టాలీవుడ్లో వాట్సాప్ బంద్

Update: 2018-08-15 10:27 GMT
వాట్సాప్.. స్మార్ట్ ఫోన్ యుగంలో ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయిన యాప్. దీని ద్వారా సమాచార ప్రసారం ఏ స్థాయిలో జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సరదా చాటింగులు.. మెసేజ్ ఫార్వార్డింగ్ లతో పాటు సీరియస్ చర్చలకూ వాట్సాపే వేదిక. సినీ పరిశ్రమలోనూ వాట్సాప్ చాలా కీలకమే. ఒక సినిమా మొదలవుతోందంటే.. అందులోని కీలక వ్యక్తులందరూ కలిసి గ్రూప్ పెట్టేస్తుంటారు. అందులోనే సినిమాకు సంబంధించిన ముచ్చట్లన్నీ నడుస్తుంటాయి. ఫస్ట్ లుక్.. టీజర్.. ట్రైలర్ లాంటి వాటి రఫ్ కట్స్ ఒకరికొకరు పంచుకుని ఒపీనియన్ తీసుకుంటుంటారు ఈ గ్రూపుల్లోనే. ‘గీత గోవిందం’కు సంబంధించి కొన్ని కీలకమైన డిస్కషన్లు వాట్సాప్ గ్రూపులోనే నడిచినట్లు ఈ చిత్ర ఆడియ వేడుకలో అల్లు అరవింద్ స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే.

ఐతే ఇప్పుడు ఈ చిత్ర బృందంతో పాటు వేరే సినిమాల వాళ్లు కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఇన్ యాక్టివ్ అయిపోయినట్లు సమాచారం. ఆ గ్రూపులు నామమాత్రంగా నడుస్తున్నాయట. కీలక సమాచారం ఏదీ పంచుకోవడం లేదట. ‘గీత గోవిందం’ అనూహ్య రీతిలో పైరసీ బారిన పడి చాలా ఇబ్బందికర పరిస్థితి తలెత్తిన నేపథ్యంలో అందరూ అలెర్టయినట్లు సమాచారం. సమాచారం దాచిపెట్టడం కష్టంగా మారిపోతుండటం.. ఎవరినీ నమ్మే పరిస్థితి లేకపోవడంతో వాట్సాప్ కు సెలవిచ్చి.. ఇకపై కీలక సమాచారం ఏది పంచుకోవాలన్నా నేరుగా ల్యాప్ టాపులే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. ‘గీత గోవిందం’కే కాదు.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల చిత్రం ‘అరవింద సమేత’ సైతం ఈ మధ్య వరుసగా లీకుల బారిన పడిన నేపథ్యంలో ఇండస్ట్రీలో అప్రమత్తత బాగా పెరిగినట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News