ఫుట్ బాల్ క్రీడ‌కు భ‌ళ్లాలుని అండా దండా

Update: 2019-10-26 07:15 GMT
క్రీడ‌ల్ని ప్రోత్స‌హించ‌డంలో ద‌గ్గుబాటి రానా అంద‌రికంటే స్పీడ్ గా ఉంటాడు. టాలీవుడ్ స్టార్ హీరోల్లో అత‌డికి ఉన్న ఫ్యాష‌న్ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. ప్రోక‌బ‌డ్డీ పేరుతో అత‌డు క‌బ‌డ్డీ ఆట‌కు జాతీయ అంత‌ర్జాతీయ స్థాయిలో పాపులారిటీ తెచ్చేందుకు చేసిన ప్ర‌మోష‌న్ ని మ‌ర్చిపోలేం. ఇన్నాళ్లు గ‌ల్లీల‌కే ప‌రిమిత‌మైన ఈ ఆట‌కు ప్రోక‌బ‌డ్డీ గొప్ప గుర్తింపును.. గౌర‌వాన్ని తెచ్చింది. క్రీడల్లో రాణించాల‌న్న ఉత్సాహం యువ‌త‌రంలో తెచ్చింది ప్రోక‌బ‌డ్డీ ఆట‌.

ఇప్పుడు ఫుట్ బాల్ క్రీడ‌కు అత‌డు ప్ర‌చారం ప‌రంగా ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. తాజాగా హైద‌రాబాద్ ఫుట్ బాల్ క్ల‌బ్ అధినేత‌లు వ‌రుణ్ త్రిపుర‌నేని- విజ‌య్ మ‌ధురిల‌తో క‌లిసి రానా హైద‌రాబాద్ ఫుట్ బాల్ క్ల‌బ్- ఐ.ఎస్.ఎల్ టీమ్ ని ర‌న్ చేసేందుకు నిశ్చ‌యించుకున్నారు. ఆ మేర‌కు వారితో ఓ ఒప్పందం కుదరింది. రానా చేరిక‌తో ఇక ఫుట్ బాల్ క్రీడ‌కు తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత గుర్తింపు పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఐఎస్.ఎల్ టీమ్ కి హైద‌రాబాద్ తొలి ఫుట్ బాల్ టీమ్ గా గుర్తింపు ద‌క్కింది. ఇటీవ‌ల ప‌లు టోర్నీల్లో అద్భుతంగా రాణించి ఆక‌ట్టుకుంది ఈ టీమ్. ఇప్ప‌టికే చెన్నై .. గోవాలోని ప్రాథమిక శిబిరాల్లో ఈ జట్టు తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఏడు స్నేహపూర్వక మ్యాచ్ లలో హెచ్‌.ఎఫ్‌.సి అన్ని మ్యాచ్ ల‌లోనూ విజయాలు సాధించి అజేయంగా నిలిచింది. ఇక‌పై జ‌రిగే టోర్నీల్లోనూ రాణిస్తుంద‌న్న న‌మ్మ‌కం పెంచింది.  

హెచ్‌ఎఫ్‌సి సహ యజమాని గతంలో చెన్నైయ్ ఎఫ్‌సి.., కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సిలతో కలిసి పనిచేసిన త్రిపురనేనితో రానా దగ్గుబాటి క‌ల‌వ‌డం పట్ల హైద‌రాబాద్ జ‌ట్టు సంతోషం వ్యక్తం చేస్తోంది. రానా చేరిక‌తో మ‌రిన్ని విజ‌యాలు సాధ్య‌మ‌వుతాయ‌న్న ఆశాభావం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆట‌ను ప్రోత్స‌హించ‌డ‌మే అంతిమ‌ధ్యేయం. ఆ దిశ‌గా రానా వేస్తున్న అడుగులు ఆస‌క్తికరం. ఇప్ప‌టికే స్థానిక క్రీడ‌లుగా పేరున్న ఖోఖో వంటి క్రీడ‌ల‌కు రానా వంటి స్టార్లు ప్రాచుర్యం తేవాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. ఆ దిశ‌గానూ రానా అడుగులు వేస్తాడ‌నే ఆశిద్దాం.
Tags:    

Similar News