బాలీవుడ్ తో మనకి సరిపడదబ్బా!

Update: 2021-12-29 16:30 GMT
ఇప్పుడు ఎక్కడ చూసినా తమన్ పేరు మారుమ్రోగుతోంది. ఆయన బీట్స్ యూత్ కి విపరీతంగా నచ్చేస్తున్నాయి. ఇక స్టార్ హీరోలంతా తమ సినిమాలకి తమన్ చేయాలంటూ పట్టుపడుతున్నారు. రీసెంట్ గా వచ్చిన 'అఖండ' సినిమా కూడా ఆయనకి మంచి పేరు తీసుకొచ్చింది. త్వరలో రానున్న 'భీమ్లా నాయక్' కూడా తన స్థాయిని మరింత పెంచుతుందనే నమ్మకంతో ఆయన ఉన్నాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు.

తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మధ్యలో ఒకసారి ఆయన బాలీవుడ్ కూడా వెళ్లి వచ్చాడు. ఓ మూడు సినిమాలకి ఆయన అక్కడ పనిచేశాడు. ఆ తరువాత మాత్రం తమన్ టాలీవుడ్ సినిమాలపైనే ఎక్కువ దృష్టిపెట్టాడు. మళ్లీ బాలీవుడ్ సినిమాల జోలికి వెళ్లకపోవడానికి కారణం ఏంటనే ప్రశ్న అలీ నుంచి ఆయనకి ఎదురైంది. అందుకు తమన్ స్పందిస్తూ .. "బాలీవుడ్ వారు మ్యూజిక్ ని చూసే తీరు నాకు నచ్చలేదు. 'ఒక పాట చేయండి .. ఒక రీల్ ఆర్ ఆర్ చేయండి .. ఒక పాట చేస్తే చాలు' అంటుంటారు. అలా వర్క్ చేయడం నా వలన కావడం లేదు.

అలా గనుక చేస్తే పెళ్లి ఒకరితో .. ఫస్టు నైట్ ఇంకొకరితో అన్నట్టుగా అయిపోతుంది. ఒక సినిమాకి ఆరుగురు ఎలా మ్యూజిక్ చేస్తున్నారనేది నాకు అర్థం కాలేదు. సినిమా అనేది ఒక కథ .. ఒక డైరెక్టర్ ఫీలింగ్. ఒక డైరెక్టర్ ఒక కథను మనసులో అనుకుని .. క్యారెక్టర్స్ రాసుకుంటాడు. ఆయన భావాలను అర్థం చేసుకుని .. ఫస్టు రీల్ లో ఏ వేయాలి .. లాస్ట్ రీల్ లో ఏం వేయాలి అనేది సెట్ చేసుకుంటాను. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేసే విషయంలోనూ ఒకదానికి ఒకదానికి మధ్య కనెక్షన్స్ ఉంటాయి. ఇది ఒకరికి తెలియకుండా ఒకరు బాలీవుడ్ లో ఎలా చేస్తారనేది ఆశ్చర్యం.

ఏ సినిమాకి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అనేది తెలియదు. అక్కడి వాతావరణం చూసిన తరువాత ఇది మనకి కరెక్ట్ కాదనే విషయం అర్థమైపోయింది. అక్కడ పనిచేస్తే ఆరుగురిలో ఒకరిగా ఉండవలసి వస్తుంది. అందువల్లనే అక్కడి నుంచి వచ్చేశాను. త్రివిక్రమ్ గారు .. బోయపాటి గారు .. శంకర్ గారు .. ఇలా మన దర్శకులతో వెళ్లి హిందీ సినిమా చేయాలనుంది. ఒక సినిమాకి ఒకే సంగీత దర్శకుడు పనిచేస్తే ఎంతో గొప్పగా ఉంటుందనేది నా ఫీలింగ్. అందుకు పూర్తి భిన్నంగా అక్కడి పరిస్థితులు కనిపించాయి. అందువల్లనే ఇక అటువైపు వెళ్లలేదు" అని చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News