తమన్.. దేవిశ్రీగా మారిన వేళ..

Update: 2015-10-11 11:30 GMT
ఆడియో ఫంక్షన్లలో సందడి చేయాలంటే దేవిశ్రీ ప్రసాద్ తర్వాతే ఎవరైనా. హుషారెత్తించే పాటలతో.. తన ఎనర్జిటిక్ డ్యాన్సులతో.. కిక్కిచ్చే మాటలతో ఆడియో ఫంక్షన్లలో అతడు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ విషయంలో ఇండియాలో ఇంకే మ్యూజిక్ డైరెక్టర్ కూడా దేవిశ్రీకి సాటి రాడు. ఏ విషయంలో అతడికి పోటీ ఇచ్చినా డ్యాన్సుల్లో మాత్రం అతడికి పోటీ ఉండదు. ఐతే తమన్ తొలిసారిగా దేవిశ్రీకి సవాలు విసిరాడు. తనదైన శైలిలో ఫన్నీ స్టెప్పులతో ‘షేర్’ ఆడియో వేదిక షేక్ అయిపోయాలా చేశాడు తమన్. ఈ బబ్లీ మ్యూజిక్ డైరెక్టరుతో స్టెప్పులేయించిన ఘనత దిల్ రాజుకే దక్కింది.

ముందుగా తమన్ మైకందుకుని సిగ్గుపడుతూ నాలుగు మాటలు మాట్లాడి వేదిక నుంచి దిగిపోతుండగా దిల్ రాజు వచ్చి.. అతడికి అడ్డు పడ్డాడు. ‘షేర్’ సినిమాలో ఓ పాటకు హీరోయిన్ తో కలిసి తమన్ డ్యాన్స్ చేస్తాడంటూ అతణ్ని ఇరికించేశాడు. నా వల్ల కాదు మొర్రో అని అతను దండం పెడుతున్నా ఒప్పుకోలేదు. చివరికి ‘షేర్’ సినిమాలో ఓ పాటను ప్లే చేయడం.. హీరోయిన్ సోనాల్ చౌహాన్ తో కలిసి తమన్ ఫన్నీ స్టెప్పులు స్టెప్పులతో వేదికను  దడదడలాడించడం జరిగిపోయాయి. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. తమన్ డ్యాన్స్ బాగానే చేశాడు. భారీకాయుడు కదా.. స్పీడు లేదు కానీ.. రిథమ్ మాత్రం ఉంది అతడి డ్యాన్సుల్లో. స్టెప్పులు ముగిస్తూ మరోసారి దిల్ రాజుకు దండం పెట్టిన తమన్.. ‘‘నన్ను దేవిశ్రీ ప్రసాద్ అనుకున్నట్లున్నాడు’’ అంటూ నవ్వేసి వెళ్లిపోయాడు. పాటలు కంపోజ్ చేస్తున్నపుడు తమన్ డ్యాన్ష్ చేయడం తాను చూశానని.. అందుకే అతడితో డ్యాన్స్ చేయించానని దిల్ రాజు చెప్పాడు.
Tags:    

Similar News