స‌వ‌ర‌ణ బిల్లు ముప్పేమిటో మ‌నోళ్ల‌కు అర్థం కాలేదా?

Update: 2021-07-06 12:30 GMT
ప్రాంతీయ సినిమా సృజ‌నాత్మ‌క‌త‌ను తొక్కేయ‌డానికి లేదా స్వేచ్ఛ‌కు క‌ళ్లెం వేసేందుకు కేంద్రానికి ప‌గ్గాలు ఇచ్చేస్తే ఆపై ఏం జ‌రుగుతుందో ఊహించేదే.. ఆటోమెటిగ్గా సెన్సార్ షిప్ విలువ ప‌డిపోతుంది. సెన్సార్ బృందాన్ని ప‌ట్టించుకోవాల్సిన  అవ‌స‌ర‌మే లేదు. ఇన్నాళ్లు సెన్సార్ ప‌రిధిలో చిన్నా చిత‌కా స‌మ‌స్య‌లు ఉన్నా కానీ ప‌రిష్కారం అయ్యేవి. కానీ ఇప్పుడు సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ బిల్లుతో ఇక ఏదీ ప్రాంతీయంగా చేతిలో ఉండ‌దు. అంతా కేంద్రం చూసుకుంటుంది.

అక్కడివ‌ర‌కూ వెళ్లి మ‌న సినిమాల‌న్నీ ఫైన‌ల్ గా సెన్సార్ చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే కేంద్రం పెత్త‌నం రాజ‌కీయాలు కూడా ఇందులో ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్న‌మాట‌. అయితే ఈ నిజం తెలిసీ మ‌నోళ్లు(స్టార్లు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సినీపెద్ద‌లు) సైలెంట్ గా ఊరుకున్నారా? ఎందుక‌ని సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట‌స‌వ‌ర‌ణ బిల్లును వ్య‌తిరేకించ‌డం లేదూ? అంటూ తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

అమీర్ ఖాన్- క‌మ‌ల్ హాస‌న్- సూర్య‌- విశాల్ వంటి స్టార్ల‌కు ఉన్న అవ‌గాహ‌న ఇత‌ర సౌత్ స్టార్ల‌కు టాలీవుడ్ స్టార్ల‌కు లేదంటారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. తెలుగు సినీప‌రిశ్ర‌మ నుంచి సుధీర్ బాబు ఒక్క‌రే విమ‌ర్శించారు. కానీ ఇత‌రులు ఎవ‌రూ ట‌చ్ కూడా చేయ‌లేదు ఆ టాపిక్. రాజ‌కీయాలతో ముడిప‌డిన అంశం కాబ‌ట్టి అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక‌పోతే మ‌న స్టార్లు వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాల్లో న‌టిస్తున్నారు కాబ‌ట్టి రాజ‌కీయంగా త‌మ చిత్రాల రిలీజ్ లు సాఫీగా సాగాలంటే కేంద్రానికి వ‌త్తాసు ప‌ల‌కాల‌ని అనుకుంటున్నారా? అన్న‌ది అర్థం కాని గంద‌ర‌గోళంగా మారింది.

భ‌విష్య‌త్ లో సృజ‌నాత్మ‌క‌త‌కు పెను విఘాతం క‌ల‌గ‌నుంది. ప్ర‌మాదం పొంచి ఉంది. అన్నీ తెలిసీ పిల్లి పాలు తాగుతూ త‌న‌ని ఎవ‌రూ చూడ‌లేదు అనుకున్న చందంగా ఎవ‌రికి వారు సైలెంట్ గా ఉన్నారు. ఇది ఖండించ‌త‌గిన నేరం అని కూడా విశ్లేషిస్తున్నారు.

సినిమా ఇండ‌స్ట్రీపై దాడుల్ని ఎవ‌రూ స‌హించ‌కూడ‌దు. కానీ మౌనంగానే భ‌రిస్తున్నారు. ఇంత‌కుముందు సెన్సార్ నిబంధ‌న‌లు క‌ఠిన‌త‌రం అయిన‌ప్పుడు కూడా ఎవ‌రూ పెద‌వి విప్ప‌లేదు. అది చాలా స‌మ‌స్య‌ల్ని సృష్టించింది.  ఇప్పుడు సినిమాటోగ్ర‌ఫీ చ‌ట్ట స‌వ‌ర‌ణ బిల్లుకు వ్య‌తిరేకంగా 1400 మంది వినోద రంగం నుంచి సంత‌కాలు చేశార‌ట‌. అందులో మ‌న‌వాళ్లు ఉన్నారో లేరో కూడా తెలీదు. అయినా సంత‌కాలు చేసినా ఏం ప్ర‌యోజ‌నం.. తీవ్రంగా వ్య‌తిరేకించాల్సిన సంద‌ర్భంలో సైలెన్స్ దేనికి? అన్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్వేచ్ఛ‌కు సంకెళ్లు వేసే ప్ర‌భుత్వ నిర్ణ‌యాల‌ను క‌లిసిక‌ట్టుగా వ్య‌తిరేకించ‌క‌పోతే ఒకే వేదిక‌పైకి వ‌చ్చి నిర‌స‌న‌గ‌ళం వినిపించ‌క‌పోతే అది చాలా ప్ర‌మాద‌క‌రంగా మారుతుంద‌న్నది నిజం.

ఇక‌పోతే తెలుగు సినిమా రంగం ర‌క‌ర‌కాల స‌మ‌స్య‌ల్లో చిక్కుకుని విల‌విల‌లాడుతోంది. ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్టుల సంఘం(మా) ఎన్నిక‌లు వ‌ర్గ విభేధాలు.. స‌హా ఏపీలో టిక్కెట్టు రేట్ల అంశం.. థియేట‌ర్ రంగం స‌మ‌స్య‌లు.. ముఖ్య‌మంత్రుల ప‌రిధిలో చ‌ర్చ‌లు అంటూ ర‌క‌ర‌కాలుగా ఇష్యూస్ బ‌య‌ట‌ప‌డ్డాయి. క్రైసిస్ వ‌ల్ల రిలీజ్ లు ఆగిపోవ‌డంతో అది స‌మస్యాత్మ‌కంగా మారింది. వీట‌న్నిటిపైనా చ‌ర్చ‌లు సాగిస్తున్న సినీపెద్ద‌లు సినిమాటోగ్ర‌ఫీ స‌వ‌ర‌ణ బిల్లుపై చ‌ర్చించారా లేదా? అన్న‌ది తెలియాల్సి ఉంది. తెలియ‌ని చాలా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలిసీ విక్ర‌మార్కా ఏదీ చెప్ప‌క‌పోయావో నీ బుర్ర వెయ్యి చెక్క‌ల‌గును!
Tags:    

Similar News