లాక్‌ డౌన్‌ తర్వాత కూడా ఇండస్ట్రీకి కష్టాలేనా?

Update: 2020-04-02 02:30 GMT
కరోనా ఎఫెక్ట్‌ ఇతర ఇండస్ట్రీలపై ఎంతగా చూపుతుందో ఇప్పట్లో తెలియదు కాని సినిమా ఇండస్ట్రీపై మాత్రం వెంటనే పడినది. ఇండస్ట్రీ మొత్తం లాక్‌ డౌన్‌ కారణంగా ఎక్కడికక్కడ ఆగిపోయింది. థియేటర్లు బంద్‌.. సినిమాల నిర్మాణాలు ఆగిపోయాయి.. షూటింగ్స్‌ ఆగిపోయాయి. విడుదల అవ్వాల్సిన పలు సినిమాలు ల్యాబ్‌ లో మూలుగుతున్నాయి. ఈ సమయంలో లాక్‌ డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కూడా సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు తప్పవేమో అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రెండు నెలల తర్వాత థియేటర్లు ఓపెన్‌ అవుతున్న నేపథ్యంలో ఇప్పటికే విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలను విడుదల చేసేందుకు ఆయా సినిమాల మేకర్స్‌ ఒక్కసారే థియేటర్ల మీద పడే అవకాశం ఉంది. ఆ సమయంలో కాస్త పలుకుబడి ఉన్న వారి సినిమాలే విడుదలకు ఛాన్స్‌ ఉంటుంది. అంటే థియేటర్లు ఎవరి చేతిలో ఉన్నాయో ఆ నిర్మాతల సినిమాలు మాత్రమే బయటకు వచ్చే ఛాన్స్‌ ఉందని అంటున్నారు. చిన్న సినిమాలకు కష్టకాలమే అంటున్నారు. ఇక డబ్బింగ్‌ సినిమాల పరిస్థితి కూడా దారుణం.

టాలీవుడ్‌ సినిమాల విడుదలకే కష్టాలు పడుతున్న సమయంలో డబ్బింగ్‌ సినిమాలను కూడా ఇక్కడ విడుదల చేసేందుకు వారు ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. కొందరు కోలీవుడ్‌ స్టార్‌ హీరోలు తమ సినిమాలను  డబ్‌ చేసి అక్కడ ఇక్కడ ఒకేసారి విడుదల చేయాలనుకుంటారు. కాని ఇప్పుడు ఆ పరిస్థితులు కష్టమే. ఎందుకంటే తెలుగులో ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బింగ్‌ సినిమాలు విడుదల అవ్వడం కష్టం. ఒకవేళ విడుదల అయినా కూడా ఎక్కువ థియేటర్లు లభించకపోవచ్చు.

ఇక చిన్న సినిమాల నిర్మాతలు తమకు థియేటర్లు ఇవ్వడం లేదు అంటూ ఆ నిర్మాతలపై గగ్గోలు పెట్టే ఛాన్స్‌ ఉంది. ఇలా లాక్‌ డౌన్‌ తర్వాత సినిమాల విడుదల విషయంలో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. ఇదే సమయంలో కొన్ని సినిమాలు క్యాన్సిల్‌ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఆర్థిక వనరులు ఇబ్బందులతో పలు సినిమాలు బడ్జెట్‌ తగ్గించుకనే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి లాక్‌ డౌన్‌ పూర్తి అయినా కూడా టాలీవుడ్‌ లో పరిస్థితి మాత్రం అంత సులభంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News