ప్లాప్స్ లో ఉన్నా బిజినెస్ బాగానే జరిగిందే..!?

Update: 2022-09-13 13:40 GMT
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "దసరా". ఇది నేచురల్ స్టార్ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. నాని ఈ సినిమా కోసం నాని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి.. ఇంతకుముందెన్నడూ చూడని రగ్గుడ్ అవతార్ లో కనిపించనున్నారు. అంతేకాదు తొలిసారిగా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు.

రూరల్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కుతున్న 'దసరా' సినిమాతో శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

'దసరా' థియేట్రికల్ మరియు నాన్-థియేటర్ బిజినెస్ దాదాపుగా క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. డిజిటల్ - శాటిలైట్ - ఆడియో వంటి నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి 50 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందని టాక్. అలానే ఓవర్ సీస్ మినహా మిగిలిన థియేటర్ హక్కులు 25 కోట్లకు పైగానే పలికినట్లు వార్తలు వస్తున్నాయి.

ఓవర్ సీస్ కూడా కలుపుకుంటే 'దసరా' సినిమా మొత్తం మీద 80 - 85 కోట్ల మేరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఇది కెరీర్ లోనే హయ్యెస్ట్ అని చెప్పాలి. అంతేకాదు గత కొంతకాలంగా నాని గ్రాఫ్ ను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ఇది ఎవరూ ఊహించని బిజినెస్ గా పేర్కొనాలి.

నాని గత కొన్నేళ్లుగా తన రేంజ్ కు తగ్గ సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. 'కృష్ణార్జున యుద్ధం' 'దేవదాస్' వంటి ప్లాప్స్ తర్వాత వచ్చిన 'జెర్సీ' సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్ గా నిలవలేదు. నాని 'గ్యాంగ్ లీడర్' కూడా తీవ్ర నిరాశ పరిచింది.

కరోనా పాండమిక్ టైంలో డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన 'వి' మరియు 'టక్ జగదీశ్' చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అంతేకాదు బ్యాక్ టూ బ్యాక్ రెండు సినిమాలు నేరుగా ఓటీటీ రిలీజ్ కు వెళ్ళడంతో.. నాని థియేటర్ మార్కెట్ పై దెబ్బ పడుతుందనే కామెంట్స్ వచ్చాయి.

ఇదే క్రమంలో వచ్చిన 'శ్యామ్ సింగరాయ్' మరియు 'అంటే సుందరానికీ' సినిమాలు హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సాధించలేకపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు నాని నటిస్తున్న 'దసరా' సినిమాకు అన్ని కోట్ల బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు.

అయితే ఇటీవల కాలంలో తెలుగు సినిమా మార్కెట్ పెరగడం మరియు స్పాన్ విస్తరిస్తుండటమే 'దసరా' మూవీ ఇంత ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడానికి కారణమనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడ జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ కూడా అదనంగా యాడ్ అయింది.

అందులోనూ ఈ సినిమా ప్రమోషన్ కంటెంట్ చూస్తే 'పుష్ప' మాదిరిగా రా అండ్ రస్టిక్ ఫీల్ ని కలిగించింది. ఇవన్నీ కూడా నాని మూవీ వ్యాపారానికి దోహదపడ్డాయని తెలుస్తోంది. కాకపోతే సినిమాకు ఖర్చు చేస్తున్న బడ్జెట్ లెక్కలు చూసుకుంటే.. నిర్మాతకు పెద్దగా లాభాలు మిగలకపోవచ్చనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

'దసరా' అనేది నాని కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తెరకెక్కుతున్న సినిమా. ఇప్పటి వరకూ సహజ నటుడి చిత్రాలకు 45 - 55 కోట్ల మధ్య ఖర్చు చేస్తుండగా.. చెరుకూరి సుధాకర్ ఈసారి ఏకంగా 65 - 70 కోట్ల మధ్య బడ్జెట్ అంచనాతో దిగాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దానికి తగ్గట్టుగా బిజినెస్ జరిగింది కానీ.. బాక్సాఫీస్ వసూళ్ళు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి.

కాగా, 'దసరా' చిత్రాన్ని పెద్దపల్లి జిల్లాలోని గోదావరరిఖని లోని సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నారు. ఇందులో సముద్రఖని - సాయి కుమార్ - జరీనా వహాబ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విజయ్‌ చాగంటి దీనికి ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నవీన్‌ నూలి ఎడిటర్‌ గా.. అవినాష్‌ కొల్లా ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వర్క్ చేస్తున్నారు. స్టంట్ డైరెక్టర్స్ అన్బరీవ్ యాక్షన్ పార్ట్ డిజైన్ చేశారు.

'దసరా' చిత్రాన్ని 2023 శ్రీరామ నవమి సందర్భంగా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. తెలుగుతో పాటుగా హిందీ' తమిళం, కన్నడ మరియు మలయాళ భాషలలో ఈ సినిమా విడుదల కానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News