‘కాటమరాయుడు’ నిలవలేడని ఫిక్సయ్యారా?

Update: 2017-03-25 07:30 GMT
‘సర్దార్ గబ్బర్ సింగ్’ డిజాస్టర్ అయినా.. ఆ ప్రభావం ఏమీ ‘కాటమరాయుడు’పై పడలేదు. ఇది రీమక్ అయినా సరే.. సినిమాకు కావాల్సినంత హైప్ వచ్చింది. సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. తొలి రోజు ఓపెనింగ్స్ కూడా మోతెక్కిపోయాయి. కానీ టాక్ మాత్రం ఏమంత గొప్పగా లేదు. సినిమా వీకెండ్ తర్వాత ఏమాత్రం నిలుస్తుందో అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే వారానికి ‘గురు’.. ‘రోగ్’ సినిమాలు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేసుకున్నాయి. ‘కాటమరాయుడు’ రిలీజై టాక్ బయటికి వచ్చిన కొన్ని గంటలకే వీటి మేకర్స్ నుంచి రిలీజ్ డేట్ ప్రకటన రావడం విశేషం. అంటే పవన్ సినిమా వారానికి మించి నిలిచే అవకాశం లేదని ఫిక్సయిపోయినట్లున్నారు.

నిజానికి ‘గురు’ సినిమాను ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలనుకున్నారు. ఐతే తర్వాత వారం ముందుకు తెచ్చే ఆలోచన మొదలైంది. కానీ ‘కాటమరాయుడు’ రిజల్ట్ ఏంటో తెలియకుండా డేట్ ప్రకటించకూడదని వెయిట్ చేశారు. ఐతే సినిమాకు వచ్చిన టాక్ చూశాక.. వీకెండ్ తర్వాత సినిమా జోరు తగ్గిపోతుందని ధీమా వచ్చేసినట్లుంది. మరోవైపు పవన్ సినిమాకు మంచి టాక్ వస్తే 31న అనుకున్న ‘రోగ్’ సినిమాకు వాయిదా వేసుకుందామని అనుకున్నాడు నిర్మాత సి.ఆర్.మనోహర్. ఐతే ఆయనకు కూడా ‘కాటమరాయుడు’ను చూసి అంత భయపడాల్సిన పని లేదని అర్థమైనట్లుంది. సోమవారం ‘కాటమరాయుడు’ కలెక్షన్లు ఎలా ఉంటాయన్నదాన్ని బట్టి వీళ్ల నిర్ణయం కరెక్టో కాదో తేలుతుంది. ఒకవేళ ‘కాటమరాయుడు’ రెండో వారంలో కూడా ప్రభావం చూపించినప్పటికీ.. పరీక్షలన్నీ అయిపోయి స్టూడెంట్స్ సినిమాల వైపు మళ్లుతారు కాబట్టి ఇబ్బందేమీ ఉండదని ‘గురు’.. ‘రోగ్’ సినిమాల రూపకర్తల విశ్వాసం కావచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News