టీఎఫ్ పీసీ ఇలా.. ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అలా..!

Update: 2022-07-26 15:16 GMT
గ‌త కొంత కాలంగా వివిధ అంశాల‌పై త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్న తెలుగు సినీ నిర్మాత‌ల మండ‌లి మంగ‌ళ‌వారం అత్య‌వ‌రంగా భేటీ అయి కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇక నుంచి థియేట‌ర్ల‌లో విడుద‌లైన బారీ సినిమాలు ప‌ది వారాల త‌రువాతే ఓటీటీకి ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ప్ర‌స్తుతం చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నెల‌కొన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ లు నిలిపివేయాల‌ని నిర్మాత‌ల మండ‌లి నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మంగ‌ళ‌వారం తెలుగు ఫిల్మ్‌ ఛాంబ‌ర్ లో నిర్మాత‌లు, డిస్ట్రిబ్యూట‌ర్లు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యారు.

తుది నిర్ణ‌యాన్ని నిర్మాత‌ల మండ‌లికే వందిలేశారు. అయితే అనూహ్యంగా కీల‌క నిర్ణ‌యాల‌ని నిర్మాత‌ల మండ‌లి ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల జ‌రిగిన కార్య‌వ‌ర్గ స‌మావేశంలో తీసుకున్న 8 కీల‌క అంశాల‌పై తాజాగా నిర్మాత‌లు కీల‌క నిర్ణ‌యాల‌ని ప్ర‌క‌టించారు. అంశాల వారిగా అ వివ‌రాలు ఇలా వున్నాయి. 1) ఓటీటీ : భారీ బ‌డ్జెట్ సినిమాలను 10 వారాల త‌రువాతే ఓటీటీకి ఇవ్వాలి. ప‌రిమిత బ‌డ్జెట్ లో నిర్మించిన చిత్రాల‌ను 4 వారాల త‌రువాతే ఓటీటీకి ఇవ్వాలని నిర్ణ‌యించారు. ఇక రూ. 6 కోట్ల లోపు బ‌డ్జెట్ చిత్రాల‌పై ఫెడ‌రేష‌న్ తో చ‌ర్చించాకే తుది నిర్ణ‌యం తీసుకోవాలి. 2) వీపీఎఫ్ : సినిమా ప్ర‌ద‌ర్శ‌నకు వీపీఎఫ్ (వ‌ర్చువ‌ల్ ప్రింట్ ఫీజు) ఛార్జీలు ఎగ్జిబిట‌ర్లే చెల్లించాలి.

3) సినిమా టికెట్ ధ‌ర‌లు : సినిమా టికెట్ ధ‌ర‌ల‌ను సామాన్యుల‌కు అందుబాటులో వుంచాల‌ని తెలంగాణ ఫిల్మ్ ఛాంబ‌ర్ ప్ర‌తిపాదించింది. న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల్లో సాధార‌ణ థియేట‌ర్లు, సి - క్లాస్ సెంట‌ర్ల‌లో టికెట్ ధ‌ర‌లు రూ. 100, రూ. 70 (జీఎస్టీతో క‌లిపి)గా ఉండాల‌ని ప్ర‌తిపాదించారు. ఇక మ‌ల్టీప్లెక్స్ లో జీఎస్టీతో క‌లిసి రూ. 125 ఉండేలా ప్ర‌తిపాద‌న‌లు చేశారు. మీడియం బ‌డ్జెట్, మీడియం హీరో సినిమాల‌కు టికెట్ ధ‌ర న‌ట‌రాల్లో, ప‌ట్ట‌ణాల్లో రూ. 100 ప్ల‌స్ జీఎస్టీ వుండాల‌ని, అదే సీ - సెంట‌ర్ల‌లో రూ. 100 (జీఎస్టీతో క‌లిపి) ఉండాల‌ని, మ‌ల్టీప్లెక్స్ లో అత్య‌ధికంగా రూ. 150 ప్ల‌స్ జీఎస్టీతో మాత్ర‌మే వుండాల‌ని ప్ర‌తిపాదించారు.

