తనను చంపేసిన యూట్యూబ్ చానల్ మీద కేసు.. సీనియర్ నటుడి ఆగ్రహం

Update: 2022-08-31 05:20 GMT
మొన్నటివరకు మీడియా హడావుడి.. దాని ప్రభావం మాత్రమే ప్రజల మీద ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నంగా సోషల్ మీడియా.. యూట్యూబ్ చానళ్ల హడావుడి భారీగా ఉంటోంది. ఫలానా అర్హత అన్నదేమీ లేకుండా.. అనుకున్నంతనే యూట్యూబ్ చానల్ ను ప్రారంభించే వీలున్న నేపథ్యంలో..

కోట్లాది యూట్యూబ్ చానళ్లు పురుడుపోసుకోవటం తెలిసిందే. చూస్తుండగానే వీటి ప్రాధాన్యత పెరగటమే కాదు.. లక్షలాది మంది వీటిని చూడటం.. వీటి ద్వారా ఆదాయాన్ని గూగుల్ ఇస్తున్న కారణంగా.. యూట్యూబ్ చానళ్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

తాము పోస్టు చేసే కంటెంట్ ను మరింత సంచలనంగా మలిచేందుకు కొందరు చేస్తున్న అతి అనర్ధాలకు కారణమవుతోంది. ఏ మాత్రం వాస్తవం లేని అంశాల్ని వార్తల రూపంలో అందిస్తూ.. కొత్త గందరగోళానికి తెర తీస్తున్నారు. తాజాగా అలాంటిదే ఒకటి చోటు చేసుకుంది. సీనియర్ నటుడు.. ఒకప్పుడు హీరోగా ఒక వెలుగు వెలిగి..

అనూహ్యంగా కేసుల చిక్కుల్లో చిక్కుకొని జైల్లో కాలం గడిపి బయటకు వచ్చిన నటుడిగా సుపరిచితుడు సుమన్. ఆయన్ను ఇటీవల కాలంలో చనిపోయినట్లుగా కొన్ని యూట్యూబ్ చానళ్లు వార్తలు వండేస్తున్నాయి. తనను 'చంపేస్తున్న' యూట్యూబ్ చానళ్ల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు సుమన్.

ప్రస్తుతం షూటింగ్ లో భాగంగా బెంగళూరులో ఉన్న ఆయన.. తాను చనిపోయినట్లుగా వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని.. తాను క్షేమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఏ మాత్రం నిజం లేని వార్తల్ని ప్రసారం చేస్తున్న యూట్యూబ్ చానళ్లపై కఠినమైన చర్యల్ని తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.

తాను మరణించినట్లుగా యూట్యూబ్ చానళ్లు కొన్ని వార్తల్ని ప్రసారం చేయటం.. దీంతో కలత చెందిన అభిమానులు ఇందులో నిజం ఎంత? అంటూ పోస్టులు పెట్టారని సమన్ పేర్కొన్నారు. అనవసరంగా అభిమానుల్ని ఆందోళనకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. త్వరలో తాను యూట్యూబ్ చానళ్ల మీద కేసులు వేస్తానని ఆయన స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News