మూవీ రివ్యూ : తలైవి

Update: 2021-09-10 16:40 GMT
చిత్రం : 'తలైవి'

నటీనటులు: కంగనా రనౌత్-అరవింద్ స్వామి-సముద్రఖని-నాజర్-భాగ్యశ్రీ-మధుబాల-తంబిరామయ్య తదితరులు
సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్
ఛాయాగ్రహణం: విశాల్ విట్టల్
కథ: విజయేంద్ర ప్రసాద్
స్క్రీన్ ప్లే: విజయేంద్ర ప్రసాద్-ఎ.ఎల్.విజయ్
నిర్మాతలు: విష్ణువర్ధన్ ఇందూరి-శైలేష్ ఆర్.సింగ్
దర్శకత్వం: ఎ.ఎల్.విజయ్

దేశంలో కొన్నేళ్లుగా వివిధ భాషల్లో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఈ కాలంలో రాజకీయ.. క్రీడా దిగ్గజాల జీవిత కథలు చాలానే తెరపైకి వచ్చాయి. ఇప్పుడు ఆ కోవలో వచ్చిన మరో చిత్రం.. తలైవి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. దివంగత జయలలిత బయోపిక్ ఇది. వినాయక చవితి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

 చిన్నతనంలోనే తండ్రిని దూరం చేసుకుని.. తల్లి కష్టంతో పెరిగి పెద్దయి టీనేజీలోనే సినీ రంగ ప్రవేశం చేసిన జయలలిత (కంగనా రనౌత్).. తమిళ సినీ పరిశ్రమలో పెద్ద హీరోగా ఉన్న ఎంజీరామచంద్రన్ (అరవింద్ స్వామి)కి ఆకర్షితురాలవుతుంది. అప్పటికే వివాహితుడైన ఎంజీఆర్.. జయను ఇష్టపడతాడు. ఆమెకు ఆయన ఎనలేని ప్రాధాన్యం ఇవ్వడం చుట్టూ ఉన్న వాళ్లకు నచ్చదు. అయినా సరే.. అవేవీ పట్టించుకోకుండా ఇద్దరూ సన్నిహితంగా మెలుగుతుంటారు. ఐతే రాజకీయాల్లోకి అడుగు పెట్టాక అడుగు పెట్టాక మాత్రం జయను ఎంజీఆర్ దూరం పెట్టాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. రాజకీయాల వల్లే తనకు ఎంజీఆర్ దూరమయ్యాడన్న బాధతో ఉన్న జయ.. చివరికి అనుకోని పరిస్థితుల్లో ఆ రాజకీయాల్లోకే అడుగు పెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురైన అవాంతరాలేంటి.. వాటిని దాటుకుని ఎలా తమిళనాడు ముఖ్యమంత్రి అయిందన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

ఇంటర్నెట్లోకి వెళ్లి కాస్త ఫేమ్ ఉన్న ఏ వ్యక్తి పేరు కొట్టినా.. వాళ్ల జీవిత చరిత్ర అంతా స్క్రీన్ మీద ప్రత్యక్షం అయిపోతుంది. తెరవెనుక సంగతులతా సహా అన్నీ ఇంటర్నెట్లో దొరుకుతాయి. ఆ వ్యక్తులకు సంబంధించి ఫొటోలు, వీడియోలు, పుస్తకాలు.. ఇతరత్రా సమాచారం మొత్తం అందుబాటులోకి వస్తుంది. అందులోనూ సినీ రంగంలో తిరుగులేని స్థాయిని అందుకుని.. రాజకీయాల్లోనూ రాణించి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి గురించి జనాలకు తెలియని సంగతులు చూపించి వాళ్లను ఆశ్చర్యపరచాలనుకుంటే కష్టమే. ఉన్నదున్నట్లుగా ఆ వ్యక్తుల జీవితాల్లోని ముఖ్య ఉదంతాలను వరుస క్రమంలో చూపిస్తూ వెళ్తే పెద్దగా ఆసక్తి ఉండదు. అలా అని వాస్తవ సంఘటనలను మరీ ఎగ్జాజరేట్ చేసి చూపించినా ప్రేక్షకులకు అతిగా అనిపిస్తుంది. ఈ కోణంలో చూస్తే బయోపిక్స్ తీయడం కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. ఐతే కొంతమంది మాత్రమే నిజ జీవిత వ్యక్తుల కథల్ని తెరపై అందంగా.. ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయగలరు. తెలుగులో మహానటి సావిత్రి కథను అద్భుతంగా తెరపై ప్రెజెంట్ చేసిన నాగ్ అశ్విన్ అందులో ఒకడు. ఇప్పుడు ఎ.ఎల్.విజయ్ ఆ స్థాయిలో కాకపోయినా జయలలిత జీవితాన్ని ఉన్నంతలో ఆసక్తికరంగానే తెరపైకి తీసుకొచ్చాడు. జయలలిత సినీ.. రాజకీయ జీవితం..  ఆమె వ్యక్తిత్వం.. ఒకప్పటి తమిళ రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్లందరినీ ‘తలైవి’ మెప్పిస్తుంది.

