తమిళ నిర్మాత సుసైడ్ నోట్ రాసి కాశీకి

Update: 2016-05-31 06:47 GMT
ఈ మధ్యే మలయాళ పరిశ్రమలో ఓ నిర్మాత.. తన సినిమా రషెస్ చూసుకున్న అనంతరం ఆవేదనతో ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఇప్పుడు కోలీవుడ్లో ఈ ఉదంతాన్ని గుర్తు చేస్తూ ఓ ప్రముఖ నిర్మాత ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి పెట్టి కలకలం రేపుతోంది. ఆ నిర్మాత పేరు మదన్. ఆరవన్ (తెలుగులో ఏకవీర).. లింగా.. పాండియనాడు (పల్నాడు).. పాయుంపులి (జయసింహా) లాంటి భారీ బడ్జెట్ సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేయడంతో పాటు కొన్ని సినిమాలు నిర్మించిన ‘వేందార్ మూవీస్’ అధినేత అయిన మదన్ ఇలా సుసైడ్ నోట్ పెట్టి కాశీకి వెళ్లిపోయాడు.

మదన్ ఆధ్వర్యంలోని వేందార్ మూవీస్.. ఎస్ఆర్ఎం గ్రూప్ లో భాగం. ఆ గ్రూప్ అధినేత అయిన పారి వేందార్ ఆరు నెలలుగా మదన్ తో మాట్లాడట్లేదట. ఆయన కుటుంబ సభ్యులు తనను ఓ ద్రోహిలాగా చూస్తున్నారని.. పారి వేందార్ ఆస్తులన్నింటినీ తనకు రాసిచ్చేయబోతున్నాడని అనుమానిస్తున్నారని.. అందుకే తాను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానని మదన్ సుసైడ్ నోట్లో రాశాడు. ఎస్ఆర్ఎం గ్రూప్ లోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో చేర్పించడం కోసం తాను విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశానని.. ఆ డబ్బు.. వాటి వివరాలన్నీ మేనేజ్మెంట్ కు అప్పగించానని.. మళ్లీ తాను మరో జన్మ కోరుకోవట్లేదు కాబట్టే కాశీలో చనిపోవాలని నిర్ణయించుకుని అక్కడికి వెళ్లిపోతున్నానని అతను వెల్లడించాడు. తాను పారి వేందార్ కోసమే బతికానని.. ఆయన కోసమే తన ప్రాణాలు అర్పిస్తున్నానని తెలిపాడు. ఈ లేఖ చదవగానే మదన్ కుటుంబ సభ్యులు కాశీకి బయల్దేరారు. లారెన్స్ హీరోగా తెరకెక్కుతున్న మొట్ట శివ కెట్ట శివ (పటాస్ రీమేక్)కు కూడా మదనే నిర్మాత కావడం విశేషం.
Tags:    

Similar News