టాలీవుడ్ స్టార్స్: మౌనమేలనోయి.. ?

Update: 2018-11-20 04:39 GMT
మన టాలీవుడ్ స్టార్స్ ఎప్పుడు ఏ విషయంలో మాట్లాడతారో.. ఏ విషయంలో ఉలుకూ పలుకూ లేకుండా మెదలకుండా ఉంటారో ఆ పైవాడికే తెలియాలి.  ఇలా కొన్ని సమస్యలపై మాత్రం స్పందిస్తూ.. మిగతా వాటిపై అసలు స్పందించకుండా ఉండడంపై టాలీవుడ్  పెద్దలపై విమర్శలు వస్తున్నాయి.  స్టార్లకు ఏదైనా లాభం ఉంటే మాట్లడతారని.. లేకపొతే అసలు మాట్లాడకుండా ఉంటారని విమర్శలు వస్తున్నాయి.

తెలంగాణా ఉద్యమం జోరుగా సాగే సమయంలో దాదాపు టాలీవుడ్ అంతా నోరుకుట్టేసినట్టు కూర్చుంది. రాజకీయాలలో ఉండేవాళ్ళు.. లేదా రాజకీయాల్లోకి రావాలనుకునే వారు తప్ప మిగతా వారందరూ ఒక్క మాట మాట్లాడలేదు. తమ ఒపీనియన్ అసలు చెప్పలేదు. ఇక ఏపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద కూడా సేమ్.  ఒక్కరూ మాట్లాడరు. #మీటూ హంగామా ఎంత జరిగినా.. జరుగుతున్నా దానిపై కూడా తమ స్పందన తెలపరు. 

కానీ ఇలాంటి సెలబ్రిటీలు జల్లికట్టు ఉద్యమం అంటే మాత్రం తమ మద్దతు ప్రకటిస్తారు. అంటే.. తెలిపితే తమకు తమిళుల దృష్టిలో మంచి పేరు వస్తుంది.. ఏమాత్రం నష్టం ఉండదు అనేగా ఉద్దేశం? అలా అని ఇప్పుడు చిన్మయి బ్యాన్ ఎపిసోడ్ లో ఒక్కరూ నోరు మెదపరు.  ఎందుకు అంటే ఆ విషయం మైలేజ్ వచ్చే సంగతి దేవుడెరుగు.. నష్టం ఎక్కువ జరుగుతుంది. లేనిపోని తలనొప్పి ఎందుకని కామ్ గా ఉంటున్నారు.   దీనర్థం ఒక్కటే. మాకు ఏదైనా లాభం ఉందంటే చేస్తాం.. విమర్శలు వచ్చేపనైతే హైబర్నేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతాం!

దీనికి వెర్షన్ కూడా ఉంది.  స్టార్స్ కు సన్నిహితంగా ఉన్నవారు ఏం చెబుతున్నారంటే.. "మన యూట్యూబ్ ఛానల్స్.. వెబ్ సైట్లు.. టీవీ చానల్స్ తో సహా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా ఏ సెలబ్రిటీ ఏం మాట్లాడతారా..? దానికి ఉప్పు కారం.. గరం మసాలా వేసి ఫుల్ గా మార్చి జనాలకు ఎలా అందించాలా అని ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఇలా అన్ని సమస్యలపై మాట్లాడి వాళ్ళ చేతిలో ఎందుకు బలవ్వాలి?" అని ఊరుకుంటున్నారట. వాళ్ళ వెర్షన్ లో కూడా కాస్త నిజం ఉందనిపిస్తోంది కదా?
   

Tags:    

Similar News