'అల్లు' బ్రాండ్ ను నిలబెట్టడం కోసమే ఈ స్టూడియో: చిరంజీవి

Update: 2022-10-01 08:30 GMT
దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి ఉత్సవాలను అల్లు ఫ్యామిలీ ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగమే ఈరోజు ఆయన పేరు మీదుగా నిర్మించిన 'అల్లు స్టూడియోస్' ను గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. తన చేతుల మీదుగా కొత్త స్టూడియోను ప్రారంభించి అల్లు ఫ్యామిలీని అభినందించారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ట్తన మావయ్య అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళి అర్పిస్తున్నట్లు తెలిపారు. నటులలో చాలా కొద్ది మంది మాత్రమే ఇలాంటి ఘనత లభిస్తుందని.. కొందరికి మాత్రమే ఇలాంటి ఆప్యాయతలు అనురాగాలు కురిపించే అభిమానులు ఉంటుంటారని అన్నారు.

"రామలింగయ్య గారి కొడుకుగా ఆయన వేసిన బాటలో కుమారుడు అల్లు అరవింద్ గారు అగ్ర నిర్మాతగా.. అలాగే ఆయన మనవలు బన్నీ - శిరీష్ - బాబీ కూడా ఇదే సినిమా రంగంలో కొనసాగుతూ అగ్ర స్థానంలో ఉన్నారంటే కారణం.. కొన్ని దశాబ్దాల క్రితం ఆయన మదిలో మెదిలిన ఒక ఆలోచన"

"నటన పట్ల మక్కువతో మద్రాస్ వెళ్లి నటుడిగా ఎదగాలని.. తన ఉనికిని చాటుకోవాలని.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందాలని.. ఇండస్ట్రీలో నిలదిక్కుకోవాలనే రామలింగయ్య గారి బలీయమైన ఆలోచనే ఈరోజు ఒక వ్యవస్థగా మారింది. దానికి అల్లు వారు తరతరాలు ఆయన్ని తలుచుకుంటూనే ఉండాలి".

"ఆయన నటుడిగా నిలదొక్కుకొని.. కుమారుడు అల్లు అరవింద్ ను నిర్మాతను చేయాలని గీతా ఆర్ట్స్ ను స్థాపించి ఓ దారి చూపించారు. తండ్రి లక్షణాలు పునికిపుచ్చుకున్న అరవింద్.. అప్పట్లో ఒక ఫైనాన్షియర్ గా కెరీర్ ప్రారంభించి.. తర్వాత రోజుల్లో ఒక అగ్ర నిర్మాతగా నిలదొక్కుకున్నారు"

"అల్లు అర్జున్ - శిరీష్ - బాబీలకు ఒక సూపర్ స్టార్ డమ్ అందుకునే అవకాశం దక్కిందంటే.. ఎప్పటికీ ఆయనను తలచుకుంటూ నివాళులు అర్పించుకోవాలి.. కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అల్లు స్టూడియోస్ అనేది లాభాపేక్ష కోసం ఏర్పాటు చేసిందని నేను అనుకోను. ఇది లాభాపేక్ష కంటే కూడా ఒక స్టేటస్ సింబల్.. ఒక గుర్తింపు"

"ఈ తరమే కాదు.. రాబోయే తరతరాలు కూడా అల్లు రామలింగయ్యను తలుచుకునేందుకు.. 'అల్లు' బ్రాండ్ ను నిలబెట్టడం కోసం.. ఆయన కృతజ్ఞత తీర్చుకోవడం కోసం ఈరోజు ఈ స్టూడియోని నిర్మించారని నేను భావిస్తున్నాను. ఆయన పేరు చిరస్థాయిగా నిలబడేలా ఇలాంటి కృషి చేసిన అల్లు అరవింద్ - అల్లు అర్జున్ - శిరీష్ - బాబీలను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆ ఫ్యామిలీలో భాగం కావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను" అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

'గాడ్ ఫాదర్' మూవీ ప్రమోషన్స్ కోసం సల్మాన్ ఖాన్ తో కలిసి ఈవెంట్ లో పాల్గొనాల్సి ఉన్నందును ముంబైకి వెళ్తున్నానని.. సాయంత్రం జరిగే కార్యక్రమంలో మరిన్ని తన మనసులోని మాటలను ఇంకా వివరంగా చెబుతానని చిరంజీవి పేర్కొన్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News