MAA వార్.. అంతా మ‌నోళ్లు అంటూనే ఏంటీ ర‌చ్చ‌?

Update: 2021-07-02 13:30 GMT
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌ల ర‌చ్చ ప‌రాకాష్ట‌కు చేరుకుంటోంది. అంతా మ‌న‌వాళ్లే అంటూనే ఎవ‌రికి వారు రాజ‌కీయాలు చేస్తున్నారు. ర‌చ్చ‌ర‌చ్చ‌కు తెర తీస్తున్నారు. ప్ర‌తిదీ మీడియా వేదిక‌గా అధికారికంగా క‌నిపిస్తున్నాయి. అయితే వీట‌న్నిటినీ అణ‌చి వేసేందుకు సినీపెద్ద‌ల‌కు ఎవ‌రి వ్యూహాలు వారికి ఉన్నా వారు కూడా బ‌య‌ట‌ప‌డ‌డం లేదు.

సెప్టెంబ‌ర్ లో మా ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉండగా ఇంత‌లోనే ప్ర‌కాష్ రాజ్ వ‌ర్సెస్ వీకే న‌రేష్ వార్ పీక్స్ కి చేరుకుంది. విష్ణు కొన్ని విమ‌ర్శ‌లు చేసి సైలెంట్ గా ఉన్నా కానీ.. న‌రేష్ మాత్రం త‌న‌దైన శైలిలో చెల‌రేగుతున్నారు.

ముఖ్యంగా ఆయ‌న నాగ‌బాబుపై చాలా సీరియ‌స్ గా ఉన్నార‌ని తాజా వ్యాఖ్య‌లు చెబుతున్నాయి. నాలుగేళ్లుగా మా ప్ర‌తిష్ఠ మ‌స‌క‌బారింద‌ని నాగ‌బాబు అన‌డం చూస్తుంటే తెర‌వెన‌క త‌నను బ్యాడ్ చేస్తున్నార‌ని న‌రేష్ భావిస్తున్న‌ట్టు తెలిసింది. ఆయ‌న దీనిపై బాహాటంగానే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. మాలో క‌ల‌త‌లు పెట్టాల‌నుకుంటున్న ఆ బిగ్ బాస్ ఎవ‌రు? అంటూ నిల‌దీసారు కూడా.

తాను మా అసోసియేష‌న్ కోసం ఎంతో సేవ చేసాన‌ని 14ల‌క్ష‌లు త‌న‌ సొంత డ‌బ్బును అసోసియేష‌న్ కి ఇచ్చాన‌ని న‌రేష్ చెబుతున్నారు. చిరంజీవి అంత‌టివారే త‌న‌ని ప్ర‌శంసించార‌ని స‌మ‌ర్థించుకున్నారు. ఒక హిడెన్ ఎజెండాతో మాను దెబ్బ తీస్తున్నార‌ని .. త‌న‌ను ఉద్ధేశ‌పూర్వ‌కంగానే నెగెటివ్ చేసే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ఈ ఇంట‌ర్వ్యూ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఇక‌పోతే వీకే న‌రేష్ ఆరోపిస్తున్న‌ట్టు `మా`ను దెబ్బ‌కొడుతున్న ఆ బిగ్ బాస్ ఎవ‌రో తేలాల్సి ఉంది. ఇక‌పోతే ఆర్టిస్టుల సంఘంలో ఇలాంటి గొడ‌వ‌లు జ‌ర‌గ‌డం ఎవ‌రికీ న‌చ్చ‌డం లేదు కాబ‌ట్టి అన్నిటికీ చెక్ పెట్టేందుకు ఎలాంటి ఎత్తుగ‌డ వేస్తున్నారు? అన్న‌ది సినీపెద్ద‌లే చెప్పాల్సి ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి- మోహ‌న్ బాబు- జ‌య‌సుధ వంటి ప్ర‌ముఖుల‌తో కూడుకున్న క‌మిటీ ఏం చేస్తుందో చూడాలి.

ఇక ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టికే బోలెడ‌న్ని స‌మస్య‌లు ఉండ‌గా కీల‌క‌మైన మా అసోసియేష‌న్ ఇలాంటి రాజ‌కీయాల‌కు తెర‌తీయ‌డం ఏవ‌గింపున‌కు కార‌ణ‌మ‌వుతోంది. కేవ‌లం 950 మంది ఉండే మా స‌భ్యుల కోసం ఇంత ర‌చ్చ అవ‌స‌ర‌మా? అని ప్ర‌శ్నిస్తున్న‌వారెంద‌రో. కానీ అవేవీ ప‌ద‌వి కావాల‌ని ఆశిస్తున్న వారికి క‌నిపించ‌డం లేదు. ఈసారి ఎన్నిక‌ల్లో గెలిచి అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టాల‌ని ఏకంగా ఆరుగురు స‌భ్యులు ఆశ‌ప‌డుతున్నారు. దీంతో ర‌చ్చ మ‌రింత‌గా పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు.

అస‌లు ప‌రిశ్ర‌మ స‌మ‌స్య‌లు వీళ్ల‌కు ప‌ట్టేదెలా? మూవీ ఆర్టిస్టుల సంఘం సొంత బిల్డింగ్ స‌హా ఇండ‌స్ట్రీకి కీల‌క‌మైన థియేట‌ర్ల స‌మ‌స్య ప‌రిష్కారం.. చిన్న సినిమాల రిలీజ్ ల‌కు ప్ర‌భుత్వ ఓటీటీ ఏర్పాటు ఇలాంటి విష‌యాల‌పై ముఖ్య‌మంత్రుల ప‌రిధిలో పెద్ద‌లు మంత‌నాలు సాగిస్తే బావుంటుంద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కోరుతున్నాయి.
Tags:    

Similar News