చిరు విష‌యంలో త‌మ్మారెడ్డి బాణీ షాకిస్తోందే!

Update: 2021-08-26 02:30 GMT
ద‌ర్శ‌క‌ర‌త్న డా.దాస‌రి నారాయ‌ణ‌రావు శిష్యుడిగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ సుప‌రిచితులు. గురువుగారి ప్ర‌తి కార్య‌క్ర‌మంలో ఆయ‌న కీల‌క స‌భ్యుడు. బుల్లితెర వెండితెర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న నిర్మాత‌గా కొన‌సాగుతున్నారు. ఇక ప్ర‌జానాట్య‌మండ‌లి బాణీలో ఉన్న మాట‌ను బ‌లంగా మాట్లాడే త‌త్వం త‌మ్మారెడ్డి సొంతం.

ప‌రిశ్ర‌మ పెద్ద‌ల తప్పొప్పుల‌ను ఆయ‌న విశ్లేషిస్తారు. అయితే దాస‌రి మ‌ర‌ణానంత‌రం భ‌ర‌ద్వాజ త‌దిత‌రులు ఆ స్థానాన్ని భ‌ర్తీ చేయాల‌ని మెగాస్టార్ ని కోరారు. కానీ అందుకు చిరు తొలుత స‌మ్మ‌తించ‌లేదు. కానీ కాల‌క్ర‌మంలో ఆయ‌న యాక్టివిటీస్ అంద‌రివాడుగా మారాయి. ఓవైపు సినిమాలు చేస్తున్నా కానీ త‌న‌ని క‌లిసి స‌మ‌స్య‌ను వివ‌రిస్తే పరిష్క‌రించేందుకు ముందుకొస్తున్నారు. ఆర్టిస్టులు స‌హా ప‌రిశ్ర‌మ పేద‌ల క‌ష్టాల‌ను తెలుసుకుని మ‌రీ ఆర్థిక విరాళాలు అందిస్తున్నారు. గ‌త కొంత‌కాలంగా చిన్న సినిమాల‌ను కొత్త హీరోల‌ను మెగాస్టార్ ప్రోత్స‌హిస్తున్నంత‌గా ఎవ‌రూ ముందుకు రావ‌డం లేదు. ఆయ‌న పెద్ద‌రికానికి విలువిచ్చి ప‌రిశ్ర‌మ‌లో ఏ స‌మ‌స్య ఉన్నా ఆయ‌న‌ను క‌లుస్తున్నారు.

కార‌ణం ఏదైనా దాస‌రి శిష్యునిగా ఉన్న‌ప్పుడు భ‌ర‌ద్వాజా మెగాస్టార్ ని ప‌లు సంద‌ర్భాల్లో తీవ్రంగా విమ‌ర్శించారు. చిరు ప్ర‌జారాజ్యం పార్టీని ప‌వ‌న్ జ‌న‌సేన‌పైనా విమ‌ర్శ‌లు గుప్పించారు. అయితే ఇటీవ‌ల ఆయ‌న బాణీ మారింది. మెగాస్టార్ సీసీసీ సేవాకార్య‌క్ర‌మాలు స‌హా పేద‌ల‌కు ఆర్థిక విరాళాల అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ప్ర‌శంసిస్తున్నారు. చిరు కొన్నేళ్లుగా ఇండస్ట్రీకి ఏ కష్టం వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తున్నారని.. గొప్ప సేవ‌లు చేస్తున్నార‌ని తమ్మారెడ్డి అన్నారు.  దశాబ్దాలుగా బ్లడ్ బ్యాంక్-ఐ బ్యాంక్ నెల‌కొల్పి సేవ‌లు చేస్తున్నార‌ని గుర్తు చేశారు. క‌రోనా క్రైసిస్ లో చిరు సేవ‌లు అసామాన్య‌మ‌ని కీర్తించారు. ఆక్సిజన్ సిలిండర్ల కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారని..ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో చిరు సాయం ఉంద‌ని  తమ్మారెడ్డి తెలిపారు. ల‌క్ష‌ల్లో దానాలిస్తున్నార‌ని ల‌క్ష‌- 2ల‌క్ష‌లు చెక్కులు రాసి ఇస్తున్నార‌ని కూడా చిరుని ప్ర‌శంసించారు. ఇలాంటి సాయాల్ని ఆయ‌న ప్ర‌చారం చేసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌లేద‌ని కూడా అన్నారు. అయితే మంచి ప‌దిమందికి తెలిసేందుకు ఈమాత్రం బ‌య‌ట‌కు తెలుస్తుంద‌ని కూడా అన్నారు. సినీప‌రిశ్ర‌మ నుంచి ఏ సాయం లేదు.. నిద్ర‌పోతుందా? అని ప్ర‌శ్నించేవారికి ఇదే చిరు స‌మాధానం అని కూడా ప్ర‌శంస‌లు కురిపించారు. మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజా కొన్నేళ్ల క్రితం ఓ సినిమాని నిర్మించిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News