ప్రైమ్ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేసుకునేంత చెత్త‌గా!

Update: 2022-09-15 03:30 GMT
అమెజాన్ స్టూడియోస్ నిర్మించిన పాపుల‌ర్ సిరీస్ `లార్డ్ ఆఫ్ ద రింగ్స్: ద రింగ్స్ ఆఫ్ పవర్` దాదాపు ఒక బిలియన్ డాలర్ బడ్జెట్ తో తెర‌కెక్కి భారీ అంచ‌నాల న‌డుమ విడుద‌లైంది. ఈ షో సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతున్నా ఎందుక‌నో ఇది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతోంద‌ని విమ‌ర్శ‌లొస్తున్నాయి. అంతేకాదు.. ఈ సిరీస్ కోస‌మే సభ్య‌త్వం తీసుకున్న‌వారంతా తీవ్రంగా నిరాశ‌ప‌డ్డార‌ని టాక్ వినిపిస్తోంది. క్రిటిక్స్ మెచ్చినా కానీ జ‌నం మెచ్చ‌లేద‌న్న టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇక ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ఐఏమ్ డీబీ‌లో‌ను `ద రింగ్స్ ఆఫ్ పవర్` కు ప్రేక్షకులు 6.8మాత్రమే రేటింగ్ ఇచ్చారు.  హెచ్‌బీవో నిర్మించిన `హౌస్ ఆఫ్ ద డ్రాగన్` ఐఏమ్ డీబీలో  8.8  రేటింగ్ తో టాప్ ప్లేస్ లో నిలవ‌గా లార్డ్ ఆఫ్ ది రింగ్స్ చాలా వెన‌క‌బ‌డింది.

రింగ్స్ ఆఫ్ పవర్ కంటే `హౌస్ ఆఫ్ ద డ్రాగన్`ను 51శాతం మంది అధికంగా వీక్షించ‌డం ఆస‌క్తిక‌రం. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కొత్త షో విష‌యంలో జీరో రివ్యూల‌తో కొంద‌రు విరుచుకుప‌డ‌గా ఈ సిరీస్ వీరాభిమానులు ఇప్పుడు త‌మ ప్రైమ్ స‌భ్య‌త్వాల‌ను ర‌ద్దు చేసుకోవ‌డం సంచ‌ల‌న‌మైంది. అమెజాన్ ప్రైమ్‌కు 20కోట్ల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. కానీ ఇందులో త‌క్కువ శాతం మంది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ కొత్త సీజ‌న్ ని వీక్షించార‌ని తెలిసింది. ఈ షోని వీక్షించాలంటే ఏడాదికి అదనంగా 20డాలర్లు చెల్లించాల్సి ఉండటం కూడా పెద్ద మైన‌స్ గా మారింద‌ని టాక్.

లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఈ సిరీస్ మూడవ ఎపిసోడ్ సెప్టెంబర్ 9న భారతదేశంలో ప్రారంభమైంది. ఇప్పటికే ఎపిసోడ్ ని వీక్షించి తదుపరి ఏమి జరుగుతుందో అని ఎదురు చూసేంత థ్రిల్ ని ఈ షో ఇవ్వ‌లేద‌నేది విమ‌ర్శ‌. ఎపిసోడ్ 4 త్వరలో భారతదేశంలో విడుదల కానుంది. రింగ్స్ ఆఫ్ పవర్ ఎపిసోడ్ 4 శుక్రవారం నాడు అంటే సెప్టెంబర్ 16 న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది.

భారతదేశంలో ఎపిసోడ్ 4 సెప్టెంబర్ 16న ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రైమ్ కి నెలవారీ ప్లాన్ ధర రూ. 179 కాగా.. మీరు ఒక సంవత్సరం పాటు సేవకు సభ్యత్వం పొందేందుకు రూ.1499 చెల్లించాలి.  కొత్త సిరీస్ J. R. R. టోల్కీన్ రాసిన ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ దాని అనుబంధ క‌థ‌ల‌ ఆధారంగా రూపొందించారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ టోల్కీన్ `ది హాబిట్` మరియు ది లార్డ్ ఆఫ్ ది రింగ్ లకు శతాబ్దాల ముందు మధ్య-భూమి కి రెండవ యుగంలో న‌డిచే క‌థాంశంతో రూపొందించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Tags:    

Similar News