జయలలిత జీవిత క్రమాన్ని చూపించడం కంటే ఆమె వ్యక్తిత్వం గురించి చెప్పే ప్రయత్నం చేయడం ‘తలైవి’ ప్రత్యేకత. జయలలిత జీవితాన్నే చూపించాలనుకుంటే.. ఆమె పుట్టిన దగ్గర్నుంచి మొదలుపెట్టి నాలుగేళ్ల కిందట మరణించే వరకు చూపించడానికి చాలా ఉంది. ఆ కథంతా తీసుకుంటే అదో చాట భారతం కావచ్చు. అలా కాకుండా కథకుడు విజయేంద్ర ప్రసాద్.. జయ జీవితంలో ఒక ముఖ్య ఘట్టాన్ని తీసుకుని దాని చుట్టూ కథ అల్లిన తీరు మెప్పిస్తుంది. ఎంజీఆర్ మరణాంతరం ఓవైపు పార్టీలో అసమ్మతి.. ఇంకోవైపు అసెంబ్లీలో అధికార పక్షం నుంచి తీవ్ర అవమానం ఎదుర్కొని.. ముఖ్యమంత్రిగానే తిరిగి అసెంబ్లీలో అడుగు పెడతానని సవాలు చేసే చోట కథను మొదలుపెట్టి.. అక్కడి నుంచి వెనక్కి వెళ్లి కథానాయికగా జయ ప్రస్థానం మొదలైన దగ్గర్నుంచి ఫ్లాష్ బ్యాక్ రూపంలో కథను పున:ప్రారంభించి తన సవాలును నెరవేరుస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించే వరకు జయలలిత జీవితాన్ని ‘తలైవి’లో చూపించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కష్టాలు పడి.. టీనేజీలోనే కథానాయికగా మారిన అమ్మాయి.. ఈ పురుషాధిక్య ప్రపంచంలో తనను చాలా చిన్నచూపు వాళ్లందరినీ దాటి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం వెనుక ఎంత మొండితనాన్ని.. దృఢ సంకల్పాన్ని.. ప్రదర్శించిందో ‘తలైవి’లో చూపించారు.

జయలలిత అంటే ఎంతటి ఫైర్ బ్రాండో.. ఎలాంటి మొండిఘటమో ఆమె రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత.. ముఖ్యంగా ముఖ్యమంత్రి అయ్యాక అందరికీ తెలిసింది. ఐతే ఆమె వ్యక్తిత్వం అలా మారడం వెనుక కథేంటో ‘తలైవి’ చూపిస్తుంది. బేసిగ్గానే కొంచెం పొగరున్న జయ.. తన విలక్షణ వ్యక్తిత్వంతో ఎంజీఆర్‌కు ఎలా చేరువైందో.. వారి మధ్య ఉన్నది ఎలాంటి బంధమో చెప్పేలా ప్రథమార్ధంలో ‘తలైవి’ కథ నడుస్తుంది. ఈ భాగమంతా ఎక్కువగా సినిమాలు.. తెర వెనుక ముచ్చట్లతో సాగుతుంది. ఐతే ఎక్కడా కూడా హడావుడి కనిపించకుండా.. అతిశయోక్తులు లేకుండా.. సిన్సియర్ గా కథను చెప్పే ప్రయత్నం చేయడం వల్ల ‘తలైవి’ నెమ్మదిగా నడుస్తున్న భావన కలుగుతుంది. విజయ్ క్లాస్ నరేషన్ కూడా అందుకో కారణం. ఈ కథన శైలికి అలవాటు పడితే ఆద్యంతం ‘తలైవి’ ఎంగేజ్ చేస్తుంది. అలా కాని పక్షంలో ఆరంభంలోనే దీంతో డిస్కనెక్ట్ అయిపోతారు. ఇదొక భారమైన సినిమాలా కనిపిస్తుంది. ఇంటర్వెల్ ముంగిటే రాజకీయాల వైపు నడిచే కథ.. ద్వితీయార్ధంలో పూర్తిగా దాని మీదే సాగుతుంది. ‘మహానటి’లో మాదిరి ఇక్కడ జయకు సంబంధించి నెగెటివ్ పాయింట్లను ఎక్కువగా హైలైట్ చేసే ప్రయత్నం జరగలేదు. అదే సమయంలో ‘యన్.టి.ఆర్’లో మాదిరి అతిశయోక్తులూ..  కప్పిపుచ్చేసిన పెద్ద ‘నిజాలు’ కూడా ఇందులో పెద్దగా కనిపించవు. జయ ముందు ఆమె పార్టీ నాయకులందరూ ఎందుకు వంగి వంగి దండాలు పెడతారో.. ఆమె వాళ్లను ఎందుకలా చూస్తుందో చూపించి ఈ కథను ముగించడం విశేషం. జయ ముఖ్యమంత్రి కావడంతో కథ ఆగిపోవడంతో ఆ కుర్చీ ఎక్కాక ఆమె చుట్టూ నెలకొన్న వివాదాలు.. అవినీతి ఆరోపణలు.. ఇతర విషయాల్లోకి వెళ్లాల్సిన అవసరమే లేకపోయింది. ఇదొక కన్వీనియెంట్ ఎండింగ్. ఐతే ప్రధానంగా జయ వ్యక్తిత్వాన్ని తెరపై చూపించడం తప్ప  రాజకీయ ప్రయోజనం ఆశించి తీసిన సినిమా కాకపోవడం వల్ల ఈ ముగింపును మన్నించొచ్చు. ముందే అన్నట్లు జయలలిత రాజకీయ ఎదుగుదల.. ఆమె వ్యక్తిత్వం పట్ల ఆసక్తి ఉన్న వాళ్లందరినీ ‘తలైవి’ ఆకట్టుకుంటుంది.

