ఈసారి కూడా టాలీవుడ్‌ లోనే మొదలు

Update: 2021-06-16 01:30 GMT
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా గత ఏడాది థియేటర్లు మూత పడ్డాయి. దాదాపుగా ఆరు నెలలు పూర్తిగా మూత పడగా.. రెండు మూడు నెలలు పాక్షికంగా తెరుచుకున్నాయి. దేశ వ్యాప్తంగా సినిమా థియేటర్లు పూర్తి స్థాయిలో ఓపెన్‌ అయ్యి.. సినిమాలు విడుదల అవుతున్నాయి అనుకున్న సమయంలో మళ్లీ కరోనా సెకండ్ వేవ్‌ రూపంలో వచ్చి థియేటర్లు మూత పడేలా చేసింది. అలా తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో థియేటర్లు కనీసం నెల రోజులు కూడా పూర్తి స్థాయిలో నిండిందే లేదు. కొత్త సినిమాలు వచ్చిందే లేదు. కాని టాలీవుడ్ లో మాత్రం సినిమాల సందడి కొనసాగింది. డిసెంబర్ నుండి మొదలుకుని  మార్చి చివరి వరకు కూడా వరుసగా సినిమాలు విడుదల అయ్యాయి.

డిసెంబర్‌ నుండి మొదలుకుని మార్చి వరకు విడుదల అయిన సినిమాల్లో పలు సూపర్‌ హిట్‌ లు కూడా ఉన్నాయి. దేశంలో ఏ భాష ఇండస్ట్రీలో కూడా సినిమాలు విడుదల అయ్యి సక్సెస్‌ అయ్యిందే లేదు. కాని తెలుగులో మాత్రం ఉప్పెన వంద కోట్లకు పైగా వసూళ్లు చేసింది. వకీల్‌ సాబ్‌.. జాతిరత్నాలు.. క్రాక్‌ ఇంకా పలు సినిమాలు కూడా విడుదల అయ్యి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కొన్ని ప్లాప్‌ లు కూడా పడ్డాయి. తెలుగులో థియేటర్ల ద్వారా విడుదల అయినన్ని సినిమాలు మరే భాషలో కూడా విడుదల అవ్వలేదు. సెకండ్‌ వేవ్‌ కారణంగా మళ్లీ మూడు నెలలు థియేటర్లు క్లోజ్ అయ్యాయి. ఈసారి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీనే మొదలు పెట్టబోతుంది.

మహారాష్ట్రలో థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించేందుకు ప్రభుత్వం ఓకే చెప్పింది. కాని కొత్త సినిమాలు ఏమీ విడుదల కావడం లేదు. కాని తెలుగులో ఇంకా థియేటర్లకు ఓకే చెప్పకుండానే అప్పుడే సినిమా విడుదల తేదీలు వస్తున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్ కు ముందు విడుదల అవ్వాల్సిన సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఎస్ఆర్‌ కళ్యాణమండపం సినిమాను ఆగస్టు 6న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇది మాత్రమే కాకుండా నాని టక్‌ జగదీష్ సినిమాను జులై 30న విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు.

ఇవి కాకుండానే మరికొన్ని సినిమాలు రాబోతున్నాయి. జులై లో థియేటర్లు పునః ప్రారంభం అయితే వెంటనే చిన్న పెద్ద సినిమాలు డజను వరకు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాని ఇతర భాషల సినిమాలు ఈ ఏడాదిలో అసలు వస్తాయా అనేది అనుమానమే అంటున్నారు. టాలీవుడ్‌ మేకర్స్ ప్రేక్షకులపై నమ్మకంతో వరుసగా సినిమాలు విడుదల చేసేందుకు మళ్లీ ధైర్యంగా ముందుకు వస్తున్నారు.
Tags:    

Similar News