ప్ర‌శాంత్ నీల్ కేజీఎఫ్ పై త‌మిళ డైరెక్ట‌ర్ క‌న్ను!

Update: 2022-07-20 00:30 GMT
రాఖీభాయ్ అన‌గానే వినిపించే పేరు న‌రాచీ, కేజీఎఫ్.. క‌న్న‌డ రాకింగ్ స్టార్ యష్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా సెన్సేష‌న్ 'కేజీఎఫ్'. ప్రశాంత్ నీల్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీ రెండు భాగాలుగా విడుద‌లై దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి భార‌తీయ సినీ చ‌రిత్ర‌లోనే స‌రికొత్త‌ సంచ‌ల‌నాలు సృష్టించింది. తొలి భాగం ఊహించిని స్థాయిలో విజ‌యాన్ని సొంతం చేసుకోగా పార్ట్ 2 అంత‌కు మించిన విజ‌యాన్ని అందించ‌డ‌మే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1250 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది.

'బాహుబ‌లి' త‌రువాత ఆ స్థాయిలో 'కేజీఎఫ్‌' సీరీస్ రికార్డు స్థాయి విజ‌యాన్ని సాధించ‌డంతో ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా మేక‌ర్ల ఆలోచ‌న‌లు, స‌మీక‌ర‌ణాలు మారిపోయాయి. ఇండియ‌న్ సినిమా స్థాయిని మ‌రోసారి ద‌క్షిణాది సినిమా పెంచ‌డంతో ఇప్ప‌డు అంతా పాన్ ఇండియా సినిమాల‌పై ప్ర‌త్యేక దృష్టిని పెట్టారు. ఇదిలా వుంటే రెండు భాగాలుగా వ‌చ్చిన ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యం సాధించి పార్ట్ 3 కూడా వుంద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో ఇప్ప‌డు అంతా 'కేజీఎఫ్ 3' ఎప్పుడెప్పుడు ప‌ట్టాలెక్కుతుందా? అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా వుంటే రాఖీభాయ్ సామ్రాజ్యంలోకి మ‌రో స్టార్ హీరో ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌న్న వార్త ఇప్ప‌డు నెట్టింట సంచ‌ల‌నంగా మారి ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ద‌ళతుల అంశాల‌నే ప్ర‌ధానంగా ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు త‌మిళ ద‌ర్శ‌కుడు పా. రంజిత్‌. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ తో వ‌రుస‌గా క‌బాలి, కాలా వంటి సినిమాల‌ని రూపొందించి టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలిచిన ఈ ద‌ర్శ‌కుడు ఇటీవ‌ల చియాన్ విక్ర‌మ్ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్ కు శ్రీ‌కారం చుట్టారు.  

విశేషం ఏంటంటే ఈ మూవీని 3డీ ఫార్మాట్ లో అత్యంత భారీ స్థాయిలో తెర‌పైకి తీసుకురాబోతున్నారు. కె. ఇ. జ్ఞాన‌వేళ్ రాజా స్టూడియో గ్రీన్ బ్యాన‌ర్ పై అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌బోతున్నారు. ఇటీవ‌లే చెన్నైలో పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.ఈ మూవీని 1800 సంవ‌త్సర కాలంలో ద‌ళితుల‌పై జ‌రిగిన కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. 19వ శ‌తాబ్దం నేప‌థ్యంలో ఈ మూవీ క‌థ సాగుతుంద‌ని చెబుతున్నారు. అయితే 'కేజీఎఫ్‌'కు ఈ సినిమాకు సంబంధం ఏంట‌న్న‌దే ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది.

ఇండిపెండెన్స్ కి ముందు న‌రాచీలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జ‌రిగిన అరాచ‌కాల‌ని ఈ సినిమాలో చూపించ‌బోతున్నార‌ట‌. ప్ర‌శాంత్ నీల్ 'కేజీఎఫ్‌' సిరీస్ చిత్రాల‌ని స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత క‌థ‌తో రూపొందిస్తే పా. రంజిత్ మాత్రం స్వాతంత్య్రానికి పూర్వం న‌రాచీలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జ‌రిగిన అరాచ‌కాల‌ని ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు స్వ‌యంగా ద‌ర్శ‌కుడు పా. రంజిత్ వెల్ల‌డించ‌డం విశేషం.

19వ శ‌తాబ్దంలో కేజీఎఫ్ లో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నాం. ఇదొక మ్చాజిక‌ల్ రియ‌లిజ‌మ్ తో సాగే సినిమా. బ్రిటీష్ రూల్ లో వున్న ఈ ఏరియాలో మ‌నుషుల‌ని ఎలా ట్రీట్ చేశార‌న్న‌ది వాస్త‌వికంగా చూపించ‌బోతున్నాం. మ‌ద్రాస్ ప్రెసిడెన్సీలో త‌మిళ‌నాడు, క‌ర్ణాట‌క‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ క‌లిసే వున్నాయి. ఆ టైమ్ లో జ‌రిగిన క‌థ‌గా ఈ సినిమా వుండ‌బోతోంది. 'స‌ర్ ప‌ట్ట‌'కు క‌థ అందించిన త‌మిళ్ ప్ర‌భ ఈ సినిమాకు నాతో క‌లిసి క‌థ అందిస్తున్నాడు' అని తెలిపారు పా. రంజిత్‌.
Tags:    

Similar News