ఇది నిజంగా పెద్ద అవమానమే: బాలీవుడ్ యంగ్ హీరో

Update: 2022-04-27 00:30 GMT
ఎంతటివారికైనా ఏదో ఒక సందర్భంలో అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి. సెలబ్రిటీలు తమకి జరిగిన అవమానం గురించి వెంటనే సోషల్ మీడియాలో చెప్పేస్తూ ఉంటారు. ఎక్కడ ఏ సంఘటన జరిగింది? ఆ సంఘటన వలన తమకి ఎదురైన అవమానం గురించి వివరిస్తారు. తమని గుర్తుపట్టక పోయినా ఫరవాలేదు .. కనీసం తాము చెప్పేదైనా  వినిపించుకోకుండా అవమానించడం సరైనది కాదంటూ ఆవేదనను వ్యక్తం చేస్తుంటారు. బాలీవుడ్ నటుడు ప్రతీక్ గాంధీ  ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు.

ప్రతీక్ గాంధీ ఒక చిన్న నటుడిగానే తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే తనదైన ప్రత్యేకతను చాటుకున్నాడు. 'స్కామ్ 1992' అనే వెబ్ సిరీస్ ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి ఆయన క్రేజ్ పెరిగిపోయింది.  ఇప్పుడు ఆయన వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. సాధారణంగా సెలబ్రిటీలు తమకి ఎయిర్ పోర్టులో అవమానం జరిగిందని పెట్టే పోస్టులే మనకి ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాయి.

ఎయిర్ పోర్టు అధికారులు తమ పట్ల వ్యవహరించిన తీరును గురించిన అసహనాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అందుకు భిన్నంగా ముంబై పోలీసుల వలన తనకి అవమానం జరిగిందని ప్రతీక్ గాంధీ ఆవేదనను వ్యక్తం చేస్తున్నాడు.

ఇంతకీ అంతగా ఆయనకి జరిగిన అవమానం ఏంటి? అనే ప్రశ్నకు సమాధానాన్ని ఆయన మాటల్లోనే విందాం. "ఆదివారం సాయంత్రం ముంబై WEH హైవేపై ఎవరో వీఐపీ వస్తున్న కారణంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దాంతో నేను షూటింగు లొకేషన్ కి చేరుకోవడానికి గాను ఆ రోడ్డుపై నడుస్తూ వెళుతున్నాను.

అప్పుడు  పోలీసులు నన్ను అడ్డగించారు. నా  షోల్డర్ పట్టుకుని .. ఆ పక్కనే ఉన్న మార్బుల్స్ గోడౌన్ లోకి నన్ను తోసేశారు. నేను ఎవరు? అటుగా ఎందుకు వెళుతున్నాను? నా పని నాకు ఎంత ముఖ్యం?  అనే వివరణ  ఇచ్చుకునే సమయం కూడా ఇవ్వకుండా నా పట్ల వాళ్లు చాలా దురుసుగా ప్రవర్తించారు.

నేను ఏదో తప్పు చేసినట్టుగా వాళ్లు నా పట్ల వ్యవహరించడం నిజంగా నాకు చాలా అవమానంగా అనిపించింది" అంటూ రాసుకొచ్చాడు. దాంతో నెటిజన్లు ఈ విషయంపై ఎవరికి తోచినట్టుగా వాళ్లు స్పందింస్తున్నారు. ముంబై పోలీసులు ఈ విషయంపై ఎలా స్పందిస్తారనేది చూడాలి మరి.
Tags:    

Similar News