తెలుగోళ్లు లైట్ తీసుకున్నా 3 రోజుల్లో రూ.61కోట్లు లాగేసిందట

Update: 2020-01-13 14:30 GMT
రెండు తెలుగు రాష్ట్రాల సినిమా మార్కెట్ ఎంత పెద్దదన్న విషయం ఇటీవల విడుదలవుతున్న చిత్రాలకు వస్తున్న కలెక్షన్లను చూస్తున్న మిగిలిన వుడ్డులకు బాగానే అర్థమవుతోంది. ఈ కారణంతోనే పలువురు నిర్మాతలు ఇతర భాషల్లో సినిమాలు తీస్తున్నా.. తెలుగోళ్లకు ఏ మాత్రం కనెక్ట్ అయ్యే చిత్రాన్ని అయినా తెలుగులో డబ్బింగ్ చేసి వదులుతున్నారు.

అలా సాధ్యం కాదనుకుంటే.. ఒరిజనల్ లో వదిలేస్తున్నారు. అలా వదిలిన వాటికి భారీ కలెక్షన్లను సొంతం చేసుకున్న సినిమాకు ఎగ్జాంఫుల్ గా హాలీవుడ్ మూవీ జోకర్ చెప్పొచ్చు. పరిమితమైన థియేటర్లలో ఈ బొమ్మను వేసినా.. చాలా రోజులు టికెట్లు దొరకని పరిస్థితి. తెలుగు నిర్మాతలు సైతం ఆశ్చర్యపోయేలా ఈ చిత్ర కలెక్షన్లు వచ్చాయి. ఆ సమయంలో తెలుగు సినిమాలేవీ పెద్దగా విడుదల కాకపోవటంతో మరింత లాభించింది.

భాష ఏదైనా.. కాస్త కంటెంట్ ఉంటే చాలు తెలుగు ప్రజలు ఇట్టే కనెక్ట్ అయిపోతారనటానికి ఇదో ఉదాహరణగా చెప్పొచ్చు. ఇంగ్లిషు సినిమాల సంగతి ఇలా ఉంటే.. హిందీ సినిమాలు డబ్బింగ్ లేకున్నా.. తెలుగు నేల మీద భారీ కలెక్షన్లను సొంతం చేసుకోవటాన్ని మర్చిపోకూడదు. అయితే.. ఇందుకు భిన్నంగా ఒక సినిమాను తెలుగోళ్లు అస్సలు పట్టించుకోకున్నా.. మూడు రోజుల వ్యవధిలో ఆసినిమాకు వచ్చిన కలెక్షన్లు భారీగా ఉండటం ఆసక్తికరంగా మారింది.

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గన్ తో పాటు.. కాజోల్.. సైఫ్  నటించిన హిందీ పిరియడ్ డ్రామా చిత్రం తన్హాజీ :  అన్ సంగ్ వారియర్ చిత్రానికి భారీగా వసూళ్లను సాధిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం కేవలం మూడురోజులకే రూ.61.7 కోట్ల వసూళ్లను సాధించింది. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ సైన్యాధ్యక్షుడైన తన్హాజీ మలుసరే జీవిత కథ ఆధారంగా నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు కలెక్షన్లు భారీగా వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు సైతం తెలుగు సినిమాలతో ఫుల్ అయిపోయాయి. శుక్రవారం తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన దర్బార్ బొమ్మతో థియేటర్లు ఫుల్ అయితే.. ఒక్క రోజు వ్యవధి తర్వాత మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం వచ్చేయటం.. బ్యాక్ టు బ్యాక్ బన్నీ అల వైకుంఠపురములో రావటంతో థియేటర్లు ఖాళీ లేని పరిస్థితి. దీంతో.. తన్హాజీ చిత్రానికి అరకొర షోలకే పరిమితం చేశారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పరిస్థితి ఇలా ఉన్నా.. మహారాష్ట్ర లో ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురుస్తుంది. దీంతో.. మూడురోజుల వ్యవధిలో ఏకంగా రూ.61.7 కోట్లు  కొల్లగొట్టింది. ఊహించని రీతిలో దీపికా చపాక్ చిత్రం అలరించకపోవటం కూడా ఈ సినిమాకు లాభించిందని చెబుతున్నారు. సాధారణంగా దీపిక ఏ సినిమాకైనా వచ్చే సగటు ఓపెన్సింగ్ రాకపోవటం.. ఆ ప్రేక్షకులంతా తన్హాజీకి టర్న్ కావటం ఆ చిత్రానికి లాభించినట్లు చెబుతున్నారు. ఏమైనా.. తెలుగోళ్లు లైట్ తీసుకున్న ఈ బాలీవుడ్ మూవీ కోట్లు కొల్లగొట్టేయటం విశేషంగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News