ఆ వివాదంతో ఇండ‌స్ట్రీని చుల‌క‌న‌ చేశారు!

Update: 2018-09-05 11:58 GMT
`మా`లో మొద‌లైన వివాదం చినికి చినికి గాలివాన‌లా మారిన సంగ‌తి తెలిసిందే. `మా` నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల నిధులు  దుర్వినియోగమ‌య్యాయంటూ వ‌చ్చిన ఆరోప‌ణ‌లు టాలీవుడ్ లో పెను దుమారం రేపాయి. నిధులు దుర్వినియోగం చేసినట్టు నిరూపిస్తే - తన ఆస్తి మొత్తాన్నీ ఇండ‌స్ట్రీకి రాసిచ్చేస్తానని ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా సవాల్ విసిరారు. అయితే, నిధులు దుర్వినియోగం అయిన‌ట్లు అనుమానాలున్నాయ‌ని, దానిపై ఓ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని `మా` కార్యదర్శి - సీనియర్ నటుడు నరేశ్ డిమాండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే ఈ వ్య‌వ‌హారం మీడియాలో హైలైట్ అయింది. దీంంతో, తాజాగా ఈ వివాదంపై ప్ర‌ముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. త‌న యూట్యూబ్ చానెల్ ‘నా ఆలోచన’ లో త‌మ్మారెడ్డి తన అభిప్రాయాలను వెల్ల‌డించారు.

ఈ వివాదం చూస్తుంటే త‌న‌కు కోపం...నవ్వు వ‌స్తున్నాయ‌ని త‌మ్మారెడ్డి అన్నారు. నరేశ్ - శివాజీ రాజాలిద్దరూ మంచివార‌ని - చిన్నప్పటి నుంచి త‌న‌కు తెలుసని...వారిద్ద‌రికీ స్వార్థప‌రులు కార‌ని అన్నారు. వారిద్ద‌రూ ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్లని....అటువంటి వారు ఈరోజున‌ రోడ్డున పడటం బాధగా - కోపంగా ఉంద‌ని అన్నారు. `మా` సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఫండ్ రైజింగ్ చేద్దామనుకున్నార‌ని - ఆ ఫంక్ష‌న్ కు ఓ కంపెనీ వారు కోటి రూపాయలు ఇచ్చార‌ని అన్నారు. ఆ ఫంక్ష‌న్ అయిపోయింద‌ని - ఇచ్చిన కోటి రూపాయల కంటే ఎక్కువ వస్తుందా? మిగులుతుందా? అన్నది సంతకాలు పెట్టకముందు ఆలోచించుకుని ఉండాల్సిందని అన్నారు.

అంతేగానీ, ఇపుడు ఇద్దరూ ప్రెస్ మీట్స్ పెట్టి ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌ని....వారిని చూసి నవ్వాలో - ఏడ్వాలో - కొట్టాలో - కోప్పడాలో - తిట్టాలో అర్థంకాని పరిస్థితి అని అన్నారు. వారిద్ద‌రూ రోడ్డున ప‌డ‌డం వ‌ల్ల త‌మ‌లాగా ఖాళీగా ఉన్న వాళ్లకో - టీవీలలో మాట్లాడే వారికో అవకాశమివ్వడం తప్ప ఉప‌యోగం లేద‌ని అన్నారు. ఈ త‌ర‌హా సమస్యలన్నింటినీ ప‌రిష్క‌రించుకునేందుకు సినిమా ఇండస్ట్రీలో ఓ కమిటీ వేసుకున్నామ‌ని, అక్క‌డ చ‌ర్చించి ఉంటే వివాదం ప‌రిష్కారం అయి ఉండేద‌ని అన్నారు. లేని ఇష్యూని లేవ‌నెత్తి....ప్ర‌జ‌ల‌లోకి వెళ్లి ఇండ‌స్ట్రీని చులకనచేయ‌డం....బాధపడాల్సిన విషయమ‌న్నారు. వారిద్దరూ వచ్చి కూర్చుని సమస్యను పరిష్కరించుకోవాల‌ని, శివాజీరాజా - న‌రేష్ ల‌కు త‌మ్మారెడ్డి స‌ల‌హానిచ్చారు.

Tags:    

Similar News