడిట్‌ ను తీసుకుంటుందని క్రిష్‌ ఆరోపిస్తున్నాడు. 75 శాతం సినిమాను తాను తెరకెక్కించాను. కంగనా కేవలం ప్యాచ్‌ వర్క్‌ మాత్రమే చేసింది అంటూ క్రిష్‌ విమర్శలు చేస్తున్నాడు. ఇలాంటి వివాదమే త్వరలో 'దటీజ్‌ మహాలక్ష్మి' విషయంలో కూడా వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది. తమన్నా కారణంగా నిలకంఠ సినిమా నుండి తప్పుకున్నాడని, ఆయన ఆగ్రహంతో ఉన్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

'దటీజ్‌ మహాలక్ష్మి' చిత్రం క్రెడిట్‌ తనకే దక్కుతుంది అంటూ తాజాగా నీలకంఠ సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా బ్యాలన్స్‌ వర్క్‌ చేస్తున్న ప్రశాంత్‌ వర్మ కూడా తనకే ఈ క్రెడిట్‌ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నాడు. ఈ సమయంలోనే తమన్నా మాట్లాడుతూ దటీజ్‌ మహాలక్ష్మి చిత్రం నుండి నీలకంఠ తప్పుకోవడం లో తన ప్రమేయం ఏమీ లేదని, ఆయన సినిమా నుండి తప్పుకున్న తర్వాత కూడా నాతో స్నేహంగానే ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. మణికర్ణిక విడుదలకు ముందు కూడా క్రిష్‌ విషయంలో కంగనా ఇలాగే మాట్లాడింది. కాని 'మణికర్ణిక' విడుదల తర్వాత పరిస్థితి ఏంటీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దటీజ్‌ మహాలక్ష్మి విషయంలో కూడా అదే జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News