కరోనాపై పోరాటానికి ముందుకొచ్చిన మరో స్టార్ హీరోయిన్!

Update: 2020-04-19 08:05 GMT
కరోనా వైరస్ ప్రభావం దేశవ్యాప్తంగా అన్ని రంగాలపైనా పండింది. ఇక చిత్ర పరిశ్రమ విషయానికి వస్తే లాక్ డౌన్ నడుస్తుండటంతో షూటింగ్ లు వాయిదా పడ్డాయి.. దీనితో రోజువారీ వేతనాలు చేసుకునే సినీ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు తెలుగు ఇండస్ట్రీ ముందుకు వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి సార‌థ్యంలో కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం (సీసీసీ)ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఛారిటీ కి తమ వంతు సాయంగా ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి - అక్కినేని నాగార్జునతో పాటు మిగతా నటులు కూడా ముందుకొచ్చి తమ వంతు ఆర్థిక సహాయం చేశారు. ఇప్పటి దాకా విరాళాలు ఇచ్చిన వారిలో అందరూ హీరోలు - నిర్మాతలే ఉండగా హీరోయిన్స్ ఒకరిద్దరే ఉన్నారు. అందులో కాజల్ అగర్వాల్ - ప్రణీత - లావణ్య త్రిపాఠి లాంటి హీరోయిన్స్ ఉన్నారు.

ఈ నేపథ్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ 'మనకోసం'కు ఇప్పుడు తాజాగా హీరోయిన్ తమన్నా రూ. 3 లక్షల విరాళాన్ని ప్రకటించి సాయానికి ముందుకు రావడంలేదనే అపవాదులను చెరిపేసుకుంది. ఈ 3 లక్షల రూపాయలను ఆమె ఆర్‌టిజిఎస్ ద్వారా సీసీసీకి పంపించారు. ఈ విపత్కర సమయంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు క‌రోనా క్రైసిస్ ఛారిటీ మనకోసం సంస్థకు నా వంతు బాధ్యతగా రూ. 3 లక్షల సహాయం అందిస్తున్నానని.. ప్రతి ఒక్కరూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సూచనలను పాటిస్తూ ఇంటి వద్దనే ఉండి.. సురక్షితంగా ఉండండి.. అని తమన్నా కోరారు. అందరూ ముందుకొచ్చి తమకు తోచిన విధంగా సహాయం చేయాలని కోరింది. అంతేకాకుండా 'లెట్స్ ఆల్ హెల్ప్' అనే స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి ముంబై ప్రాంతంలో కరోనా వల్ల ఇబ్బంది పడుతున్న వలస కూలీల జీవితాలకు భరోసానిస్తోంది.

'లెట్స్ ఆల్ హెల్ప్' ఎన్.జీ.వో ద్వారా స్లమ్ ఏరియాల్లో నివసించే వారికి - వలస కూలీలకు - అనాధశరణాలయాలకు - వృద్ధాశ్రమాలకు ఆహారం మరియు మెడిసిన్స్ అందించడానికి కృషి చేస్తోంది. కేవలం వారికే కాకుండా పనిలేక ఇబ్బంది పడుతున్న రోజువారీ కూలీలకు కూడా ఈ సహాయం జరిగేలా చూస్తోంది. మిల్కీ బ్యూటీ చేస్తున్న ఈ మంచి పనికి అందరూ ఆమెని ప్రశంసిస్తున్నారు. మరోవైపు తెలుగు చిత్రసీమలోని సినీ కార్మికుల కోసం బాలీవుడ్ బడా హీరో అమితాబ్ బచ్చన్ సైతం ముందుకొచ్చి తన విరాళం అందించారు. ఒక్కొక్కటీ 1500 విలువగల 12000 షాపింగ్ కూపన్లను సీసీసీకి అందించారు. ఏదేమైనా దేశం కష్టాల్లో ఉన్నప్పుడు మేమున్నాం అంటూ సినీ ఇండస్ట్రీ ముందుకు రావడం మెచ్చుకోదగ్గ విషయమనే చెప్పాలి.
Tags:    

Similar News