సంగీతమే ఆయన సామ్రాజ్యం: తమన్ బర్త్ డే స్పెషల్

Update: 2021-11-16 08:56 GMT
విజయం సాధించిన ప్రతి ఒక్కరి వెనుక ఒక చరిత్ర ఉంటుంది. ఆశయం దిశగా అంకితభావంతో చేసిన ప్రయాణం .. అవాంతరాలను  అధిగమిస్తూ ముందుకు సాగడం కోసం చేసిన పోరాటం స్పష్టంగా కనిపిస్తాయి. కష్టాల మాటునే సుఖాలు ఉన్నట్టుగా, అవమానాల చాటునే అభినందనలు దాగుంటాయి. జీవితమనేది ఒక పరుగు పందెం వంటిదే. అలుపు వచ్చింది గదా అని ఆగిపోతే తరువాత వారు గెలుస్తారు. అందుకనే ఆగకుండా పరిగెడుతూనే ఉండాలి. అలాంటివారే విజయాలను సాధించగలుగుతారు .. విజేతలుగా నిలవగలుగుతారు.

 అలాంటివారి జాబితాలో సంగీత దర్శకుడు తమన్ కూడా కనిపిస్తాడు. ఆయన పూర్తి పేరు ఘంటసాల సాయి శ్రీనివాస్ తమన్. అక్కినేని నాగేశ్వరరావుని చిత్రపరిశ్రమకి పరిచయం చేసిన ఘంటసాల బలరామయ్య మనవడే తమన్. నెల్లూరులో పుట్టిన ఆయన పెరిగిందంతా మద్రాసులోనే. ఆయన తండ్రి అశోక్ కుమార్ .. సంగీత దర్శకుడు చక్రవర్తి దగ్గర డ్రమ్స్ వాయించేవారు. తమన్ తల్లి సావిత్రి మంచి గాయకురాలు. అలా తమన్ సినిమా నేపథ్యం నుంచి .. సంగీతం నేపథ్యం నుంచి వచ్చినవాడే. చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి రికార్డింగ్ థియేటర్ల చుట్టూ తిరగడం వలన, సహజంగానే తమన్ కి సినిమా సంగీతం పట్ల ఆసక్తి పెరిగింది.

తమన్ ఆసక్తిని గమనించిన ఆయన తండ్రి .. ఒకసారి విదేశాలకి వెళ్లినప్పుడు తమన్ కి డ్రమ్స్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి వాటితోనే ఆయన ఎక్కువ కాలం గడిపేవాడు. చిన్న చిన్న ఫంక్షన్స్ లో స్టేజ్ పై డ్రమ్స్ వాయించేవాడు. అయితే  దురదృష్టవశాత్తు తమన్ చిన్నతనంలోనే ఆయన తండ్రి చనిపోయాడు. అప్పటి పరిస్థితుల్లో తమన్ సినిమాలకి డ్రమ్స్ వాయించవలసి వచ్చింది. రాజ్ కోటి .. మాధవపెద్ది సురేశ్ ఆర్కెస్ట్రా లో ఆయన పనిచేశాడు. తొలిసారిగా తమన్ తన 13వ ఏట 'భైరవద్వీపం' సినిమాకి డ్రమ్స్ వాయించాడు. అందుకు ఆయన అందుకున్న పారితోషికం 30 రూపాయలు.

తమిళ .. కన్నడ.. ఒరియా .. మరాఠీ సినిమాలకి సంబంధించిన ఆర్కెస్ట్రాలలో కూడా ఆయన పనిచేశాడు.  అలా ఎంతోమంది సంగీత దర్శకుల దగ్గర పనిచేసిన ఆయన అపారమైన అనుభవాన్ని గడించాడు. డ్రమ్మర్ గా 30 రూపాయల పారితోషికం నుంచి అత్యధిక పారితోషికం అందుకునే డ్రమ్మర్ గా పేరు తెచ్చుతున్నాడు. తన 24వ ఏట ఒక తమిళ సినిమాతో సంగీత దర్శకుడిగా ఆయన ప్రయాణం మొదలైంది. తెలుగులో 'కిక్' సినిమాతో ఆయన తన దూకుడు మొదలు పెట్టాడు. అప్పటి నుంచి ఆయన తన విజయపరంపరను కొనసాగిస్తూనే వస్తున్నాడు.  

తమన్ తన కెరియర్ ను మొదలు పెట్టిన దగ్గర నుంచి కాలంతో పాటు పరిగెడుతూనే ఉన్నాడు. సంగీతమే ఆయన లోకం .. సంగీతమే ఆయన సర్వం. ఇంతవరకూ ఆయన 7000 స్టేజ్ షోలు ఇవ్వడం విశేషం. చాలా తక్కువ సమయంలో 100 సినిమాలను పూర్తి చేసిన ఘనుడాయన. సంగీతాన్ని ఒక తపస్సుగా భావించిన తమన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తూ, మరిన్ని మ్యూజికల్ హిట్స్ ఆయన నుంచి రావాలని ఆశిద్దాం.
Tags:    

Similar News