ఫోకస్‌: లోకల్‌ గాళ్స్‌ని ఎంకరేజ్‌ చేస్తున్నారు

Update: 2015-07-09 15:30 GMT
టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌, శాండాల్వుడ్‌, మాలీవుడ్‌ .. పరిశ్రమ ఏదైనా లోకల్‌ గాళ్స్‌కి ప్రాధాన్యత పెరుగుతోందిప్పుడు. ఒకప్పుడు పొరుగున ఉన్న పుల్లకూర రుచి అన్న చందంగా ముంబైకో, ఢిల్లీకో, బెంగళూరుకో వెళ్లి కథానాయికల్ని ఎరువు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. కాలక్రమంలో ఈ ఎంపికల విషయంలో మార్పొచ్చింది. లోకల్‌గా నటించే అమ్మాయిల సంఖ్య పెరిగింది.

తెలుగులో అయితే స్వాతి, శ్రీదివ్య, బింధుమాధవి, మాధవీలత, మధుశాలిని, అర్చన, నందిత, ఆనందిని (రక్షిత) ఇంతమంది భామలు ముఖానికి రంగేసుకుని నాయికలుగా అవకాశాలు అందుకుంటున్నారు. కేవలం తెలుగు పరిశ్రమకే పరిమితం కాకుండా ఇరుగు పొరుగు పరిశ్రమల్లోనూ హవా చాటుకుంటున్నారు. ఇప్పుడు అదే కోవలో కన్నడ పరిశ్రమలో రాణించిన కథానాయికలు పొరుగు భాషల్లో పాపులర్‌ అవుతున్నారు.

    అయితే బెంగళూరు కేంద్రంగా ఉన్న కన్నడ పరిశ్రమలో కేవలం కన్నడ నటీమణుల హవా సాగుతోంది. నవతరం నాయికల్లో రాధికా పండిట్‌, రచన రామ్‌, నాభ నటేష్‌, మయూరి, నేహా శెట్టి ఇలా భామలంతా ఇటీవలి కాలంలో బాగా పాపులర్‌ అవుతున్నారు. వరుసగా లోకల్‌ ఛాన్సులు అందుకుంటూ స్థానిక దర్శకనిర్మాతల మెప్పు పొందుతున్నారు. ఓ మారు కోలీవుడ్‌ని పరిశీలిస్తే అక్కడా స్థానిక నాయికలకు ప్రాధాన్యత ఎక్కువగానే ఉంది. ప్రస్తుతం ఉన్న చాలామంది నాయికలు చెన్నయ్‌, మధురై పరిసరాలకు చెందిన వారే. ఇరుగు పొరుగు పరిశ్రమల నుంచి నాయికలు వచ్చి స్టార్లుగా ఎదిగినా.. ప్రస్తుతం చెన్నయ్‌ చంద్రాలు కూడా పాపులర్‌ అయిపోతున్నారు. త్రిష, అమలాపాల్‌, రెజీన ఇలా భామలంతా చెన్నయ్‌ కేంద్రంగా ఎదిగిన నాయికలే.

    అలాగే బాలీవుడ్‌లో నవతరం నటీమణులంతా లోకల్‌ గాళ్స్‌. ఆలియాభట్‌, సోనమ్‌కపూర్‌, సోనాక్షి, శ్రద్ధాకపూర్‌ ఇలా భామలంతా లోకల్‌ గాళ్స్‌. ప్రతి పరిశ్రమలోనూ స్థానికత అనేది ఎప్పటికప్పుడు చర్చకొచ్చేదే. కథానాయికల స్థానికతపైనా అప్పుడప్పుడు విస్త్రతంగానే చర్చ సాగుతోంది.

    టాలీవుడ్‌లో మునుముందు స్థానియ అమ్మాయిల ప్రవాహం పెరగనుంది. రాష్ట్రం రెండు ముక్కలయ్యాక మెట్రో కల్చర్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి వంటి నగరాలకు పాకిపోతోంది. ఫ్యాషన్‌ అండ్‌ ట్రెండ్స్‌ని అటువైపు కూడా ఫాలో అయ్యేవాళ్లు ఎక్కువే. ఫ్యాషన్‌ కల్చర్‌ పెట్రేగుతున్న ఈ గ్లోబలైజేషన్‌ వరల్డ్‌లో ఏదైనా సాధ్యమే. కాబట్టి తెలుగులో మునుముందు స్థానిక నాయికలు పెరిగే ఛాన్సుంది.



Tags:    

Similar News