శేఖర్ కమ్ములను కదిలించిన కన్నీటి కథనం!

Update: 2021-10-26 08:26 GMT
ఈ తరం సినిమాలను మాలగా కడితే మకరందం నిండిన సుమాలుగా శేఖర్ కమ్ముల సినిమాలు కనిపిస్తాయి. శేఖర్ కమ్ముల సినిమాల్లో కథ అందంగా నడుస్తుంది. ఆయన సినిమాల్లో ఆదర్శం .. సందేశం కనిపిస్తాయి. మనసు లోతుల్లో దాగిన మానవతా పరిమళాలను దోసిట దూసి వెదజల్లుతాయి. చాలామంది సినిమాల్లో సందేశాలు ఇస్తారు .. సహాయాలు చేస్తారు. కానీ బయట వాళ్ల పేర్లు అలాంటి సేవా కార్యక్రమాలకు చాలా దూరంగా వినిపిస్తాయి. కానీ శేఖర్ కమ్ముల అలా కాదు. సినిమాల ద్వారా నాలుగు మంచి మాటలు చెప్పడమే కాదు, నలుగురికి సాయం చేయడం కూడా తెలుసు.

అందుకు నిదర్శనంగా రీసెంట్ గా జరిగిన ఒక సంఘటనను గురించి చెప్పుకోవచ్చు. సూర్యాపేట జిల్లా .. మునగాల మండలం పరిధిలోని 'నేలమర్రి' గ్రామానికి కప్పల లక్ష్మయ్య సొంత ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాడు. ఇటీవల ఆయన తన సోతరులతో కలిసి, ఉన్న కాస్త పొలం అమ్మడం వలన, ఆయన వాటాగా 10 లక్షలు వచ్చాయి. దాంతో ఆయన ఆ డబ్బుతో సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం తాను ఉంటున్న గుడిసెలోని బీరువాలో 6 లక్షల రూపాయలను దాచి, మిగతా డబ్బుతో అందుకు సంబంధించిన సన్నాహాలు చేయడం మొదలుపెట్టాడు.

ఇంటికి ముగ్గుపోసే పనుల్లో ఆయన ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ నెల 21వ తేదీన వంట చేసుకుందామని ఆయన గ్యాస్ స్టవ్ వెలిగించాడు. అప్పటికే గ్యాస్ ఆన్ చేసి ఉన్న కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి గుడిసెకు నిప్పు అంటుంది. ఈ ప్రమాదం నుంచి లక్ష్మయ్య బ్రతికి బయటపడ్డాడుగానీ, గుడిసెతో పాటు బీరువా .. అందులోని 6 లక్షల రూపాయల నగదు కాలిపోయింది. దాంతో ఇక తన సొంత ఇంటి కల నెరవేరడం అసాధ్యమని భావించిన ఆయన ఆ షాక్ నుంచి కోలుకోవడం లేదు. ఈ విషయమై ఎవరు కదిలించినా ఆయన కన్నీళ్లు పెడుతున్నాడు.

మనసును కదిలించే ఈ కథనం ఒక టీవీ ఛానల్లో ప్రసారమైంది. అనుకోకుండా ఆ కథనం శేఖర్ కమ్ముల చూడటం జరిగింది. ఒక వైపున ఉన్న పొలం అమ్ముకుని .. మరో వైపున ఉంటున్న గుడిసె కాలిపోయి .. ఇంకో వైపున సొంత ఇంటికల నెరవేరకుండా చేసుకున్న ఆ రైతు దీనగాథకి శేఖర్ కమ్ముల హృదయం ద్రవించింది. వెంటనే ఆయన ఆ రైతు బ్యాంకు ఖాతా నెంబర్ తెలుసుకుని, తనవంతు సాయంగా లక్షరూపాయలను బదిలీ చేశారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పారు. పెద్ద మనసుతో తమకి సాయం చేయడానికి ముందుకు వచ్చిన శేఖర్ కమ్ములకు, లక్ష్మయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
Tags:    

Similar News