పవన్ డబ్బుమనిషి కాదు .. కానీ ఆయనకి నిలకడలేదు!

Update: 2022-01-04 00:30 GMT
తెలుగు సినిమా పరిశ్రమలో దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి మంచి పేరు ఉంది. సినిమా అయినా .. రాజకీయాలైనా తన అభిప్రాయన్ని సూటిగా చెప్పడానికి ఆయన ఎంతమాత్రం వెనుకాడరు. తాను చెప్పదలచుకున్న విషయాన్ని ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా నిర్మొహమాటంగా చెబుతుంటారు. తాజా ఇంటర్వ్యూలో .. "జగన్ పాలన బాగుంటే నేను మళ్లీ సినిమాల్లోకి వస్తానని పవన్ కల్యాణ్ గారు అన్నారు. మరి జగన్ పాలన బాగుందని ఆయన సినిమాల్లోకి వచ్చారా? లేదంటే ఇన్ కమ్ సోర్సెస్ కోసం వచ్చారా? అనే ప్రశ్న ఆయనకి ఎదురైంది.

అందుకు తమ్మారెడ్డి స్పందిస్తూ .. "పవన్ సినిమాలు మానేసి ఉంటే మనం ఈ విషయాన్ని గురించి మాట్లాడాలి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను నేను చూడలేదుగానీ .. ఇప్పుడు పవన్ 5 సినిమాలు ఒప్పుకున్నాడు కాబట్టి జగన్ పాలన బాగున్నట్టే అనుకోవాలి. పవన్ ఎన్ని సినిమాలు చేస్తే ఒక పొలిటికల్ పార్టీ నడుస్తుంది. సినిమాకి 50 కోట్లు .. 100 కోట్లు తీసుకున్నాడని అనుకుందాం. ఏడాదికి రెండు సినిమాలు .. లేదంటే మూడు సినిమాలు చేస్తాడు. 300 కోట్లతో ఒక పార్టీ నడుస్తుందా .. ఈ రోజుల్లో. పార్టీ నడపాడానికి సినిమా చేస్తానంటే అది జరిగే పని కాదు .. అది నిజం కూడా కాదు నా ఉద్దేశంలో.

పవన్ డబ్బు మనిషి కాదు .. అంతవరకూ నాకు తెలుసు. ఆ డబ్బు పార్టీకే వాడతాడు కూడా .. కానీ ఆ డబ్బు చాలదు. ఆయన ఒక మాట మీదుండి .. ఒక పద్ధతిగా వెళితే ఆయనకి డబ్బు అక్కర్లేదు. పవన్ కల్యాణ్ ఎంత గొప్ప లీడర్ అంటే .. నిజంగా ఆయనను నడిపించుకోగలిగితే ఆయన ఏదైనా చేయగలడు రాష్ట్రానికి. ఆయన ఒక మాట మీద ఉంటే ఏదైనా చేయగలడు .. కానీ ఆయన ఉండటం లేదు. పదేళ్లుగా చూస్తున్నాము .. ఆయన ఏ మాట మీదా నిలబడటం లేదు. నిలకడలేని మనిషిలా అయిపోయాడు. అలా కాకుండా ఉంటే .. డబ్బు సంపాదించి తీసుకునివెళ్ల వలసిన అవసరం లేదు. ప్రజలే ఆయనను కాపాడతారు" అంటూ చెప్పుకొచ్చారు. 
Tags:    

Similar News