బెంగాలీ న‌టి మృతి కేసులో యంగ్ హీరో అరెస్టు

Update: 2017-07-07 06:21 GMT
ప‌శ్చిమ‌బెంగాల్ కు చెందిన‌ మోడల్, యాంకర్ సోనికా సింగ్ మృతి కేసులో యువ హీరో విక్రమ్ చటర్జీ ఇరుక్కున్నాడు. ఆయ‌న‌ను పోలీసులు అరెస్ట్  చేశారు.  కాగా... కారును అతి వేగంతో నడిపి సోనికా మృతికి కారణమయ్యాడన్న‌ది విక్ర‌మ్ పై ఉన్న ఆరోప‌ణ‌.

ఈ ఏడాది ఏప్రిల్ 29న వీరిద్దరూ ఓ పార్టీలో పాల్గొన్నారు. ఇద్దరూ కలసి మందు కొట్టారు. ఆపై కారులో తిరిగి వస్తున్న వేళ, మితిమీరిన వేగం కారణంగా అదుపు తప్పి పల్టీలు కొట్టి ఫుట్ పాత్ పైకి వెళ్లి, ఓ దుకాణాన్ని ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో సోనికా అక్కడికక్కడే మృతి చెందగా, విక్రమ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వాహనం నడుపుతున్న విక్రమ్ మద్యం తాగి ఉన్నాడని తేలడంతో, పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.

కాగా పార్టీ చేసుకుంటున్న స‌మ‌యంలో మద్యం తాగుతూ తీసుకున్న ఫోటోలను స్నేహితులకు విక్రమ్ షేర్ చేయగా, అవే ఇప్పుడు కేసులో కీలకంగా మారాయి. పైగా, కారును అతివేగంగా నడపటం కూడా సోనికా మరణానికి కారణమైంది. విక్రమ్ పై అభియోగాలు రుజువైతే 2 నుంచి పదేళ్ల వరకూ జైలుశిక్ష పడే అవ‌కాశం ఉంది.

మ‌రోవైపు ఈ కేసు నుంచి విక్ర‌మ్ ను త‌ప్పించేందుకు పోలీసుల‌పై రాజ‌కీయ ఒత్తిళ్లు వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. విక్ర‌మ్ ఉద్దేశ‌పూర్వ‌కంగా ఆమె మ‌ర‌ణానికి కార‌ణం కాన‌ప్ప‌టికీ తాగి వాహ‌నం న‌డ‌ప‌డం.. మితిమీరిన వేగంతో యాక్సిడెంట్ చేయ‌డం.. ఆ ప్ర‌మాదంలో సోనికా ప్రాణాలు కోల్పోవ‌డంతో ఆయ‌న నేర‌స్థుడ‌య్యాడు. కాగా పార్టీలో మందు తాగుతూ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో విక్ర‌మ్ త‌ప్పించుకోవడానికి వీల్లేకుండా దొరికిపోయాడు.
Tags:    

Similar News