ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్ల తర్వాత 'వకీల్ సాబ్'తో ఆదరణ దక్కించుకున్నాడు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పవర్ స్టార్ ఫ్యాన్స్ కు ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. పవన్ ని దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రెసెంట్ చేసిన విధానానికి అభిమానులు ఫిదా అయ్యారు. నిజానికి పవన్ 'పింక్' రీమేక్ తో రీ ఎంట్రీ ఇస్తున్నందుకు.. దీనికి స్టార్ డైరెక్టర్ ని కాకుండా వేణు శ్రీరామ్ ని ఎంచుకున్నందుకు అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే నేడు థియేటర్స్ లో 'వకీల్ సాబ్' చూసిన తర్వాత వేణు శ్రీరామ్ ని పీకే ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తమ అభిమాన హీరోని ఈ రేంజ్ లో చూపించిన దర్శకుడిని పవన్ అభిమానులు థియేటర్ లో ఊపిరి సలపనివ్వకుండా చేశారని తెలుస్తోంది.
'వకీల్ సాబ్' చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీతో కలిసి ఈరోజు ఉదయం కూకట్ పల్లి శివపార్వతి థియేటర్ లో వీక్షించాడు వేణు శ్రీరామ్. అదే థియేటర్ లో దర్శకనిర్మాతలు ఉన్నారని గుర్తించిన ఫ్యాన్స్.. ఇంటర్వల్ సమయంలో డైరెక్టర్ ని చుట్టుముట్టి వేణు శ్రీరామ్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మా అభిమానుల ఆకలి తీర్చావు.. నీకు గుడి కట్టిస్తాం అంటూ, సెల్ఫీలతో ఆయన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇప్పుడు సెకండాఫ్ చూడండి.. తర్వాత ఆఫీసుకు రండి అందరం సెల్ఫీలు దిగుదాం అని వేణు చెప్తున్నా అభిమానులు వినలేదు. చివరకు అతని టీమ్ వచ్చి వాళ్లను అదుపు చేశారు. దీనిని బట్టి చూస్తేనే అర్థం అవుతుంది వేణు శ్రీరామ్ ఈ సినిమాతో ఎంతటి క్రేజ్ దక్కించుకున్నాడు అనేది. ఏదైతేనేం ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న డైరెక్టర్ వేణు శ్రీరామ్ మూడో సినిమాతో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారిపోయాడని చెప్పొచ్చు.