4) నిర్మాణ వ్య‌యం : రోజు రోజుకీ నిర్మాణ వ్య‌యం పెరుగుతోంది. ప్ర‌తి నిర్మాత ఛాంబ‌ర్, కౌన్సిల్ నియ‌మ‌, నిబంధ‌న‌ల‌ను పాటించాలి. ఫిల్మ్ ఛాంబ‌ర్, నిర్మాత‌ల మండ‌లితో చ‌ర్చించాకే సినిమా నిర్మాణ వ్య‌యాలు పెంచుకోవాలి. 5) ప‌ని పరిస్థితులు /ధ‌ర‌లు :  నిర్మాత‌ల నిర్ణ‌యం, ఆలోచ‌న‌ల మేర‌కు ఛాంబ‌ర్‌, కౌన్సిల్ దీనిపై తుది నిర్ణయాన్ని తీసుకుంటుంది. 6) ఫైట‌ర్స్ యూనియ‌న్ / ఫెడ‌రేష‌న్ స‌మ‌స్య‌లు:  ఛాంబ‌ర్ కౌన్సిల్ లో మ‌రో సారి చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నార‌ట‌. 7) మేనేజ‌ర్ల పాత్ర :  నిర్మాత‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్న మేనేజ‌ర్లు, కో- ఆర్డినేట‌ర్ల వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దుచేయ‌బోతున్నార‌ట‌.

8) న‌టీన‌టులు, టెక్నీషియ‌న్ల స‌మ‌స్య‌లు :  ఖ‌చ్చిత‌మైన స‌మ‌య పాల‌న అమ‌లు చేయాలి. దీని వ‌ల్ల అద‌న‌పు రోజులు కాకుండా అనుకున్న స‌మ‌యానికే షూటింగ్ లు పూర్త‌వుతాయి. త‌మ సహాయకుల‌కు వ‌స‌తి, ఇత‌ర సౌక‌ర్యాలు కావాల‌ని న‌టులెవ‌రూ డిమాండ్ చేయ‌డానికి వీళ్లేదు. వాళ్ల పారితోషికం నుంచో స‌హాయ‌కుల‌కు చెల్లించుకోవాలి. వంటి కీల‌క 8 నిర్ణ‌యాల‌ని నిర్మాత‌ల మండ‌లి మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించింది. అయితే ఇవి ఎంత వ‌ర‌కు ఇంప్లిమెంట్ అవుతాయ‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.

తాము నిర్మించే సినిమాల‌ని బ‌ట్టి నిర్మాత‌ల ప్రాధ‌మ్యాలు మారిపోతుంటాయి. ఈ నేప‌థ్యంలో తాజా నిర్ణ‌యాల‌కు ఎంత మంది నిర్మాత‌లు క‌ట్టుబ‌డి వుంటార‌న్న‌ది వేచి చూడాల్సిందే అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి. ఇదిలా వుంటే యాక్టీవ్ ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ మంగ‌ళ‌వారం సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది. ఆగ‌స్టు 1 నుంచి సినిమా షూటింగ్ ల‌ని బంద్ చేస్తున్న‌ట్టుగా వెల్ల‌డించింది. పాండ‌మిక్ త‌రువాత నిర్మాణ వ్య‌యం తో పాటు అనేక స‌మ‌స్య‌ల‌ని ఎదుర్కొంటున్నామ‌ని, దీనికి స‌రైన ప‌రిస్కారం ల‌భించేంత వ‌ర‌కు ఆగ‌స్టు 1 నుంచి షూటింగ్ ల‌ని నిలిపివేయాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని గిల్డ్ ఓ ప్ర‌క‌ట‌నతో పేర్కొంది. గిల్డ్ ప్ర‌క‌ట‌న కార‌ణంగా చాలా వ‌ర‌కు పెద్ద సినిమాలు ఎఫెక్ట్ కానున్నాయి.

మెగాస్టార్ చిరంజీవితో బాబి రూపొందిస్తున్న `వాల్తేరు వీర‌య్య‌, మోహ‌న్ రాజా `గాడ్ ఫాద‌ర్‌`, మెహ‌ర్ ర‌మేష్ `భోళా శంక‌ర్` సినిమాలపై ఎఫెక్ట్ ప‌డ‌బోతోంది. ఈ మూడు సినిమాలు చిరంజీవి న‌టిస్తున్న‌వే కావ‌డం విశేషం. ఇక ఈ మూడు  సినిమాల‌తో పాటు పంద‌మూరి బాల‌కృష్ణ - గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా, ప‌వ‌న్ క‌ల్యాణ్ `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`, శంక‌ర్ - చ‌ర‌ణ్ ల RC15, వంశీ పైడిప‌ల్లి - విజ‌య్ మూవీ, విజ‌య్ దేవ‌ర‌కొండ - సమంత‌ల `ఖుషీ`, స‌మంత `య‌శోద‌`, అఖిల్ `ఏజెంట్‌` చిత్రాల షూటింగ్ లకు ఇబ్బంది క‌ల‌గ‌నుంది. తాజాగా నిర్మాత‌ల మండ‌లి, గిల్డ్ తీసుకున్న నిర్ణ‌యాల‌పై సెటైర్లు ప‌డుతున్నాయి. టీఎఫ్ పీసీ ఇలా.. ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ అలా..! అంటూ కామెంట్ లు చేస్తున్నారు.
Tags:    

Similar News