నటీనటులు:

జయలలిత పాత్రలో కంగనా రనౌత్ తన స్థాయికి తగ్గ నటననే కనబరిచింది. వ్యక్తిగతంగా జయలలిత లాగే కంగనా కూడా ఫైర్ బ్రాండ్ కావడం ఈ పాత్రకు ప్లస్ అయింది. వ్యక్తిత్వ పరంగా జయను చూస్తున్న భావన కలుగుతుంది. కాకపోతే జయలలిత తరహా లుక్స్ లేకపోవడం ఆమెకు మైనస్. ఐతే లుక్స్.. యాక్టింగ్.. స్క్రీన్ ప్రెజెన్స్.. ఇలా ఏ కోణంలో చూసినా సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ అంటే మాత్రం అరవింద్ స్వామినే. ఎంజీఆర్ పాత్రలో అతను జీవించేశాడంటే అతిశయోక్తి కాదు. తన ఆహార్యం ఎంజీఆర్ పాత్రకు బాగా కుదిరింది. అరవింద్ ను చూస్తున్నపుడు నిజంగా ఎంజీఆర్‌ ను చూస్తున్న భావన తమిళులకు కలిగితే ఆశ్చర్యమేమీ లేదు. సముద్రఖని ముఖ్యమైన పాత్రలో చాలా బాగా చేశాడు. కరుణానిధి పాత్రలో నాజర్ కూడా ఆకట్టుకున్నాడు. భాగ్యశ్రీ.. మధుబాల.. తంబి రామయ్య.. తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా ‘తలైవి’ ఉన్నత స్థాయిలో నిలుస్తుంది. జి.వి.ప్రకాష్ అద్భుతమైన నేపథ్య సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశాడని చెప్పొచ్చు. ఆద్యంతం ఆర్ఆర్ ప్రేక్షకులను సినిమాలో లీనం చేసేలా సాగింది. అతడి పాటలు కూడా బాగున్నాయి. విశాల్ విట్టల్ ఛాయాగ్రహణం కూడా టాప్ లెవెలే. దశాబ్దాల కిందటి వాతావరణాన్ని తెరపైకి తీసుకొచ్చి ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లడంలో కెమెరా పనితనం కీలక పాత్ర పోషించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా గొప్పగా ఉన్నాయి. ఏమాత్రం రాజీ లేకుండా సినిమా కోసం కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు నిర్మాతలు. కథకుడిగా విజయేంద్ర ప్రసాద్ తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. అందరికీ తెలిసిన వ్యక్తి జీవితాన్ని ఆసక్తికర రీతిలో స్క్రిప్టుగా మలిచారు. దర్శకుడు ఎ.ఎల్.విజయ్.. తన అభిరుచిని చాటుకున్నాడు. ఎక్కడా హంగామా లేకుండా.. అతిశయోక్తలు లేకుండా.. వాస్తవికంగా జయ జీవితాన్ని తెరపై ప్రెజెంట్ చేయడానికి చూశాడు. అతడి క్లాస్ నరేషన్ సినిమా స్థాయిని పెంచింది. ఐతే అతడి నరేషన్ స్టయిల్ మాస్ కు రుచించకపోవచ్చు.

చివరగా: తలైవి.. పవర్ ఫుల్ లేడీ పవర్ ఫుల్ బయోపిక్

రేటింగ్-2.75


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Tags:    

Similar News