మరో అడల్ట్ కామెడీలో తెలుగమ్మాయ్

Update: 2017-05-08 06:19 GMT
హీరోయిన్ ఫ్రెండు.. చెల్లెలు టైపు పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న తెలుగమ్మాయి తేజస్వి మదివాడ.. హీరోయిన్ గా వెలిగిపోవాలని ఎప్పట్నుంచో కలలు కంటోంది. ‘ఐస్ క్రీమ్’ సినిమాతో హీరోయిన్ అవతారమెత్తిన తేజస్వి.. ఆ తర్వాత కేరింత.. రోజులు మారాయి లాంటి సినిమాల్లో వన్ ఆఫ్ ద హీరోయిన్స్ గా చేసింది కానీ.. అవేమీ ఆమెకు అంతగా బ్రేక్ ఇవ్వలేదు. తనకున్న ‘క్యూట్’ ఇమేజ్ పోయి.. ‘హాట్’ అనిపించుకోవాలని ఆమె అప్పుడప్పుడూ కొన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ‘బాబు బాగా బిజీ’ సినిమాలో కుర్రాళ్లను రెచ్చగొట్టే పాత్రలో కనిపించింది. కానీ అదేమంత మంచి ఫలితాన్నివ్వలేదు. ఆ సినిమాకు నెగెటివ్ టాక్ రావడంతో తేజస్వి ఆశ నెరవేరేలా లేదు.

తేజస్వి ఇప్పుడు మరో అడల్ట్ కామెడీ సినిమాలో చేయబోతుండటం విశేషం. ఇందులో ఆమెది సహాయ పాత్ర కాదు. లీడ్ హీరోయిన్ రోల్. కథంతా కూడా ప్రధానంగా ఆమె చుట్టూనే తిరుగుతుంది. ఇది కూడా రీమేకే కావడం విశేషం. మరాఠీలో విజయవంతమైన ‘బాలక్ పాలక్’ అనే అడల్ట్ కామెడీ రీమేక్ లో ముఖ్య పాత్ర చేయబోతోంది తేజస్వి. ఈ సినిమా సెక్స్ ఎడుకేషన్ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతుంది. టీనేజీలో సెక్స్ కోసం తపించే కుర్రాళ్లలో మార్పు తీసుకొచ్చే అమ్మాయి కథ ఇది. ఫన్నీగా సాగుతూనే చివరగా సందేశంతో ముగుస్తుందీ చిత్రం. ఈ సినిమా మరాఠీలో పెద్ద హిట్టయింది. శ్రీకాంత్ వెలగలేటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News