ఇందిరతో మొదలయ్యే ఎన్టీఆర్ కథ?

Update: 2017-11-08 04:18 GMT
‘‘అవి ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న రోజులు. ఓసారి కారులో పార్టీ నాయకుడు పి.వి.నరసింహారావుతో కలిసి తిరుపతికి వెళ్తున్నారు. ఆ సమయంలో రోడ్డు పక్క రాముడు - కృష్ణుడి నిలువెత్తు కటౌట్లు కనిపించాయి. వాటికి ఆమె భక్తితో నమస్కరిస్తుంది. దాంతో పీవీ అవి నిజమైన దేవుళ్ల కటౌట్లు కాదని చెబుతారు. మరెవరివి అన్న ప్రశ్న వెనువెంటనే ఆమె నోటినుంచి వస్తుంది. దానికి పీవీ బదులిస్తూ... జనం గుండెల్లో దేవుడిగా నిలిచిపోయిన ఆ కటౌట్లు ఎవరివంటే...’’ ఎన్టీఆర్ జీవిత గాథతో బాలకృష్ణ హీరోగా చేస్తున్న సినిమా ఈ సీన్ తో మొదలుపెట్టాలన్నది ఆ సినిమా డైరెక్టర్ తేజ ఆలోచన.

నందమూరి తారక రామారావు ఎంత గొప్పవాడో ఓ ప్రధాని ఆసక్తిగా తెలుసుకోవడం అన్న ఎత్తుగడ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందన్నది తేజ ఆలోచన అని అతడి సన్నహితుడు ఒకరు చెప్పిన మాట. తెలుగువారందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు నందమూరి తారకరామారావు. కోట్లాదిమంది ఆరాధించిన నటుడిగా.. రాజకీయాల్లో అడుగు పెట్టిన అనతికాలంలోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. అలాంటి ఎన్టీఆర్ జీవిత గాథతో తెరకెక్కించేందుకు ఆయన తనయుడు - నందమూరి బాలకృష్ణ రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ యంగ్ ఏజ్ నుంచి నటుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని ఎలా పైకెదిగాడన్న దానిపైనే ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు.

వి.పి.సింగ్ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఎన్టీఆర్ బయోపిక్ ముగించేయబోతున్నారు. అంటే ఇందులో లక్ష్మీపార్వతి ఎపిసోడ్ కు అవవాశమే ఉండదు. ఎందుకంటే ఆ సమయానికి లక్ష్మీపార్వతి ఆయన జీవితంలోకి ఇంకా ప్రవేశించలేదు. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీపార్వతి ఎపిసోడ్ తోనే సినిమా తీస్తానంటున్నాడు. అంటే బాలకృష్ణ సినిమా ముగిసిన చోటే రామ్ గోపాల్ వర్మ సినిమా మొదలవుతుందన్న మాట.


Tags:    

Similar News